logo

నిధులు విదిలించరుపనులు పట్టాలెక్కవు

రైల్వే బడ్జెట్‌ వస్తోందంటే.. కొత్త రైళ్లు, కొత్త లైన్ల కోసం ఆశగా ఎదురు చూసే రోజులు పోయాయి. గతంలో ప్రకటించిన ప్రాజెక్టులకు ఈ సారైనా సరిపడా నిధులు అందజేస్తారా, పునాదులు పడతాయా.. నిధులు మంజూరవుతాయా

Updated : 22 Jan 2022 05:21 IST

ముందుకు కదలని రైల్వే ప్రాజెక్టులు
ఈ బడ్జెట్‌పైనా గంపెడు ఆశలు
ఈనాడు, హైదరాబాద్‌

రైల్వే బడ్జెట్‌ వస్తోందంటే.. కొత్త రైళ్లు, కొత్త లైన్ల కోసం ఆశగా ఎదురు చూసే రోజులు పోయాయి. గతంలో ప్రకటించిన ప్రాజెక్టులకు ఈ సారైనా సరిపడా నిధులు అందజేస్తారా, పునాదులు పడతాయా.. నిధులు మంజూరవుతాయా అని ఎదురు చూడాల్సి వస్తోంది. ఎంఎంటీఎస్‌ రెండో దశ, యాదాద్రి వరకూ కొనసాగింపు, నగర శివార్లలో కొత్తగా నిర్మించ తలపెట్టిన రైల్వేస్టేషన్లు ఈ కోవలోకే వస్తాయి. దశాబ్దాలు దాటినా ప్రాజెక్టులు పట్టాలెక్కని తీరు చూస్తుంటే నగరంపై ద.మ. రైల్వే నిర్లక్ష్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

చర్లపల్లి తప్పితే...
దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే రైళ్లు శివారులకు సమయానికి చేరుకుంటున్నా.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో ప్లాట్‌ఫారాలు ఖాళీలేక అక్కడే గంటల తరబడి ఆగిపోతున్నాయి. దీనికి విరుగుడుగా నగరం నలువైపులా ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని నాగులపల్లి, మేడ్చల్‌, ఉందానగర్‌, చర్లపల్లి రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. చర్లపల్లిలో అంతర్జాతీయ ప్రమాణాలతో శాటిలైట్‌ టెర్మినల్‌ అభివృద్ధి చేయాలనుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాలు కేటాయించాలని కోరారు. కోరి ఆరేళ్లయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉలుకూపలుకూ లేకపోవడంతో రైల్వే ఆధీనంలోని 50 ఎకరాల్లో రూ.221 కోట్లతో అభివృద్ధి చర్యలు చేపట్టారు. రెండు దఫాలుగా రూ.120 కోట్లతో స్టేషన్‌ విస్తరణ పనులు ప్రారంభించి,  6 ప్లాట్‌ఫామ్‌లలో నాలుగింటిని పూర్తి చేశారు.

చారిత్రక స్టేషన్ల అభివృద్ధి పట్టక..
* సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను రూ.350 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని 18 ఏళ్ల క్రితం బడ్జెట్‌లో ఆమోదించారు. మాస్టర్‌ ప్లాన్‌కు టెండర్లు పిలిచి కాలయాపన చేశారు. తర్వాత పీపీపీ పద్ధతిలో నిర్మించాలని నోటిఫికేషన్‌ ఇచ్చినా, రైల్వే షరతులకు ఎవరూ ముందుకు రాలేదు.

* దేశంలోని అన్ని రాష్ట్రాల పర్యాటక కార్యాలయాలు కొలువుదీరేలా హైదరాబాద్‌ స్టేషన్‌ను రూ.120 కోట్లతో పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి. కాచిగూడ రైల్వే స్ట్టేషన్‌ కనీస ప్రతిపాదనలకు నోచుకోలేదు.


ముడిపడని ఆ మూడింటి అభివృద్ధి

నాగులపల్లి, ఉందానగర్‌, మేడ్చల్‌ రైల్వేస్టేషన్లలను రూ.300 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. నాగులపల్లిలో రైల్వేకి ఒక్క ఎకరం భూమి కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం భూమిస్తే అభివృద్ధి అన్నట్లు మారిపోయింది. మిగతా రెండు చోట్ల రైల్వేకి స్థలం ఉన్నా, అభివృద్ధి చేయాలనే ఆలోచన కరవైంది.


ఎంఎంటీఎస్‌ రెండో దశ తిరిగేదెన్నడు?

ఎంఎంటీఎస్‌ రెండో దశ 95 కి.మీ. వ్యయం రూ.817 కోట్లు. ఈ ప్రాజెక్టును 2018 చివరి నాటికి కొంత.. 2019 నాటికి మొత్తం పూర్తి చేయాలన్న లక్ష్యంతో 2014లో పనులు చేపట్టారు. 2022 వచ్చినా పూర్తి కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం రెండు వాటాల నిధులు రూ.544 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ.130 కోట్లు మాత్రమే ఇచ్చింది. తన వాటా కింద రైల్వే రూ.272 కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులు పూర్తి చేసింది. మొత్తం పూర్తి చేస్తే రాష్ట్రం నుంచి మిగతా నిధులు రావన్న ఉద్దేశంతో పనులు అంతటితో ఆపేసింది. రెండో దశ రాష్ట్ర ప్రభుత్వం స్పందనపై ఆధారపడి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని