logo

ధర్మగుండంలో స్నానాలు... స్వామివారికి కోడె మొక్కులు

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రానికి సోమవారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చారు.

Published : 28 Mar 2023 05:25 IST

ఆలయ ప్రాంగణంలో భక్తులు

వేములవాడ, న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రానికి సోమవారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పట్టణంలోని వీధులు, ఆలయ పార్కింగ్‌ స్థలం, వీఐపీ రోడ్డు సందడిగా మారాయి. ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని కోటి లింగాల క్యూలైన్లలో ఫ్యాన్లు లేకపోవడంతో ఎండవేడిమికి భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలువురు తామెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి ప్రీతి పాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌, సూపరింటెండెంట్లు, సిబ్బంది పర్యవేక్షణ చేశారు. దాదాపు 25 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఊరేగిస్తున్న ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు

అశ్వ వాహనంపై స్వామివార్ల ఊరేగింపు

వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివార్లను అశ్వ వాహనంపై ఊరేగించారు. శ్రీ పార్వతీ, రాజరాజేశ్వర స్వామివార్లు, లక్ష్మీ సమేత అనంత పద్మనాభస్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆలయ స్థానాచార్యుడు అప్పాల భీమాశంకర్‌ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అశ్వ వాహనంపై ప్రతిష్ఠించి పుర వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకొని తరించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు