logo

నైజీరియన్లు.. నాలుగైదు పాస్‌పోర్టులు

మాదకద్రవ్యాల సరఫరా.. సైబర్‌ నేరాలతో రూ.లక్షలు కొల్లగొడుతున్న నైజీరియన్లు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తెలివిగా ప్రవర్తిస్తున్నారు. పర్యాటక, వ్యాపార, విద్య, వైద్యారోగ్య పాస్‌పోర్టులతో నైజీరియా, టాంజానియా,

Published : 01 Jul 2022 03:53 IST

వివిధ నేరాల్లో వినియోగం..
పోలీసులు అరెస్టు చేసినా బెయిల్‌పై బయటికి..

ఈనాడు, హైదరాబాద్‌: మాదకద్రవ్యాల సరఫరా.. సైబర్‌ నేరాలతో రూ.లక్షలు కొల్లగొడుతున్న నైజీరియన్లు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తెలివిగా ప్రవర్తిస్తున్నారు. పర్యాటక, వ్యాపార, విద్య, వైద్యారోగ్య పాస్‌పోర్టులతో నైజీరియా, టాంజానియా, దక్షిణాఫిక్రా దేశాల నుంచి వస్తున్న వీరు దిల్లీకి చేరుకున్న వెంటనే ప్రాంతీయ విదేశీ నమోదు కార్యాలయంలో పేర్లు, పాస్‌పోర్టు, వీసాల వివరాలు నమోదుచేశాక బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయి నగరాలకు వెళ్తున్నారు. ఒక్కొక్కరి పేరుతో నాలుగైదు పాస్‌పోర్టులు, నకిలీ వీసాలను తయారు చేసుకుంటున్నారు. కొందరు భారత పౌరులమేనంటూ నకిలీ పత్రాలు సమర్పిస్తున్నారు. కొందరు ఆధార్‌కు దరఖాస్తులు చేసుకుంటున్నారు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్న నైజీరియన్లను ప్రశ్నించేందుకు ప్రత్యేక వ్యవస్థ లేకపోవడంతో వేల మంది మెట్రో నగరాల్లో ఉంటున్నారు.

ఇలా చేస్తున్నారు..
సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ విక్రయించేందుకు వస్తున్న నైజీరియన్లు అసలు పాస్‌పోర్టు, వీసాలను ఎందుకు దాచిపెడుతున్నారని హైదరాబాద్‌ పోలీసులు విశ్లేషించారు. మహేశ్‌ బ్యాంక్‌ కేసులో అరెస్టయిన నలుగురు నైజీరియన్లను విచారించారు. పోలీసులు అరెస్టు చేసినప్పుడు రిమాండ్‌ ఖైదీలుగా జైలుకు వెళ్లిన వెంటనే బెయిల్‌ వచ్చేందుకు తమకు నకిలీ పాస్‌పోర్టు, వీసాలు ఉపయోగపడతాయన్న భావనతో నైజీరియన్లు వాటిని తయారు చేసుకుంటున్నారని తెలుసుకున్నారు. బెయిల్‌ అభ్యర్థనను కోర్టులో సమర్పించగానే.. పోలీసులు వెంటనే వారికి బెయిల్‌ ఇవ్వవద్దని వారి వీసా, పాస్‌పోర్టు సక్రమంగా లేదంటూ వివరిస్తారు. ఆ విషయాన్ని సాక్ష్యాధారాలతో నిరూపిస్తేనే బెయిల్‌ రద్దు చేస్తామని కోర్టు చెబుతోంది. దీంతో పోలీసులు ప్రాంతీయ విదేశీ నమోదు కార్యాలయం అధికారులను సంప్రదిస్తున్నారు. వారు ఆ వివరాలు ఇవ్వకుండా.. తమ కార్యాలయం పరిధిలో నైజీరియన్లు లేరని, దిల్లీలో సంప్రదించాలని వారు పోలీసులకు చెబుతున్నారు. ఇలా నైజీరియన్‌ నేరగాళ్లకు బెయిల్‌ అవకాశం దొరుకుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని