logo

తల్లీ బిడ్డలకు ఆరోగ్యమస్తు..!

తాండూరులోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌) తల్లీబిడ్డల ఆరోగ్యానికి రక్షణ కవచంలా మారింది.

Published : 04 Dec 2022 02:25 IST

అండగా నిలుస్తున్న మాతాశిశు సంరక్షణ కేంద్రం
న్యూస్‌టుడే, తాండూరు టౌన్‌, తాండూరు, వికారాబాద్‌

ఆసుపత్రిలో...

తాండూరులోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌) తల్లీబిడ్డల ఆరోగ్యానికి రక్షణ కవచంలా మారింది. కేంద్రం ఏర్పాటుతో గతంలో కంటే శిశు మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. 

ఆధునిక సేవలు

జిల్లా ఆస్పత్రిలో ఉన్న ఎంసీహెచ్‌ని ఈ ఏడాది జనవరిలో పట్టణ శివారులోని రాజీవ్‌ గృహకల్ప వద్దకు మార్చారు. మొత్తం రూ.15కోట్లతో 150 పడకల స్థాయి ఆస్పత్రిని ఇదే ఏడాది జనవరిలో ప్రారంభించారు. మహిళలకు కాన్పులతోపాటు, పుట్టిన శిశువులు బరువు తక్కువ, పౌష్టిక ఆహార లోపం, రక్త హీనత ఇతర సమస్యలతో ఇబ్బందిపడే శిశువులకు ఇక్కడ ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నారు. బయటి ఆస్పత్రుల్లో కాన్పులు చేసుకుని ఆరోగ్య సమస్యలతో వచ్చిన శిశువులకు కూడా ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇందుకు గాను ప్రత్యేక వైద్యులు పర్యవేక్షణ చేపడుతున్నారు.
* నియోజక వర్గంలోని పెద్దేముల్‌, యాలాల, బషీరాబాద్‌, తాండూరు మండలాల గ్రామీణులతో పాటు సరిహద్దు కర్ణాటక, పొరుగు జిల్లా మహబూబ్‌నగర్‌, కొడంగల్‌, పరిగి, వికారాబాద్‌ నియోజక వర్గాల నుంచి మహిళలు కాన్పుల కోసం ఇక్కడికే వస్తుంటారు. వారికి సాధారణ ప్రసవాలు చేయటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. 

ఇటీవలే వచ్చిన టిఫా యంత్రం

టిఫా రాకతో మరింత ప్రయోజనం

ఆసుపత్రికి ఇటీవలే టిఫా యంత్రం సమకూరింది. తద్వారా మరింత మెరుగ్గా వైద్య సేవలు అందనున్నాయి. దీని ద్వారా గర్భిణులకు స్కానింగ్‌ పరీక్షలు చేస్తారు. కడుపులో బిడ్డ ఎదుగుదల తదితర విషయాలను ఇతర స్కానింగ్‌ కంటే మరింత స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇలాంటి పరీక్షలు చేయించుకోవాలంటే ప్రయివేటులో రూ.2 వేల నుంచి రూ.3 వేల దాకా చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ పూర్తిగా ఉచితంగా చేస్తారు.

సద్వినియోగం చేసుకోండి
- డాక్టర్‌ రమణబాబు, ఎంసీహెచ్‌ అభివృద్ధి సలహా సంఘం సభ్యుడు

మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అన్ని సేవలు ఉచితం. గర్భిణులు, బాలింతలు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఆరోగ్యపరమైన సలహాలన్నీ ఇక్కడ లభిస్తాయి. ప్రసవాలు సహజంగానే జరిగేలా చూస్తాం. కిట్లుకూడా ఇస్తాం. వీటిని సద్వినియోగం చేసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని