logo

లంచం తీసుకున్న రెవెన్యూసిబ్బందికి జైలుశిక్ష ఖరారు

భూమి విలువ ధ్రువపత్రం ఇవ్వడానికి లంచం తీసుకుంటూ దొరికిన ఇద్దరు రెవెన్యూ అధికారులకు జైలుశిక్షలు ఖరారయ్యాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ (డీఎస్పీ) ఆనంద్‌కుమార్‌ తెలిపిన వివరాలు..

Published : 09 Dec 2021 02:26 IST

జగదేవపూర్‌, న్యూస్‌టుడే: భూమి విలువ ధ్రువపత్రం ఇవ్వడానికి లంచం తీసుకుంటూ దొరికిన ఇద్దరు రెవెన్యూ అధికారులకు జైలుశిక్షలు ఖరారయ్యాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ (డీఎస్పీ) ఆనంద్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. గజ్వేల్‌ నివాసి కల్యాణ్‌కు జగదేవపూర్‌ మండలం ఇటిక్యాలలో 24 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వాటిపై బ్యాంకులో అప్పు తీసుకోవడానికి భూమి విలువ ధ్రువపత్రం అవసరమైంది. జగదేవపూర్‌ తహసీిల్దారు కార్యాలయంలో 2008లో దరఖాస్తు చేసుకున్నారు. నాడు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) హనుమంతరావు (ప్రస్తుతం హైదరాబాద్‌లో కుమారుడి వద్ద ఉన్నారు), ఇటిక్యాల వీఆర్వో వెంకటనర్సింహారెడ్డి (ప్రస్తుతం జగదేవపూర్‌లోనే ఉద్యోగి) లంచం డిమాండ్‌ చేశారు. కల్యాణ్‌ తన మామ బుక్క వెంకటేశానికి విషయం చెప్పారు. రూ.7 వేలు ఇవ్వడానికి వెంకటేశం అంగీకరించారు. ఏసీబీ అధికారులకు ఈ విషయమై అప్పుడే సమాచారమిచ్చారు. వరాఉ వలపన్ని 2008 ఆగస్టు 5న లంచం తీసుకుంటున్న హనుమంతరావు, వెంకటనర్సింహారెడ్డిని ఘటనా స్థలంలో ఆధారాలతో సహా పట్టుకున్నారు. హైదరాబాద్‌ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. నేరం రుజువైనందున ఏసీబీ న్యాయమూర్తి సాంబశివరావు వారిద్దరికీ రెండు సెక్షన్ల ప్రకారం బుధవారం శిక్షలు ఖరారు చేశారు. సెక్షన్‌ 7 ప్రకారం ఇద్దరికీ ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. సెక్షన్‌ 13(1)(డి), 13(2) ప్రకారం రెండేళ్ల కఠిన కారాగారం, రూ.2 వేల చొప్పున జరిమానా విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని