logo

సింగరేణి సహకారం.. యువత ఉత్సాహం

పోలీసు అభ్యర్థులకు సింగరేణి సహకారం అందిస్తుంది. గోదావరిఖని సింగరేణి క్రీడా మైదానంలో సాధన చేస్తున్న వారికి ఉచిత శిక్షణతో పాటు పౌష్టికాహారం అందజేస్తోంది.

Published : 26 Nov 2022 04:54 IST

దేహ దారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్న పోలీసు అభ్యర్థులు
న్యూస్‌టుడే, గోదావరిఖని

షార్టుఫుట్‌ సాధనలో యువకుడు

పోలీసు అభ్యర్థులకు సింగరేణి సహకారం అందిస్తుంది. గోదావరిఖని సింగరేణి క్రీడా మైదానంలో సాధన చేస్తున్న వారికి ఉచిత శిక్షణతో పాటు పౌష్టికాహారం అందజేస్తోంది. 292 మంది అభ్యర్థులను శారీరక సామర్థ్య పరీక్షలకు సిద్ధం చేస్తోంది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారు శారీరక సామర్థ్య పరీక్షల్లో ఎంపికైతేనే ప్రధాన పరీక్షకు అవకాశం ఉంటుంది. దీంతో తీవ్రంగా కసరత్తు చేస్తున్న యువతకు సింగరేణి ప్రోత్సహిస్తోంది. ఆర్జీ-1 సేవా సమితి ఆధ్వర్యంలో శారీరక సామర్థ్య పరీక్షలకు తగిన శిక్షణ ఇచ్చేందుకు పలువురు అభ్యర్థులను ఎంపిక చేసింది.

రోజుకు రూ.5 వేల ఖర్చు

శిక్షణకు 182 మంది యువకులు, 110 మంది యువతులు హాజరవుతున్నారు. వీరికి అందించే పౌష్టికాహారం కోసం రోజుకు రూ.5,000 వరకు వెచ్చిస్తున్నారు. ఒక్కో అభ్యర్థికి రెండు గుడ్లు, రెండు అరటి పండ్లతో పాటు పాలు ఉచితంగా అందిస్తున్నారు. సేవా సమితి ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించిన సింగరేణి.. కార్మికులు, విశ్రాంత కార్మికుల పిల్లలు, పరిసర, ప్రభావిత గ్రామాల యువతీ యువకులను శిక్షణకు ప్రాథమిక పరీక్ష ద్వారా ఎంపిక చేసి సాధన చేయిస్తోంది. ఉదయం మూడు గంటల పాటు పరుగు, వ్యాయామం, యోగాతో పాటు షార్టుఫుట్‌, లాంగ్‌జంప్‌ ఈవెంట్లలో శిక్షణ ఇస్తోంది. అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్షల్లో ఎంపికయ్యేందుకు ప్రత్యేకంగా నలుగురు శిక్షకులు యువతీ యువకులతో నిత్యం సాధన చేయిస్తున్నారు.

పరుగు తీస్తున్న యువతులు


పట్టుదలతో సాధన చేస్తున్నా

- రాహుల్‌, గోదావరిఖని

పోలీసు ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో సాధన చేస్తున్నా. రోజు మూడు గంటలు శ్రమిస్తున్నాను. సింగరేణి పూర్తిస్థాయిలో సహకరిస్తోంది. ఎస్‌ఐతో పాటు కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించాను. శారీరక సామర్థ్య పరీక్షలకు అవసరమైన అన్ని విభాగాల్లో సాధన చేస్తున్నాం. పూర్తిస్థాయి కసరత్తులో భాగంగా శిక్షకులు ప్రతీ అంశంపై అవగాహన కలిగిస్తున్నారు. ఉద్యోగ లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉత్తేజం నింపుతుండగా తప్పకుండా పోలీసు కొలువు సాధిస్తానన్న నమ్మకం ఏర్పడింది.


 

ఖర్చుకు వెనుకాడకుండా శిక్షణ

- కల్వల నారాయణ, సింగరేణి జీఎం

ఖర్చుకు వెనుకాడకుండా అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాం. ప్రత్యేకంగా సింగరేణి నుంచి అనుభవజ్ఞులైన ఇద్దరు శిక్షకులను ఏర్పాటు చేశాం. గతంలోనూ వీరు పోలీసు ఉద్యోగ నియామకాల సమయంలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ సమయంలో అభ్యర్థులు కోల్పోయిన శక్తిని తిరిగి పొందేలా పాలు, గుడ్లు, అరటిపండ్లను ఉచితంగా అందజేస్తున్నాం. ఇందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని