logo

ప్రధానికి ఉత్తరం రాసేందుకు పది వేల కార్డులు

ప్రస్తుతం చరవాణి ప్రపంచంలో పోస్టుకార్డులు రాసే వారు కనుమరుగయ్యారు. అందుకే విద్యార్థుల్లో ఉత్తరాలు రాసే విధానాన్ని అలవర్చేందుకు తపాలాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు

Published : 09 Dec 2021 05:24 IST

ఉత్తమ ఎంట్రీలకు బహుమతులు

వేములవాడ తపాలా కార్యాలయానికి వచ్చిన పోస్టు కార్డులు

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రస్తుతం చరవాణి ప్రపంచంలో పోస్టుకార్డులు రాసే వారు కనుమరుగయ్యారు. అందుకే విద్యార్థుల్లో ఉత్తరాలు రాసే విధానాన్ని అలవర్చేందుకు తపాలాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఆజాది కా అమృత్‌ మహోత్సవాలను వేదికగా చేసుకొని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని తపాలాశాఖ ఈ వినూత్న కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. పాఠశాలల్లో ఆసక్తి ఉన్న నాలుగు నుంచి 12వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా ముద్రించిన పోస్టు కార్డులను పంపిణీ చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు పది వేల పోస్టు కార్డులను కేటాయించారు. వీటిని పాఠశాలల్లో పంపిణీ చేయనున్నారు. ఈ కార్డులపై వ్యాసం రాసి పంపించాలని పేర్కొంది. గెలిచిన విద్యార్థులకు బహుమతులతో పాటు నేరుగా ప్రధానిని కలిసి మాట్లాడే అవకాశాన్ని కల్పించనున్నది. ఎంట్రీలకు ఈ నెల 20 చివరి తేదీ అని, రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలోనైనా కార్డుపై వ్యాసం రాసి పంపించవచ్చని తపాలాశాఖ పేర్కొంది. ప్రతి పాఠశాలలో 10 మంది విద్యార్థులు ఇందులో భాగస్వాములయ్యే విధంగా చర్యలు చేపట్టారు. స్వాతంత్య్ర సమరయోధులు, 2047 నాటికి దేశం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అనే అంశాలపై క్లుప్తంగా వ్యాసం రాయాల్సి ఉంటుంది. రాసిన ఉత్తరాలను పాఠశాల ఉపాధ్యాయులు సేకరించి పంపుతారు. వాటిలో ఉత్తమమైన ఎంట్రీలను ఎంపిక చేసి 2022 జనవరి 17న ప్రధానితో ముఖాముఖి అవకాశం కల్పించనున్నట్లు తపాశాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాకు పది వేల కార్డులు వచ్చాయని, కార్డులు రాసేందుకు పాఠశాలకు పది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపిస్తే ఎక్కువ కార్డులు ఇస్తామని జిల్లా తపాలాశాఖ అధికారి దయానంద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని