logo

విద్యా ప్రగతికి పటిష్ఠ ప్రణాళిక

వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. బడులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు నిర్దేశించిన నాడు-నేడు పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి.

Updated : 10 Jun 2023 05:19 IST

న్యూస్‌టుడే, పామర్రు

వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. బడులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు నిర్దేశించిన నాడు-నేడు పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. పాఠశాలలు తెరిచిన నాడే విద్యార్థులకు అందిస్తామన్న జగనన్న విద్యాకానుక కిట్లకు అవసరమైన సామగ్రి పూర్తి స్థాయిలో రాలేదు. ఉపాధ్యాయుల బదిలీలు ప్రహసనంగా సాగుతున్నాయి. పాఠశాలల సంసిద్థతా కార్యక్రమం అంతంత మాత్రంగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో విద్యా ప్రగతికి¨ అందరినీ సమన్వయపరచుకుంటూ, జిల్లాను అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్నామని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా విద్యాశాఖాధికారిణి ఎం.కమలకుమారి ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో తెలిపారు. ఆ వివరాలు..

న్యూస్‌టుడే : పాఠశాల సంసిద్ధతా కార్యక్రమం ఎలా ఉంది?

డీఈవో : పాఠశాలలు తెరిచే రోజున పండగ వాతావరణం నెలకొనేలా చేస్తున్నాం. ఇప్పటికే చేరికలపై దృష్టి సారించాం. గత వారం రోజులుగా ఉపాధ్యాయులు ఇంటింటీకి వెళ్లి పాఠశాలలు తెరుస్తున్నారని విద్యార్థులను పంపించాలనికోరి వచ్చారు. తరగతి గదులు, మరుగుదొడ్లు శుభ్రం చేసి ఉంచాం. పరిసరాలన్నిటినీ చెత్త, చెదారం లేకుండా అందంగా తీర్చిదిద్దాం. కొన్నిచోట్లయితే తమ పాఠశాల సాధించిన ప్రగతి, పథకాలను వివరిస్తూ కరపత్రాలు కూడా పంపిణీ చేశారు. మొదటి రోజున మామిడితోరణాలు కట్టి అందరికీ ఆహ్వానం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

వేసవి సెలవుల్లో నిర్వహించిన వియ్‌ లవ్‌ రీడింగ్‌ కార్యక్రమం లక్ష్యాలను సాధించిందా?

విద్యార్థులకు చదువు మీద ఏకాగ్రత కలగడానికి, చదువంటే ఇష్టపడడానికి, వచ్చింది మరిచిపోకుండా జ్ఞప్తిలోనే ఉంచడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అమలు చేశాం. చాలా వరకూ సత్ఫలితాలు ఇచ్చిందనే చెప్పాలి. ఉపాధ్యాయులంతా  వాట్సాప్‌ బృందాలను తమ తమ తరగతి విద్యార్థులతో ఏర్పాటు చేసుకుని మంచి కథలు రోజూ పోస్టు చేసేవారు. వాటిని విద్యార్థులు చదివి తిరిగి వారి సొంత మాటల్లో, చిత్రలేఖనం రూపంలో కథను చెప్పేవారు. ఇలా నేను చాలా చోట్ల చూశాను. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకత బయటపడింది.

జగనన్న విద్యాకానుక కిట్ల పరిస్థితి ఏమిటి?

గతేడాది జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జగనన్న విద్యాకానుకల పంపిణీ సక్రమంగా, పక్కాగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలోని 22 మండలాల్లోనూ ఒక్కో స్టాక్‌ పాయింట్‌ పెట్టాం. సామగ్రి అంతా అక్కడికే వస్తోంది. సుమారు 90 శాతం వచ్చేసింది. మిగిలినవి కూడా మరో రెండు రోజుల్లో చేరిపోతాయి. అక్కడి నుంచి పాఠశాల గుమ్మం వద్దకే ప్రత్యేక వాహనాల మీద అన్ని ఒకేసారి రవాణా అయ్యేలా చేస్తున్నాం. కిట్లలో సామగ్రి అంతా నాణ్యతతో ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఎక్కడైనా నాణ్యతా లోపాలుంటే స్టాక్‌ పాయింట్‌ వద్దనే వాటిని పక్కన పెట్టి మంచివి పాఠశాలలకు పంపిస్తాం. బడి తెరిచిన మొదటి రోజునే విద్యార్థులకు ఆయా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో పంపిణీ చేయిస్తాం. జిల్లాకు ఏకరూప దుస్తులు-1,14,828 జతలు, బూట్లు, సాక్సులు-1,14,477, బెల్టులు-79,868, రాత పుస్తకాలు-7,25,610, స్కూల్‌ బ్యాగ్‌లు, అచ్చు పుస్తకాలు-1,14,838, డిక్షనరీలు-12,890, బొమ్మల డిక్షనరీలు-7,308 అవసరం అవుతున్నాయి.

నాడు-నేడు పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. వీటి గురించి ఏమంటారు?

పాఠశాలలు తెరిచేలోగా అదనపు తరగతి గదులు తప్ప మిగిలిన సుందరీకరణ పనులన్నీ పూర్తవ్వాలని విద్యాకమిటీలు, ప్రధానోపాధ్యాయులకు లక్ష్యాలను నిర్దేశించాం. అయితే అనుకున్న రీతిలో ఇవి పూర్తి కాలేదు. కమిటీల వద్ద నిధులున్నా కూడా గుత్తేదారుల వద్ద నుంచి టైల్స్‌, విద్యుద్దీకరణ సామగ్రి రాలేదు. అవి వస్తాయని ఎదురు చూడడంతోనే సమయం గడిచిపోయింది. తాజాగా వీటిని నిబంధనల ప్రకారం కమిటీలు కొనుగోలు చేసుకోవచ్చని ఆదేశాలు అందాయి. ఇక నుంచి పనులు ఊపందుకుంటాయి. 15, నెల రోజుల్లో అయిపోతాయి. అయితే మరుగుదొడ్లు, వంటగదులకు సంబంధించిన టైల్స్‌ను మాత్రం గుత్తేదారులే పాఠశాలలకు తెస్తారు. వాటిని కొనుగోలు చేయొద్దు. చాలా చోట్ల బెంచీలు, డెస్క్‌లు మాత్రం బిగించేశారు. జులై ఒకటో తేదీకి సుందరీకరణ పనులన్నీ అయిపోతాయి.

ఉపాధ్యాయుల బదిలీలు పూర్తయ్యేదెన్నడు?

ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారం అంతా ఆన్‌లైన్లోనే జరుగుతోంది. రాష్ట్ర సంచాలకుల కార్యాలయం నుంచే అమలవుతోంది. మా సిబ్బంది అక్కడే ఉండి జిల్లాకు సంబంధించిన ఖాళీలు, పదోన్నతులు, బదిలీలు అన్నీ చేస్తున్నారు. షెడ్యూలు ప్రకారం పాఠశాలలు తెరిచేనాటికి ఉపాధ్యాయుల బదిలీల పర్వం ముగుస్తుంది.

ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరిగి ప్రాథమిక విద్య దెబ్బతింటోందనే వాదనపై మీరేమంటారు?

వచ్చే కొత్త విద్యా సంవత్సరంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండకుండా చూస్తున్నాం. 20 మంది విద్యార్థులు దాటిన ప్రతి చోటా ఎంటీఎస్‌లో చేరిన వారిని రెండో ఉపాధ్యాయునిగా నియమిస్తాం. తద్వారా ప్రాథమిక విద్య బలోపేతం అవుతుంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని