logo

అకాడమీలు ప్రారంభించిన ఘనత ఏసీఏదే

ఔత్సాహిక క్రికెటర్లను ప్రోత్సహించేందుకు దేశంలో అకాడమీలు ప్రారంభించిన ఘనత ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)కే దక్కుతుందని ఆ సంఘం సీఈఓ ఎం.వెంకటశివారెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెసిడెన్షియల్‌....

Published : 18 Aug 2022 06:15 IST

సీఈఓ వెంకట శివారెడ్డి
న్యూస్‌టుడే, మంగళగిరి (తాడేపల్లి)


మంగళగిరిలో క్రికెట్‌ స్టేడియం

ఔత్సాహిక క్రికెటర్లను ప్రోత్సహించేందుకు దేశంలో అకాడమీలు ప్రారంభించిన ఘనత ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)కే దక్కుతుందని ఆ సంఘం సీఈఓ ఎం.వెంకటశివారెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెసిడెన్షియల్‌ అకాడమీలు ఆంధ్రాలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ‘కడపలో స్కూల్‌ బాయ్స్‌ అండర్‌-15కు రెసిడెన్షియల్‌ అకాడమీ నిర్వహిస్తున్నాం. మంగళగిరిలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కింద ఉమెన్స్‌ అకాడమీ నడుపుతున్నాం. టోర్నమెంట్‌ సమయంలో ఉమెన్స్‌కి క్యాంపు నిర్వహిస్తాం. అండర్‌-19 డిగ్రీ కళాశాల విద్యార్థులకు విజయనగరంలో అకాడమీ నిర్వహిస్తున్నామని’ ఆయన పేర్కొన్నారు.

న్యూస్‌టుడే: ఏసీఏ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది?
ఏసీఏ సీఈఓ :
ఇప్పుడే దేశవాళీ సీజన్‌ ప్రారంభమైంది. గత సీజన్‌లో దేశంలో బీసీసీఐ టోర్నమెంట్స్‌ అధికంగా చేసిన ఘనత ఏసీఏకి ఉంది. ఉమెన్స్‌ అండర్‌-19, సీనియర్స్‌ సెలక్షన్స్‌ అంతర్‌ జిల్లాల స్థాయిలో నిర్వహిస్తున్నాం. ఇప్పుడు పూర్తయ్యాయి. అండర్‌-16, 19 మెన్‌ అంతర్‌ జిల్లాల స్థాయిలో సెలక్షన్స్‌ జరుగుతున్నాయి. జోనల్స్‌ అనంతరం స్టేట్‌ టీమ్స్‌ తీసుకున్న తరువాత బీసీసీఐ షెడ్యూల్‌ మొన్ననే విడుదల చేశారు. 

న్యూ: ఎన్ని టోర్నమెంట్లు చేశారు?
జ:
బీసీఐ టోర్నమెంట్లు ఆరు, ఎన్‌సీఏ క్యాంపులు రెండు నిర్వహించాం. లక్ష్మణ్‌ ఒక ఎన్‌సీఏ టోర్నమెంట్‌ను విజయవాడలో చేయగా జాతీయ స్థాయిలో ఆరు జట్లు వచ్చాయి. ఒక ఆల్‌ ఇండియా హైపెర్ఫార్మెన్సీ క్యాంపును అనంతపురంలో లక్ష్మణ్‌ వ్యక్తిగతంగా వచ్చి ప్రారంభించారు.

న్యూ: ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ పర్మిషన్‌ ఉందా?
జ:
అనుభవం, నిర్వహించగల స్థోమత ఉందనే ఉద్దేశంతో ఇన్ని టోర్నమెంట్లు ఇచ్చారు. ఆంధ్రా క్రికెట్‌ సంఘం సామర్థ్యాన్ని చూసి దేశంలో నాలుగో రాష్ట్రంగా గుర్తించారు. ఏపీఎల్‌ (ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌)కు అనుమతి ఇచ్చారు. కర్ణాటక, తమిళనాడు, సౌరాష్ట్ర తరువాత నాలుగో రాష్ట్రం మనది. ఏపీఎల్‌ మెన్స్‌ ఇటీవల వైజాగ్‌లో నిర్వహించాం. స్సందన బాగుంది.

న్యూ:  ఐపీఎల్‌ల్లో మనవారికి స్థానం లభిస్తుందా?
జ: 
 రానున్న రోజుల్లో ఐపీఎల్‌కు మన ఆంధ్రా నుంచి నలుగురైదుగురు క్రికెటర్లకు అవకాశం కచ్చితంగా ఉంటుందని ఆశిస్తున్నాం. దీనితో పాటు ఒకడుగు ముందుకువేసి ఏసీఏ ఉమెన్స్‌ ఏపీఎల్‌ తరహాలో కాకపోయినా ఉమెన్స్‌ టి-20 టోర్నమెంటును దేశంలోనే తొలిసారిగా మనమే ప్రారంభించాం. వచ్చే ఏడాది దాదాపుగా బీసీసీఐ ఉమెన్స్‌ ఐపీఎల్‌ను కూడా ప్రారంభించే అవకాశం ఉంది.

న్యూ: మంగళగిరి క్రికెట్‌ స్టేడియం అంతర్జాతీయ స్థాయి టోర్నమెంటుకు సిద్ధమేనా?
జ:
నేటికి తొమ్మిది వికెట్స్‌ ఉన్నాయి. సెంట్రల్‌ వికెట్స్‌ అన్నీ టఫ్‌మోడ్‌ వికెట్స్‌, డ్రస్సింగ్‌ రూములు, రోడ్లు, డ్రైయిన్లు పూర్తి చేయాల్సి ఉంది. బీసీసీఐ నుంచి 50 శాతం రియంబర్స్‌మెంట్‌ ఇస్తుంది. అది రాగానే పూర్తి స్థాయిలో స్టేడియాన్ని సిద్ధం చేస్తాం. జాతీయ స్థాయి టోర్నమెంట్‌ నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం.

న్యూ:  రంజీకి అవకాశం ఉందా?
జ:
ఈ ఏడాది మనకు రంజీ అవకాశం వస్తే ఇక్కడే ఆడిస్తాం. ఒక మంచి మ్యాచ్‌ డిసెంబర్‌లో నిర్వహిస్తాం.

న్యూ:  ఔత్సాహిక క్రికెటర్లకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
జ: 
 రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్లను ప్రాతిపదికగా తీసుకుని 64 సబ్‌ సెంటర్లు నడుపుతున్నాం. సమీప ప్రాంత ఔత్సాహిక క్రికెటర్లు దూరం వెళ్లకుండా వారికి అందుబాటులోకి సబ్‌ సెంటర్లను తీసుకొచ్చాం. వీటిలో నెట్స్‌ ఉంటాయి. కోచ్‌ని నియమించాం. రోజుకు రెండుసార్లు ప్రాక్టీస్‌ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశాం. జిల్లా స్థాయిలో గ్రౌండ్స్‌ అందుబాటులోకి తెస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని