logo

నిలిపేచోటు లేక.. జరిమానా చెల్లించక తప్పక..

ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ పట్టణంలో వాహనదారులు పార్కింగ్‌ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వేములవాడ పట్టణం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం

Published : 20 May 2022 03:24 IST

పార్కింగ్‌ కోసం వాహనదారుల పాట్లు

న్యూస్‌టుడే, వేములవాడ: ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ పట్టణంలో వాహనదారులు పార్కింగ్‌ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వేములవాడ పట్టణం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో పాటు వాణిజ్య వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో నిత్యం భక్తులు, ప్రజలతో రద్దీగా ఉంటుంది. చాలా వరకు ఇక్కడి రహదారులన్నీ ఇరుకుగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుంది. మరోవైపు పార్కింగ్‌ ప్రాంతాలు లేక రోడ్లపై వాహనాలు పెట్టడంతో పోలీసులు జరిమానా విధిస్తున్నారు.

రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు పార్కింగ్‌ స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ వివిధ  పనులు కోసం వచ్చే ప్రజలకు, భీమేశ్వర ఆలయం, బద్దిపోచమ్మ ఆలయానికి వచ్చే భక్తులు వాహనాలు నిలిపేందుకు పార్కింగ్‌ ప్రదేశాలు లేవు. ఆయా ప్రాంతాల్లో చాలా వరకు వాహనాలు రోడ్లపైనే నిలిపి భక్తులు దర్శనానికి వెళుతుండగా, ప్రజలు వివిధ వ్యాపారాలు, పనులపై వెళుతుంటారు. దీంతో రోడ్లపై నిలిపిన వాహనాలతో రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. రోజూ వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. ఆలయంలో జరిగే వివిధ వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చే భక్తులు, ప్రజలు, వాహనాలతో రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదు. ప్రజలు నడిచి వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి రహదారులపై వాహనాలు నిలపడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. ఏ కూడలి ప్రాంతంలోనూ పార్కింగ్‌ స్థలాలు లేవు. ఇక్కడికి చాలా వరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారే అధికంగా ఉంటారు. పార్కింగ్‌ ప్రాంతాలు లేక ఏదో ఒకచోట వాహనాన్ని నిలిపి వేస్తుంటారు. ఇంతలో ట్రాఫిక్‌ పోలీస్‌ సిబ్బంది ఫొటోలు తీసి జరిమానాలు విధించడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం:  శ్యామ్‌సుందర్‌రావు, మున్సిపల్‌ కమిషనర్, వేములవాడ

పట్టణంలోని ఆలయ పరిసరాల్లో మున్సిపల్‌కు సంబంధించిన స్థలాలు లేవు. ఆలయానికి సంబంధించిన స్థలాలున్నాయి. ఆలయ అధికారులతో చర్చించి పార్కింగ్‌ స్థలాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.

ఇష్టారాజ్యంగా నిలపడంతో..

పట్టణంలో వాహనాల పార్కింగ్‌ ప్రాంతాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా మున్సిపల్‌ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో వాహనాలకు నిర్దేశిత స్థలాలను గుర్తించి పార్కింగ్‌కు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఎక్కడా వీటిని ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ఆలయ పరిసర రోడ్లలోని దుకాణాల ముందు, రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. దీంతో భక్తులు, ప్రజల రాకపోకలకు సమస్యగా మారింది. ఆలయానికి వచ్చే భక్తులకు పార్కింగ్‌ స్థలం ఉన్నప్పటికీ వారు కూడ రోడ్లపైకి వచ్చి ఇష్టారాజ్యంగా నిలపడంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతుంది. ఆలయ పరిసరాల్లోనూ స్థలాలు లేకపోవడంతో ఆలయం పడమర ప్రధాన ద్వారం వద్ద ద్విచక్ర వాహనాలను మెట్లకు అడ్డుగా పెడుతున్నారు. మరోవైపు కొబ్బరి కాయల దుకాణాలు, ఇతర తోపుడు బండ్లు రోడ్లపై పెట్టడంతో భక్తులు మెట్ల నుంచి పైకి వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆలయం ప్రధాన ద్వారం తూర్పు వైపు వెళ్లే రోడ్డు ముందే ఇరుకుగా ఉంటుంది. ఇందులో వాహనాలు, ఇతర తోపుడు బండ్లతో రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని భక్తులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు స్పందించి వాహనాల పార్కింగ్‌ స్థలాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని