logo

జీవితాన్ని కలరా‘జే’సింది..

రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు.

Published : 19 Apr 2024 06:29 IST

లివర్‌ పాడై.. క్లోమ గ్రంధి దెబ్బతిని
మంచానికే  పరిమితమైన మద్యం బాధితులు
బజారున పడ్డ కుటుంబాలు ఎన్నో
ఈనాడు-బాపట్ల, న్యూస్‌టుడే- రేపల్లె అర్బన్‌, వేమూరు, భట్టిప్రోలు

రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. వైకాపా ప్రభుత్వం విక్రయిస్తున్న నాసిరకం మద్యం తాగి అస్వస్థతకు గురవడంతో వైద్యశాలను ఆశ్రయించాడు. ఇంటి యజమాని పక్షవాతంతో బాధపడటంతో జీవనం తలకిందులైంది. మధు భార్య స్థానిక ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు


మద్య నిషేధం చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరదీసింది. జే-బ్రాండ్‌ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. సర్కారీ మద్యం తాగి అనారోగ్యంపాలై ఎన్నో నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. దుకాణాల్లో నాసిరకం బ్రాండ్లు పెట్టి మద్యం ప్రియులను ఆర్థికంగా దోచుకోవటమే కాదు.. చివరకు వారి ఆరోగ్యాలను ఫణంగా పెట్టింది. రేపల్లె మండలం పోటుమెరకలో  మద్యం తాగి ఇద్దరు చనిపోయారు. ఎంతోమంది అనారోగ్యం పాలై జీవచ్ఛవాల్లా మారారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మరణాలు పెద్దఎత్తున సంభవించినా సర్కార్‌ మాత్రం వారు చనిపోవటానికి అనేక కారణాలు ఉన్నాయంటూ తప్పించుకుంటోంది.


పోటుమెరకలో ఇద్దరి ప్రాణాలు ఆవిరి

రేపల్లె మండలం పోటుమెరకలో 2022 జులై 15న ప్రభుత్వ మద్యం తాగి గరికపాటి నాంచారయ్య(75), రేపల్లె రత్తయ్య(60) మృతి చెందారు. ఇసుకపల్లిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో పోటుమెరకకు చెందిన ఓ వ్యక్తి మద్యం సీసాలు కొనుగోలు చేశాడు. గ్రామంలో జరిగిన ఓ పెదకర్మ కార్యక్రమంలో పాల్గొన్న అయిదుగురు వ్యక్తులు 8 పీఎం, ఓల్డ్‌ ఎడ్వయిజర్‌ మందు తాగారు. భోజనం చేసిన కొద్దిసేపటికే వాంతులై మరణించారు. మరో ముగ్గురు రేపల్లెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది బతికి బయటపడ్డారు.


కిడ్నీలు దెబ్బతిన్నాయి

భట్టిప్రోలుకు చెందిన   మురుగుడు నారాయణ పెయింటింగ్‌ పని చేస్తాడు. రోజూ పని చేశాక మద్యం తాగే అలవాటు ఉంది. ఏడాది క్రితం ఆరోగ్యం క్షీణించింది. వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించగా కిడ్నీలు దెబ్బతిన్నాయని చెప్పారు. మెరుగైన వైద్య సేవలు చేయించుకునే స్థోమత లేక ఇబ్బంది పడుతున్నాడు. ఆరోగ్యం దెబ్బతినడంతో పెయింట్‌ పని చేయలేక కుమారుడిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ పోషణ కష్టంగా మారడంతో వైద్య సేవలు సైతం సరిగా చేయించుకోలేకపోతున్నాడు.


కాలేయం దెబ్బతిన్న కేసులే అధికం

మద్యంతో అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరుతున్నవారు కోకొల్లలుగా ఉంటున్నారు. ఒక్క గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోనే 2020 నుంచి 2023 వరకు నాలుగేళ్లలో 11,580 మంది చికిత్సలు పొందారు. గతంలో ఇంత పెద్దసంఖ్యలో చికిత్సలు పొందిన దాఖలాలు లేవని జీర్ణకోశ వ్యాధుల విభాగం వైద్యులు చెబుతున్నారు. వారానికి మూడు రోజుల ఓపీ ఉంటుందని ఆ వ్యవధిలో సుమారు 150 నుంచి 200 కేసులు వస్తాయి. వాటిల్లో మూడింతలు మద్యం సేవించి కాలేయం, కిడ్నీలు, గుండె బలహీనపడటం, చూపుపోవటం, నరాల సంబంధిత సమస్యలతో  బాధపడుతూ ఆసుపత్రుల గుమ్మం తొక్కుతున్నారు. ఇంత తీవ్రత గతంలో లేదని చెప్పారు. మద్యం కాలేయంలోకి చేరి అక్కడ ఉన్న అన్ని కణాలను దెబ్బతీస్తుంది. నాలుకలా మెత్తగా ఉండే లివర్‌ మద్యం తాగేవారిలో గట్టిపడిపోయి దాన్ని మార్చాల్సిన స్థాయికి వెళుతుంది. పాడైన లివర్‌తో బాధపడేవారిలో పొట్టలోకి నీరు చేరటం, రక్తపు వాంతులు కావటం, కామెర్లు ఏర్పడటం, చివరకు కోమాలోకి వెళ్లి ప్రాణాపాయం సంభవిస్తుంది. ఆరోగ్య పరంగానే కాదు వారు కుటుంబపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక సమస్యలు ఏర్పడి కుటుంబం చిన్నాభిన్నమవుతుందని వైద్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని