logo

పేదలకు ఉపాధి.. సర్కారుకు ఆదాయం

జిల్లాలో తునికాకు సేకరణ ఊపందుకుంది. ఇది పేదలకు ఉపాధి మార్గంగా మారింది. ఉదయం, సాయంత్రం సమయాల్లో మహిళలు తునికాకును సేకరించేందుకు వెళ్తున్నారు. ఇందుకోసం అధికారులు జిల్లా వ్యాప్తంగా కార్యాచరణ సిద్ధం చేసి అమలు

Published : 19 May 2022 02:11 IST

న్యూస్‌టుడే, పరిగి

కల్లంలో ఆరబెట్టిన కట్టలను పరిశీలిస్తున్న అధికారి

జిల్లాలో తునికాకు సేకరణ ఊపందుకుంది. ఇది పేదలకు ఉపాధి మార్గంగా మారింది. ఉదయం, సాయంత్రం సమయాల్లో మహిళలు తునికాకును సేకరించేందుకు వెళ్తున్నారు. ఇందుకోసం అధికారులు జిల్లా వ్యాప్తంగా కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు సేకరించేందుకు అటవీశాఖ అవకాశం కల్పించింది. అనేక ప్రాంతాల్లో అటవీ పరిసరాలు దగ్గరగా ఉండటంతో మరింత ప్రయోజనంగా మారింది. ఉపాధి పనులు ఉదయం పూట ముగించుకుని చల్లటి వేళల్లో ఒక్కొక్కరు 50కట్టల వరకు తీసుకువస్తున్నారు. దీంతో వేసవిలో చేతినిండా పని లభిస్తోంది.

రేంజ్‌ల వారీగా తునికాకు సేకరించేందుకు ధారూర్‌, తాండూరు, వికారాబాద్‌, పరిగిలో ఆరు యూనిట్లు ప్రారంభించారు. వీటి ఆధీనంలో ధారూర్‌లో 10కల్లాలు, యాలాలలో 5, కుల్కచర్లలో 14, కంకల్‌లో 8, పెద్దేముల్‌లో 5, గొట్టిముక్కలలో 7చొప్పున ఏర్పాటు చేశారు. మొత్తం 1900 స్టాండర్డ్‌ బ్యాగులను సేకరించాలని నిర్ణయించారు. ఆకు తక్కువగా ఉందన్న కారణంగా మరో 5 యూనిట్లకు టెండర్లు దాఖలు కాలేదు. సర్కారు నిర్ణయించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించారు.
కట్టకు 50ఆకులు: ఒక కట్టకు 50 తునికాకులు ఉండేలా చూస్తున్నారు. కట్టలుగా కట్టి విక్రయిస్తున్న పేదలకు ఒక కట్టకు రూ.2.05పైసలు చెల్లిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు 40-50 కట్టల వరకు నిత్యం సేకరిస్తున్నారు. వెయ్యి కట్టలతో బస్తాను నింపుతారు. దీన్నే స్టాండర్డ్‌ బ్యాగుగా పరిగణిస్తారు. దీంతో పేదలకు ఉపాధి అవకాశాలు లభిస్తుండగా ప్రభుత్వానికి అదనపు ఆదాయ వనరులు సమకూరుతున్నాయి. తునికాకు ద్వారా జిల్లాలో రూ.38లక్షల ఆదాయం వచ్చింది. యాలాల, ధారూర్‌, పరిగి, తాండూరు ప్రాంతాల్లో అటవీ ప్రాంతం అధికంగా ఉండటంతో సేకరణ జోరుగా సాగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. పల్లెల్లో జాతీయ ఉపాధిహామీ పథకం కింద వంద రోజుల కార్యక్రమం కొనసాగుతుండటంతో లక్ష్యసాధనకు అవరోధంగా మారుతుందని భావిస్తున్న అధికారులు పని ప్రదేశాల్లో అందుబాటులో తునికాకు ఉంటే పనిలో పనిగా తీసుకురావచ్చని కూడా సూచిస్తున్నారు. గతేడాది ఒక కట్టకు రూ.2 చెల్లించిన ప్రభుత్వం ఈసారి కేవలం ఐదు పైసలను మాత్రమే పెంచింది. ఇది పెద్దగా ఫలితం చూపడం లేదని పలువురు భావిస్తున్నారు. పరిగి రేంజ్‌ పరిధిలో రేంజ్‌ అధికారి అబ్దుల్‌ హాయ్‌ పనులను పరిశీలిస్తూ వేగవంతం చేస్తున్నారు. గతంలోనూ ఇక్కడ పూర్తిస్థాయిలో సేకరణ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని