logo

అయ్యో పాపం.. నీటిసంపులో పడిన ఇద్దరు కుమారుల దుర్మరణం

ఓ మధ్య తరగతి వ్యక్తి పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా హైదరాబాద్‌కు వలస వచ్చారు.. వారి కోసమే కలలు కంటూ పైసా పైసా కూడబెడుతున్న ఆయన కొంత స్థలం కొనుగోలు చేద్దామనుకున్నారు.

Updated : 30 Nov 2022 10:23 IST

నీటిసంపులో పడిన ఇద్దరు చిన్నారుల దుర్మరణం

యువ మనోజ్‌రెడ్డి, పవన్‌ అనీష్‌రెడ్డి

బాలానగర్‌, న్యూస్‌టుడే: ఓ మధ్య తరగతి వ్యక్తి పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా హైదరాబాద్‌కు వలస వచ్చారు.. వారి కోసమే కలలు కంటూ పైసా పైసా కూడబెడుతున్న ఆయన కొంత స్థలం కొనుగోలు చేద్దామనుకున్నారు. స్థలం పరిశీలనకు వెళ్లిన చోటే ఇద్దరు కుమారులను కోల్పోయారు. సంపులో పడిన ఇద్దరు పిల్లల్లో ఒకరు అక్కడే మృతిచెందగా, మరో బాలుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కుటుంబంలో తీవ్ర విషాదాన్ని ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఏపీలోని బాపట్ల జిల్లా చీరాలకు సమీపంలోని తనుబొద్దువారి పాలేనికి చెందిన మస్తాన్‌రెడ్డి భార్య శిరీషారెడ్డి, ఇద్దరు కుమారులు పవన్‌ అనీష్‌రెడ్డి(8), యువ మనోజ్‌రెడ్డి(6)లతో హైదరాబాద్‌లో ఉంటున్నారు. పటాన్‌చెరులో ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఓ ప్రకటన చూసి బాలానగర్‌ మండలం పెద్దాయపల్లి పరిధి శేరిగూడెం శివారులోని వెంచరును పరిశీలించేందుకు ఆదివారం ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చారు. మస్తాన్‌రెడ్డి వెంచరులోని ఓ భవనంపై నుంచి స్థలం పరిశీలిస్తుండగా ఆడుకునేందుకు వెళ్లిన పిల్లలు అక్కడే ఉన్న సంపులో ప్రమాదవశాత్తు పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే 108 వాహనానికి ఫోన్‌ చేసినా అప్పటికే మరో కేసు కోసం వెళ్లింది. ఎలాగోలా కష్టపడి బాలానగర్‌ ఆసుపత్రికి చేరిస్తే అక్కడ వైద్యులు లేరు. ఆక్సిజన్‌ అందుబాటులో లేదు. షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి పిల్లలను చేర్చారు. అప్పటికే చిన్న కుమారుడు యువ మనోజ్‌రెడ్డి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పెద్ద కుమారుడు పవన్‌ అనీష్‌రెడ్డిని సోమాజిగూడలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి తర్వాత మృతిచెందాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని