logo

గోడు వినేవారేరి..!

ఏడాదికోసారి జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవంలో తమ గోడును ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియజేసేందుకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంపై గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నప్పటికీ ఒక్కరూ కూడా

Published : 10 Aug 2022 04:19 IST
మంత్రులు, ఎమ్మెల్యేల డుమ్మా
ఆదివాసీ దినోత్సవంలో గిరిజన నాయకుల ఆవేదన
కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే

సేవాలాల్‌ మహారాజ్‌, ఏకలవ్యుడు, అంబేడ్కర్‌, వెన్నలగంటి రాఘవయ్య, చెంచులక్ష్మి  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి తెలుపుతున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ క్రిస్టినా, కలెక్టర్‌  వేణుగోపాల్‌రెడ్డి, జేసీ రాజకుమారి, గిరిజన సంఘాల నాయకులు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు

డాదికోసారి జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవంలో తమ గోడును ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియజేసేందుకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంపై గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నప్పటికీ ఒక్కరూ కూడా కార్యక్రమంలో పాల్గొనలేదు. ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు వచ్చినా.. వారు ప్రసంగించిన వెంటనే వెళ్లిపోయారని, ఇక తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను ఎవరికి చెప్పాలంటూ వేదికపైనే వాపోయారు నంగార బేరి సేవాలాల్‌ సేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు రామకోటేశ్వరరావు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మంగళవారం రెవెన్యూ కల్యాణ మండపంలో సభ జరిగింది. ఈ సభలో గిరిజన సంఘాల నాయకులు సభ నిర్వహణ పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఏటా సభలో గిరిజనులకు ప్రభుత్వం వైపు నుంచే అందించే రాయితీ రుణాలు, పథకాలు వంటివి పంపిణీ చేసేవారని, లేక ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలను పంపిణీ చేసేవారని, ఈసారి అటువంటివి ఏమీ లేకుండా తూతూమంత్రంగా సభ నిర్వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. యూటీఎఫ్‌(యునైటెడ్‌ ట్రైబల్‌ ఫెడరేషన్‌) నాయకులు కె.సంజయ్‌ మాట్లాడుతూ సభకు హాజరైన వారికి భోజనాలు నిర్వహించే వారని, ఈసారి ఆ ఏర్పాట్లు కూడా చేయకపోవడం బాధాకరమన్నారు.

* ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించిన సభలో తొలుత విద్యార్థులు వివిధ గిరిజనుల సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. అనంతరం జరిగిన సభలో జిల్లాపరిషత్తు చైర్‌పర్సన్‌ క్రిస్టినా, ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు ప్రసంగిచారు.  గిరిజనుల అభివృద్ధి విద్యతోనే సాధ్యమని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. అటవీ భూములను సాగు చేసుకునే గిరిజనులకు 2006 అటవీ హక్కుల గుర్తింపు చట్టం ద్వారా భూమిపై హక్కును కల్పించి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు పంపిణీ చేసిందన్నారు. మైదాన ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతుందన్నారు.  సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా  అందిస్తున్నామని, ఏదైనా సమస్యలుంటే సచివాలయాల్లోని స్పందనలో తెలియజేయవచ్చన్నారు. జేసీ జి.రాజకుమారి మాట్లాడుతూ ఆదివాసి మహిళలు మంచి నైపుణ్యం కలవారని, వారికి స్వయం ఉపాధి కల్పించి చేయూత అందించాలన్నారు. గిరిజన సంఘాల నాయకులు ఎన్‌.విష్ణునాయక్‌, కె.వెంకటేశ్వర్లు, చంద్రానాయక్‌, బాపట్ల ఏసుబాబు, డి.శంకరరావు, డాక్టర్‌ లక్ష్మీనాయక్‌, టి.నరసింహారావు, బి.శంకర్‌నాయక్‌, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసూదనరావు, గిరిజన సంక్షేమ అధికారి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని