logo

చిన్నారులను మింగిన చెరువు

అప్పటివరకు సరదాగా ఆడుకున్న చిన్నారులు చెరువు చెంతకు వెళ్లగా నీటిలో పడి మృతిచెందిన విషాదకర ఘటన సుల్తానాబాద్‌ పురపాలక సంఘం పరిధిలోని పూసాలలో సోమవారం చోటుచేసుకుంది.

Published : 28 Jun 2022 05:38 IST

నీటిలో మునిగి అక్కాచెల్లెళ్ల మృతి


శాన్వి, అనుశ్రీల మృతదేహాలు

పూసాల(సుల్తానాబాద్‌), న్యూస్‌టుడే: అప్పటివరకు సరదాగా ఆడుకున్న చిన్నారులు చెరువు చెంతకు వెళ్లగా నీటిలో పడి మృతిచెందిన విషాదకర ఘటన సుల్తానాబాద్‌ పురపాలక సంఘం పరిధిలోని పూసాలలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై ఉపేందర్‌రావు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన సమాచారం మేరకు... గ్రామానికి చెందిన గుర్రాల ప్రశాంత్‌, అక్షిత దంపతులకు శాన్వి(6), అనుశ్రీ(4) సంతానం. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు అంగన్వాడీకేంద్రంలో ఉన్న వీరిని తల్లి అక్షిత ఇంటికి తీసుకువచ్చింది. తండ్రి బియ్యంమిల్లులో హమాలీ పనికి వెళ్లగా తల్లి ఇంట్లో పనిచేసుకుంటోంది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో స్థానికంగా చిరుజల్లులు కురిసాయి. దీంతో చిన్నారులిద్దరూ ఆనందంతో బయటకు వెళ్లారు. ఆటలు ఆడుకుంటూ ఇంటికి సమీపంలో ఉన్న చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆడుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తూ చెరువులో పడి ఊపిరాడక మృతిచెందారు. పిల్లల కోసం తల్లి వీధుల్లో వెతుకుతుండగా ఇంటి సమీపంలోని చెరువులో మృతిచెంది కనిపించారు. మృతదేహాలను పెద్దపల్లి ఆసుపత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించారు. చిన్నారుల తండ్రి ప్రశాంత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


రోదిస్తున్న బంధువులు

కుటుంబంలో విషాదం...

పూసాలకు చెందిన గుర్రాల ప్రశాంత్‌, అక్షిత దంపతులిద్దరూ గ్రామ సమీపంలోని బియ్యం మిల్లులో హమాలీకార్మికులుగా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఎనిమిదేళ్ల క్రితం వీరికి వివాహమైంది. ఇద్దరు కుమార్తెలు జన్మించగా వారిని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. ఇద్దరు కుమార్తెలు ఒకేసారి మృతిచెందటంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. బాధిత కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని