logo

ప్రభుత్వ నిర్ణయం.. పేద విద్యార్థులకు వరం

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు ధీటుగా బోధన చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడంలేదు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకంలేకనో? మెరుగైన విద్య అందడంలేదనే కారణమో తెలియదుకాని పేద వర్గాల

Published : 19 Jan 2022 02:22 IST

సుల్తానాబాద్‌ మండలం అరెపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం బోధన

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు ధీటుగా బోధన చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడంలేదు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకంలేకనో? మెరుగైన విద్య అందడంలేదనే కారణమో తెలియదుకాని పేద వర్గాల ప్రజలకు సైతం తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపిస్తున్నారు. మౌలిక వసతులు, నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నా..పట్టణాల్లోని ప్రైవేటులో చదివించేందుకు మొగ్గుచూపుతున్నారు. కాగా సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఇకనుంచి అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కార్పొరేట్‌ స్థాయిలో విద్య అందించేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది.

ఆంగ్ల మాధ్యమంలోనే అత్యధికం
జిల్లాలో 724 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 288 తెలుగు మాధ్యమంలో బోధన చేస్తుండగా 436 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలవుతోంది. 288 తెలుగు మాధ్యమం పాఠశాలల్లో 5449 మంది, 436 ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో 35,133 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రాథమికంలో ఆంగ్ల మాధ్యమం లేక చిన్నారులను పంపించడంలేదు. దీంతో ఉపాధ్యాయులు చొరవ తీసుకొని ఆంగ్లంలోనే బోధన చేస్తున్నారు. విద్యాశాఖ అనుమతి లేకుండానే ఆంగ్లంలో అనధికార తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు సొంత ఖర్చులతో పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో మాత్రం ప్రభుత్వమే పాఠ్య పుస్తకాలను సరఫరా చేస్తోంది.

అభివృద్ధి ప్రణాళిక ఇలా
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచేందుకు మన ఊరు-మన బడి ప్రణాళిక రూపొందిస్తున్నారు. మూడు దశల్లో దీన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. తొలి విడతలో విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలకు అవకాశం లభించనుంది.
గత ఏడాది జిల్లాలోని పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై నివేదిక రూపొందించారు. శిథిలావస్థలో 456 గదులు, 646 గదులకు మరమ్మతులు, 709 మూత్రశాలలు(బాలికలు), 718(బాలుర) ప్రతిపాదించారు. 3050 ఫ్యాన్లు, 15,035 డ్యూయల్‌ బెంచీలు, 55,753 మీటర్ల ప్రహరీ అవసరం ఉందని గుర్తించారు.
పాఠశాలల్లోని శౌచాలయాలకు నీటివసతి, విద్యుదీకరణ, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు సరిపడా ఫర్నీచర్‌, గదుల మరమ్మతు, భవనాలకు రంగులు వేయనున్నారు. శిథిలమైన గదుల స్థానంలో కొత్తగా నిర్మించనున్నారు.
ప్రహరీ, వంట గదుల నిర్మాణానికి ప్రతిపాదిస్తారు. మండలం యూనిట్‌గా తీసుకొని అభివృద్ధి చేస్తారు. క్షేత్ర స్థాయిలో గుర్తించిన పనులకు జిల్లా కలెక్టర్‌ పరిపాలన అనుమతి ఇవ్వనున్నారు.

అమలైతేనే మెరుగైన విద్య
సర్కారు బడులను అభివద్ధి చేసే ప్రణాళిక అమలుపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రైవేటులో ఫీజుల మోత భరించడం కష్టంగా ఉందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించాలని సంకల్పించారు. గతంలో సక్సెస్‌ పాఠశాలల పేరిట ఆంగ్ల మాధ్యమంలో విద్య ప్రారంభించారు. కంప్యూటర్లు, ఇతర సామగ్రి అందించారు. నిర్వహణ భారంతో కంప్యూటర్లు కనుమరుగయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాలను సమర్థవంతంగా అమలు చేస్తేనే విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

నిబంధనలు అమలు చేస్తాం
- మాధవి, జిల్లా విద్యాధికారి

జిల్లాలో చాలా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నాం. మన ఊరు-మన బడి ప్రణాళికతో మౌలిక వసతుల కొరత తీరనుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలు చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు