logo

అనుమతులు పారదర్శకం.. అక్రమాలకు చరమగీతం..

పురపాలక తరహాలోనే ఇకపై గ్రామ పంచాయతీల్లో కూడా తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సేల్స్‌ సర్టిఫికేషన్‌ సిస్టమ్‌ (టీఎస్‌ బీపాస్‌)ను ఏప్రిల్‌ నుంచి ప్రవేశపెడుతున్నారు.

Published : 29 Nov 2022 04:50 IST

ఇక గ్రామాలకూ.. టీఎస్‌బీపాస్‌

న్యూస్‌టుడే వికారాబాద్‌: పురపాలక తరహాలోనే ఇకపై గ్రామ పంచాయతీల్లో కూడా తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సేల్స్‌ సర్టిఫికేషన్‌ సిస్టమ్‌ (టీఎస్‌ బీపాస్‌)ను ఏప్రిల్‌ నుంచి ప్రవేశపెడుతున్నారు. దీంతో గ్రామ పంచాయతీల్లో భవన నిర్మాణ అనుమతుల్లో ప్రజా ప్రతినిధుల జోక్యం తగ్గిపోవడంతో పాటు అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడనుంది. టీఎస్‌బీపాస్‌ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ఈ నెల 12న ఉత్తర్వు సంఖ్య 52ను జారీ చేసింది. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించారు. చేర్పులు, మార్పులతో గ్రామీణుల ముంగిట రానుంది.

ఈ- పంచాయతీ ద్వారా ..

జిల్లాలో 566 గ్రామ పంచాయతీలున్నాయి. పురపాలక పరిధిలో అమలవుతున్న మాదిరిగానే భవన నిర్మాణాలకు తప్పనిసరిగా అనుమతులు పొందాలి. ప్రస్తుతం ఈ - పంచాయతీ ద్వారా 300 గజాల వరకు స్థలం ఉండి నిర్మాణాల అనుమతికి దరఖాస్తు చేసుకుంటే కార్యదర్శులు పరిశీలించి మంజూరు చేస్తున్నారు. అంతకంటే మించి ఉంటే టౌన్‌ అండ్‌ ప్లానింగ్‌ శాఖ పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం కొత్త విధానం అమలు కానుండటంతో టీఎస్‌బీపాస్‌ ద్వారానే సాగుతాయి.  

ప్రస్తుతం పురపాలికల్లో ఇలా..

టీఎస్‌ బీపాస్‌ ద్వారా ప్రస్తుతం పురపాలికల్లో భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నారు. మీ సేవలో ప్లాట్ల వివరాలతో కూడిన దస్తావేజులను పొందుపర్చి టీఎస్‌ బీపాస్‌కు దరఖాస్తు చేయగానే అక్కడి అధికారి పరిశీలిస్తారు. ఇతర విభాగాల అధికారులూ పరిశీలించి 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నారు. దస్తావేజులు సక్రమంగా లేకుంటే తిరస్కరిస్తున్నారు. ఇక పంచాయతీల్లో కూడా 21 రోజుల్లోనే అనుమతులు ఇవ్వనున్నారు.

* టీఎస్‌ బీపాస్‌ ద్వారా పారదర్శకత పెరిగి అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడుతుంది. గ్రామాల్లోనూ సెట్‌ బ్యాక్‌, అంతర్గత రహదారులు తప్పనిసరిగా 30 అంగుళాలు ఉండాలన్న నిబంధనలు పాటించాలి.  


అక్కడ విక్రయించి... ఇక్కడ కొనుగోలు చేసి...

రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి, చేవెళ్ల ప్రాంతాల్లో ఎకరం భూమి ధర రూ.2 నుంచి రూ.4 కోట్ల వరకు పలుకుతోంది. అక్కడ భూములు విక్రయించిన వారు పొరుగునే ఉన్న వికారాబాద్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భూముల ధరలు రూ.35 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఉండటంతో కొనుగోలు చేసి వ్యవసాయ క్షేత్రాలుగా మార్చుకుంటున్నారు. అనుమతులు లేకుండానే వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారుతున్నాయి. ప్రభుత్వం అమలు చేయనున్న టీఎస్‌బీపాస్‌ ద్వారా ఇలాంటి అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని