logo

యూరియా ఏదయా?

గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో యూరియా కొరత కర్షకులను వెంటాడుతోంది. డెల్టాలో జొన్న, మొక్కజొన్న, పల్నాడులో మొక్కజొన్నతోపాటు వరికి యూరియా అవసరం ఉండటంతో ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది

Published : 04 Feb 2023 06:43 IST

ఆర్బీకేల్లో నిండుకుంటున్న నిల్వలు
ఈనాడు, అమరావతి

గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో యూరియా కొరత కర్షకులను వెంటాడుతోంది. డెల్టాలో జొన్న, మొక్కజొన్న, పల్నాడులో మొక్కజొన్నతోపాటు వరికి యూరియా అవసరం ఉండటంతో ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. అందుకు అనుగుణంగా నిల్వలు లేకపోవడంతో కొరత ఏర్పడింది. పదిరోజుల తర్వాత అవసరమయ్యే రైతులు కూడా ముందుగానే కొని నిల్వ చేయడంతో సమస్య అధికమైంది. మూడు జిల్లాల పరిధిలో వేల టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయశాఖ చెబుతున్నా రైతులు మాత్రం కొనుగోళ్లను తగ్గించడం లేదు. దీనికితోడు ఆర్బీకేలకు వచ్చిన లారీ వచ్చినట్లే విక్రయిస్తుండడంతో ఎప్పటికప్పుడు నిల్వలు నిండుకుంటున్నాయి. మొక్కజొన్నకు ఒక్కొక్క ఎకరాకు ఆరు బస్తాల వరకు యూరియా చల్లుతున్నారు. దీంతో డెల్టాలో పదెకరాలు సాగుచేసే రైతులు సైతం ఒక్కొక్కరు 60 బస్తాల వరకు యూరియా కొనుగోలు చేస్తుండటం గమనార్హం. లారీకి 440 బస్తాలు ఆర్బీకేకు వచ్చిన వెంటనే అప్పటికప్పుడే విక్రయమవుతున్నాయి.

రూ.350కు పైగా వసూలు

ఆర్బీకేలు, డీసీఎంఎస్‌లు, సొసైటీల్లో 45కిలోల యూరియా బస్తా రూ.266.50కే లభిస్తోంది. అదే ప్రైవేటు వ్యాపారుల వద్ద రూ.320 నుంచి రూ.370 వరకు చెల్లించి రైతులు కొంటున్నారు. యూరియాకు డిమాండ్‌ ఉండటంతో ఆయా కంపెనీలు లింకు ఎరువులు అంటగట్టడంతోపాటు రవాణా ఛార్జీలు సైతం వ్యాపారులపైనే వేస్తున్నాయి. కొన్ని రకాల కాంప్లెక్స్‌ ఎరువులు ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు విక్రయాలు జరుగుతున్నాయి. కాంప్లెక్స్‌ ఎరువులు కొనుగోలు చేస్తేనే యూరియా సరఫరా చేస్తామని కొన్ని కంపెనీలు షరతు విధించాయి.

గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలో వేల టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయాధికారులు లెక్కలు చెబుతున్నారు. ఆయా జిల్లాలకు వచ్చే యూరియాలో 50శాతం మార్క్‌ఫెడ్‌కు, 50శాతం ప్రైవేటు వ్యాపారులకు సరఫరా అవుతోంది. మార్కెట్‌లో యూరియాకు డిమాండ్‌ ఏర్పడటంతో మార్క్‌ఫెడ్‌ గోదాములకు వెళ్లకుండానే రేక్‌ పాయింట్‌ నుంచి నేరుగా ఆయా ఆర్బీకేలకు సరఫరా చేస్తున్నారు. దీనికితోడు మార్క్‌ఫెడ్‌ వద్ద ఉన్న బఫర్‌ నిల్వలు కూడా కరిగిపోయాయి. ఆర్బీకేలు, డీసీఎంఎస్‌లు, సొసైటీల్లో నిల్వలు కరిగిపోవడంతో ప్రైవేటు వ్యాపారులు ఆచితూచి విక్రయిస్తున్నారు. తెలిసిన రైతులకే అధికధరకు విక్రయిస్తున్నారు. బుధ, గురువారాల్లో రేక్‌లు వచ్చినా డిమాండ్‌ మేరకు సరఫరా చేయలేని పరిస్థితి. ఫిబ్రవరి 20 వరకు వరుసగా రేక్‌లు వస్తేనే కొంత ఉపశమనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.  

రూ.350 వెచ్చించినా గడ్డ కట్టిన యూరియా

రబీలో ఆరు ఎకరాల్లో వరి సాగుచేస్తున్నా. నకరికల్లు మండలంలోని ఓ ఎరువుల దుకాణంలో రెండు యూరియా బస్తాలు కొన్నా. ఒక్కొక్క బస్తాకు రూ.350 చొప్పున చెల్లించినా బిల్లు మాత్రం ఇవ్వలేదు. కొనుగోలు చేసిన యూరియాను పొలానికి తీసుకెళితే మొత్తం గడ్డలు కట్టింది. చల్లడానికి ఇబ్బందులు పడ్డాను.  
 చీళ్ల శ్రీనివాసరావు, రైతు, చీమలమర్రి గ్రామం


అధికంగా వేస్తే అనర్థమే..

మొక్కజొన్న, జొన్నకు ఎకరాకు 96కిలోల నైట్రోజన్‌ సరిపోతుంది. ఈ లెక్కన ఎకరాకు నాలుగు బస్తాలు వేయాలి. అయితే కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు ఎక్కువగా ఉండటంతో వాటిని కొనుగోలు చేయలేక ఆర్బీకేల్లో రూ.266.50లకే  బస్తా వస్తుండటంతో ప్రత్యామ్నాయంగా యూరియా వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో సగటున ఎకరాకు 8 నుంచి 10 బస్తాల వరకు చల్లుతున్నారు. కొందరు రైతులు మూడో విడతకు అవసరమైన యూరియా నిల్వ చేసుకోవడం కొరతకు కారణమవుతోంది. పరిమితికి మించి నైట్రోజన్‌ భూమిలోకి వేయడం వల్ల భూముల్లో ఉప్పుశాతం పెరిగి చౌడుగా మారే ప్రమాదం ఉంది. దీంతోపాటు నేలలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోతాయి. పంటపచ్చగా ఏపుగా పెరగడం వల్ల చీడపీడలు పెరుగుతాయి. అవసరాలకు మించి వేసినా  అనర్థాలే ఎక్కువని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని