logo

రూ.10 క్యారీ బ్యాగ్‌కు 9వేల జరిమానా

వినియోగదారుడికి కనీస సౌకర్యం అందించకుండా, నిబంధనలకు విరుద్ధంగా క్యారీ బ్యాగులకు నగదు వసూలు చేసిన నగరంలోని ప్రముఖ వస్త్ర దుకాణ తీరును గుంటూరు జిల్లా వినియోగదారుల ఫోరం తప్పు పట్టింది.

Published : 13 Aug 2022 06:14 IST

నగరంపాలెం, న్యూస్‌టుడే: వినియోగదారుడికి కనీస సౌకర్యం అందించకుండా, నిబంధనలకు విరుద్ధంగా క్యారీ బ్యాగులకు నగదు వసూలు చేసిన నగరంలోని ప్రముఖ వస్త్ర దుకాణ తీరును గుంటూరు జిల్లా వినియోగదారుల ఫోరం తప్పు పట్టింది. గుంటూరులోని శ్రీనగర్‌ వాసి న్యాయవాది పోతుగుంట్ల సాయిసూర్య గత ఏడాది మే 5వ తేదీన లక్ష్మీపురంలోని వెస్ట్‌ సైడ్‌ షోరూంలో రూ.5,689 విలువ గల వస్త్రాలను కొనుగోలు చేశారు. అనంతరం వస్త్రాలకు తమ కంపెనీ లోగోతో ముద్రించిన క్యారీ బాగును అందించి దాని కోసం రూ.పది నగదు కూడా వసూలు చేశారు. క్యారీ బాగ్‌కు నగదు వసూలుపై స్టోరు మేనేజర్‌ను న్యాయవాది తేజ ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పలేదు. క్యారీబాగు షోరూం ఇవ్వదని ఎక్కడా బోర్డు పెట్టకపోవడంతో తీవ్ర అసౌకార్యనికి గురయ్యానని, అదే ఏడాది జులై 9న షోరూం స్టోరు మేనేజర్‌తో పాటు ముంబై బాంద్రాలోని ప్రధాన కార్యాలయ సీఈవోలపై జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. కేసు విచారించిన ఫోరం అధ్యక్షురాలు తాడికొండ సునీత, సభ్యులు కె.విజయలక్ష్మి, పున్నారెడ్డి స్టోర్‌ వ్యవహార శైలిని తప్పు పట్టారు. షోరూం లోగోతో వినియోగదారులకు ఉచితంగా క్యారీబాగులు అందజేయాలని, ఫిర్యాదుదారుడు తేజ నుంచి క్యారీ బాగు కోసం వసూలు చేసిన రూ.10తో పాటు మానసిక క్షోభకు రూ.6 వేలు, మరో రూ.3 వేలు ఖర్చులతో కలిపి ఆరు వారాల్లో చెల్లించాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు