logo

కర్షకుల కష్టాలు కనిపించవా..?

పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు.

Published : 19 Apr 2024 05:31 IST

పూర్తికాని పెదవడ్లపూడి ఎత్తిపోతల పథకం
రూ.కోటి కేటాయించలేకపోయిన వైకాపా ప్రభుత్వం

ఎత్తిపోతల వద్ద నిర్మించిన పంపుహౌస్‌

దుగ్గిరాల, న్యూస్‌టుడే: పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. వ్యవసాయాన్ని పండగ చేస్తామని గొప్పలు చెప్పడం తప్పా వైకాపా ప్రభుత్వం తమకు చేసింది ఏమీ లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల పథకానికి రూ. కోటి కేటాయిస్తే నిర్మాణం పూర్తయి రైతులకు ఇబ్బందులు తప్పేవి. తెదేపా హయాంలో మొదలు పెట్టారు కాబట్టి ఇస్తే చంద్రబాబునాయుడికి పేరు వస్తుందని అనుకున్నారేమో కానీ బడ్జెట్ కేటాయించలేదు. దీంతో రైతుల కష్టాలు రెట్టింపవుతూ వస్తున్నాయి.  

కాల్వ పరిస్థితి: పశ్చిమడెల్టాకు 4 మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల నీరు అందదు. పంటలు పండక, ఇంజిన్లతో నీళ్లు పెట్టుకోవడం వల్ల పెట్టుబడి రెండింతలు అవుతోంది. కొన్నిసార్లు పంటలు పూర్తిగా నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి.

నీరు కాల్వలోకి వచ్చే అవుట్లెట్

పూర్తయ్యేనా..? తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పటి ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ కాల్వ వెంట వరుసగా నడిచి రైతుల అవస్థలు గమనించారు. పెదవడ్లపూడి వద్ద ఎత్తిపోతల నిర్మించాలని తీర్మానించి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఎత్తిపోతలకు సుమారు రూ.14.3 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.13 కోట్లు వరకు బిల్లుల చెల్లింపులు కూడా జరిగాయి.

బిల్లుల పరిస్థితి: రూ.1.10 కోట్లు వరకూ బిల్లులు సిద్ధంగా ఉన్నాయి. వాటికి బడ్జెÆట్ ఈ ప్రభుత్వం కేటాయించకపోవడం వల్ల పనులు ఆగిపోయాయి. అవి వచ్చేస్తే 27 వేల ఎకరాల ఆయకట్టు రైతుల కష్టాలు తీరేవి.

ఛానల్‌ పేరు: పెదవడ్లపూడి ఉన్నత వాహిని (హై లెవల్‌ఛానల్‌)
ఆయకట్టు:   27000 ఎకరాలు
పరిధి: దుగ్గిరాల, తెనాలి గ్రామీణ, చేబ్రోలు, కాకాని, మంగళగిరి మండలాలు


ఏటా నష్టపోతూనే ఉన్నాం  
 -దేశబోయిన శ్రీనివాసరావు, రాజు, రైతులు, కంఠంరాజుకొండూరు

సకాలంలో నీరు అందక ఏటా రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా 100 ఎకరాల్లో రెండో పంట వేయలేకపోయారు. ఎత్తిపోతల పూర్తి చేస్తే హాలికులకు ఇక ఇబ్బందులు ఉండవు.


చందాలు వేసుకుని బాగు చేసుకుంటున్నాం..  
- కొరిటాల శివరామకృష్ణప్రసాద్‌, రైతు, కొండూరు

ఎత్తిపోతల పూర్తి అయితే ఇక కష్టాలు ఉండవు. నేను 32 ఎకరాలు సాగు చేస్తున్నాను. ఇటీవల కాల్వలో గేట్లు ఇబ్బంది అయితే రైతులమే చందాలు వేసుకుని గేటు వేయించుకున్నాం. రైతులకు రెండో పంటే ఆధారం. పెదవడ్లపూడి వద్ద లిఫ్ట్‌ పనులు పూర్తి అయితే మా రైతులంతా ఆనందంగా ఉంటారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని