logo

వచ్చే నెలలో రైతుబంధు

ప్రస్తుత యాసంగి సీజనుకుగాను రైతులకు పెట్టుబడిగా ఇచ్చే రైతుబంధు సాయాన్ని డిసెంబరులో పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి ప్రకటించడంపట్ల జిల్లాలోని అన్నదాతలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

Published : 28 Nov 2022 03:40 IST

న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు

ప్రస్తుత యాసంగి సీజనుకుగాను రైతులకు పెట్టుబడిగా ఇచ్చే రైతుబంధు సాయాన్ని డిసెంబరులో పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి ప్రకటించడంపట్ల జిల్లాలోని అన్నదాతలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో నిరుడు యాసంగిలో 2.10 లక్షల మంది రైతులకు రూ.207.19 కోట్ల నిధులు రాగా గత వానాకాలం సీజనులో 2.15 లక్షల మంది రైతులకు రూ.207.47 కోట్ల నిధులందాయి.

జిల్లాలో మొత్తం 2.28 లక్షల మంది పట్టాదారులుండగా వీరికి రూ.221 కోట్లవరకు నిధులు చేరాల్సి ఉంటుంది. కానీ మరణించినవారి వివరాలను జాబితాలోనుంచి తొలగించటం, వ్యవసాయ భూములను పూర్తిగా విక్రయించినవారు, నూతనంగా భూముల కొనుగోలు, విరాసత్‌ ద్వారా పట్టామార్పిడి చేయించుకున్నవారు సకాలంలో పథకం పరిధిలోకి రాకపోవటంవల్ల లబ్ధిదారుల సంఖ్య ప్రతి సీజన్‌లోనూ గరిష్ఠ స్థాయికి చేరటంలేదు.  

రైతుబంధు నిధులను విడుదల చేసేకంటే ముందుగానే ప్రభుత్వం కటాఫ్‌ తేదీని ప్రకటించి ఈ తేదీవరకు పట్టాదారులుగా నమోదై పాసుపుస్తకాలు పొందినవారిని అర్హులుగా గుర్తిస్తారు. ఇదే సమయంలో నూతన పట్టాదారులు, గతంలో తమ వివరాలివ్వనివారు దరఖాస్తు ఫారాన్ని పూర్తిచేసి భూమి పాసుపుస్తకం, బ్యాంకు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు నకలు ప్రతులతో వారి భూములున్న పరిధి క్లస్టర్‌ ఏఈవోకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కానీ చాలామంది అర్హులైన పట్టాదారులు తమ వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులకు సకాలంలో ఇవ్వనందున వీరికి రైతుబంధు నిధులు అందటంలేదు.

ప్రభుత్వం వద్ద భూములకు చెంది సరైన వివరాలు లేనివారు, ఇతరత్రా వివాదాలు, పలు కారణాలతో చాలామంది రైతులు గతకొన్ని సీజన్లుగా రైతుబంధు నిధులను అందుకోలేకపోతున్నారు. మరణించినవారు, భూములను పూర్తిగా విక్రయించినవారు సహా జిల్లాలో ఈ సీజనుకు చాలామంది రైతులు జాబితానుంచి తొలగిపోనుండగా దాదాపుగా 9 వేల మంది వరకు నూతన రైతులు రైతుబంధు పథకంలోకి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికిగాను ప్రభుత్వం కటాఫ్‌ తేదీని ప్రకటించి పట్టాదారు పాసుపుస్తకాలు పొందినవారి వివరాల నమోదుకు అవకాశమిస్తేనే నూతన రైతులకు నిధులను విడుదల చేసే అవకాశముంది. గత సీజన్‌లో ఎలాంటి భూ పరిమితి విధించకుండా రైతులందరికీ ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించగా ఈ సారి కూడా అందరికీ నిధులందుతాయని అన్నదాతలు ఆశిస్తున్నారు. దీనిపై వ్యవసాయశాఖ జిల్లా అధికారి పి.సురేశ్‌కుమార్‌ మాట్లాడుతూ కటాఫ్‌ తేదీని అనుసరించి మార్గదర్శకాలు ఉంటాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని