logo

మరెందుకు ఆలస్యం.. రాజీనామా చేయండి..

రాజీనామా చేసేయండి.. హాయిగా పార్టీ ప్రచారంలో పాల్గొనండి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మళ్లీ తీసుకుంటామని ప్రస్తుతానికి అంతా చూసుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు.

Updated : 29 Mar 2024 05:14 IST

వాలంటీర్లకు వైకాపా ఎమ్మెల్యేల ఫోన్లు
ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట

రాజీనామా చేసేయండి.. హాయిగా పార్టీ ప్రచారంలో పాల్గొనండి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మళ్లీ తీసుకుంటామని ప్రస్తుతానికి అంతా చూసుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు. ఓ ఎమ్మెల్యే అయితే నేరుగా ఆయనే వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. 27న నియోజకవర్గంలోని వాలంటీర్లకు ఫోన్‌ చేయగా, 28న అందరూ రాజీనామా చేయాలని ఆదేశించారు. అయితే వాలంటీర్ల నుంచి పెద్దగా స్పందన రాలేదు. పార్టీ కార్యక్రమాలకు తమను వాడుకొని బలిపశువులను చేస్తారని కొందరు ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా కేవలం ప్రభుత్వం చెప్పిన పనులే చేస్తామని, పార్టీ ప్రచారాల్లో పాల్గొనబోమని, ఎవరి కోసమో తామెందుకు సస్పెండ్‌ కావాలంటూ కొందరు వాలంటీర్లు వెనకడుగు వేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి ఎన్నికల్లో మళ్లీ వైకాపానే వస్తుందని గ్యారెంటీ ఏంటని, ఒకవేళ వచ్చినా తమనే మళ్లీ తీసుకుంటారా.. లేక వేరే కొత్త వారిని తీసుకుంటే తమ పరిస్థితి ఏంటని కూడా ఆలోచించి తటస్థంగా ఉంటున్నారు.

ఎమ్మెల్యేల నుంచి పెరిగిన ఒత్తిడి..

రాజీనామా చేసి పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిందేనని కొందరు ఎమ్మెల్యేలు వాలంటీర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. కావాలంటే ఈ రెండు నెలలు భోజనం పెట్టడంతో పాటు మంచి వేతనం ఇస్తామని, పార్టీకి సేవలందించాలని గట్టిగా చెబుతుండటంతో కొందరు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాక ముందే అన్ని నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు వాలంటీర్లకు తాయిలాలు పంపిణీ చేశారు. కొందరైతే నగదు అందజేశారు. తీసుకున్నవాళ్లకు ఫోన్లు వెళ్తున్నాయి. ఈ నాలుగేళ్లలో వాలంటీర్లకు వారి పరిధిలోని ఓటర్లు పరిచయం కావడం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించారు కాబట్టి వీరినే వాడుకోవాలని ఎమ్మెల్యేలు చూస్తున్నారు. వైకాపాకు కాకుండా వేరే పార్టీకి ఓటు వేస్తే పింఛన్‌ రాదని, మిగతా సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకు రావని పదేపదే చెప్పించేలా చూడాలని ఎమ్మెల్యేల ఎత్తుగడ. కానీ ఇలా కరపత్రాలు పంపిణీ చేస్తూ వైకాపాకు ప్రచారం చేయడం వల్ల కొందరు వాలంటీర్లు సస్పెండ్‌ అయ్యారు. దీంతో తాము ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సి వస్తుందని కొందరు భయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని