logo

రిజర్వేషన్‌ కేంద్రం కొనసాగేలా చర్యలు తీసుకోండి

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో కొనసాగుతున్న రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌ను తరలించకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు...

Published : 07 Jun 2023 05:20 IST

కలెక్టర్‌ హిమాన్షుశుక్లాకు వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, నాయకులు

అమలాపురం కలెక్టరేట్‌, పట్టణం, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో కొనసాగుతున్న రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌ను తరలించకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, మట్టపర్తి నాగేంద్ర తదితరులు మంగళవారం కలెక్టర్‌ హిమాన్షుశుక్లాను కలిసి వినతిపత్రం అందించారు. 20 ఏళ్లుగా ఈ కేంద్రం స్థానికులకు ఎంతగానో ఉపయోగపడుతోందని, కొత్త జిల్లా ఏర్పాటైన నేపథ్యంలో జిల్లా కేంద్రం అమలాపురంలో రిజర్వేషన్‌ కౌంటర్‌ లేకపోతే ప్రజలు ఇబ్బందులు పడాల్సివస్తుందని కలెక్టర్‌కు వివరించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్‌ మున్సిపల్‌ కాంప్లెక్స్‌ ఆవరణలోనే నెలపాటు రిజర్వేషన్‌ కౌంటర్‌ కొనసాగించాలని పురపాలిక శాఖను ఆదేశించారు. ఇదే అంశంపై పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కేంద్ర రైల్వేమంత్రి అశ్విన్‌వైష్ణవ్‌, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిలకు మంగళవారం లేఖ రాశారు. అమెరికా పర్యటనలో ఉన్న రుద్రరాజు మెయిల్‌లో లేఖలు పంపానని తెలిపారు.

కౌంటర్‌ వద్ద తెదేపా నాయకుల నిరసన

అద్దె తగ్గించి ఇవ్వాలి...

రైల్వే రిజర్వేషన్‌ కేంద్రానికి మున్సిపల్‌ అద్దె రూ.30 వేలు తగ్గించి ఇస్తే కోనసీమ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని, వైకాపా ప్రజాప్రతినిధులు అభివృద్ధి ఎలాగూ చేయలేరని, కనీసం ఈ సహాయమైనా చేయాలని మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌ తరలింపును నిరసిస్తూ అమలాపురం మున్సిపల్‌ సర్క్యులర్‌బజార్‌లోని కౌంటర్‌ వద్ద తెదేపా నాయకులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఆనందరావు మాట్లాడుతూ ఎంపీ అనురాధ, మంత్రి విశ్వరూప్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు చొరవతీసుకుని కౌంటర్‌ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మెట్ల రమణబాబు, అల్లాడ సోంబాబు, పెచ్చెట్టి విజయలక్ష్మి, టి.నేతాజీ, వెంకటేశ్వరరావు, చంటి, సత్యవరప్రసాద్‌, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని