logo

కేబుల్‌ వార్‌!

గుంటూరు నగరంలో గత కొంతకాలం నుంచి కేబుల్‌ వార్‌ నడుస్తోంది. ప్రస్తుతం అది పతాక స్థాయికి చేరింది. నగరంలో పలు నెట్‌వర్క్‌లు ఉన్నాయి. వారి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో గొడవలు చోటుచేసుకుంటున్నాయి.

Published : 26 Mar 2023 04:09 IST

నగరంలో పలుచోట్ల వైర్లు కత్తిరింపు
వినియోగదారులకు నిలిచిన ప్రసారాలు
ఈనాడు, అమరావతి

గుంటూరు నగరంలో గత కొంతకాలం నుంచి కేబుల్‌ వార్‌ నడుస్తోంది. ప్రస్తుతం అది పతాక స్థాయికి చేరింది. నగరంలో పలు నెట్‌వర్క్‌లు ఉన్నాయి. వారి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. చివరకు దీనికి రాజకీయ రంగు పులుముకుంది. ప్రస్తుతం చేస్తున్న నెట్‌వర్క్‌ను వదిలేసి తమ నెట్‌వర్క్‌ పరిధిలోకి మారాలని, లేకుంటే మీ వినియోగదారులకు ప్రసారాలు రాకుండా అసౌకర్యం కలిగిస్తామని, ఆపరేటర్‌గా కొనసాగడం కష్టమని ఓ నేత బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. ఒక యాజమాన్యానికి చెందిన వైర్లను మరొకరు కత్తిరించడం వంటివి చేస్తూ అంతిమంగా ప్రసారాలు రాకుండా అడ్డుకుంటున్నారు. శనివారం ఇది మరింత వివాదాస్పదమైంది.

విజయవాడ నుంచి గుంటూరు నగరంతో పాటు చుట్టు పక్కల పరిసరాల్లోని కేబుల్‌ నెట్‌వర్క్‌కు ఫీడ్‌ అందకుండా పలుచోట్ల కేబుల్‌ వైర్లను కత్తిరించారు. దీంతో వినియోగదారులకు కేబుల్‌ ప్రసారాలు, ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. ‘కరెంటు స్తంభాలపై ఉన్న కేబుల్‌ వైర్లను విద్యుత్‌ శాఖ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కత్తిరించారని, దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని’ కేబుల్‌ ఆపరేటర్‌ వర్గాలు పేర్కొన్నాయి. ‘2021లో కూడా కేబుల్‌ వైర్లను కత్తిరించగా అప్పట్లో విద్యుత్‌శాఖ అధికారులకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాం. దానిపై స్టే వచ్చింది. అది ఇంకా వెకేట్‌ కాలేదు. అది  కొనసాగుతుండగానే మరోసారి విద్యుత్‌శాఖ అధికారులు తాజాగా తమ కేబుల్‌వైర్లను కత్తిరించారని’ తెలిపారు. నగరంలోని సుమారు 100 నుంచి 150కు పైగా ప్రదేశాల్లో కరెంట్‌ స్తంభాలపై ఉన్న కేబుల్‌ వైర్లను కత్తిరించారు. మిగిలిన నెట్‌వర్క్స్‌ జోలికి వెళ్లలేదని, కేవలం ఓ నాయకుడి ఆదేశాల మేరకు అధికారులు ఇలా వ్యవహరించి ఉంటారని పలువురు కేబుల్‌ ఆపరేటర్లు, గుంటూరులోని దాని నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి కేబుల్‌వైర్లను కత్తిరించగా తిరిగి తాము వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకోగా అప్పుడు కత్తిరించారని, దీంతో తాము శనివారం సాయంత్రం డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ‘విద్యుత్‌ స్తంభాలపై కేబుల్‌ తీగలు అడ్డదిడ్డంగా ఉన్నాయి. కేబుల్‌ బండిళ్లు పోల్స్‌పైనే వదిలేస్తున్నారు. దీని వల్ల మా లైన్‌మెన్లు స్తంభాలు ఎక్కినప్పుడు ఆ వైర్లలో కాళ్లు, చేతులు ఇరుక్కుని చివరకు ప్రమాదాలకు గురవుతున్నారు. అందువల్లే వాటిని తొలిగిస్తున్నామని’ విద్యుత్‌ శాఖ వర్గాలు అంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని