logo

లారీల కొరత.. నిలిచిన ధాన్యం కొనుగోళ్లు

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు.

Published : 01 Jun 2023 05:37 IST

న్యూస్‌టుడే, సిరిసిల్ల గ్రామీణం

తడిసిన ధాన్యం ఆరబెడుతున్న రైతు

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఓవైపు తూకం వేయక, మరోవైపు బస్తాలను రైస్‌ మిల్లులకు తరలించకపోవడంతో తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు నిబంధనల ప్రకారం ధాన్యం తూకం వేసినప్పటికీ, కేంద్రం నుంచి రైస్‌మిల్లుకు చేరే వరకు కర్షకులే బాధ్యత వహించాల్సి వస్తుంది. లారీలు రాకపోవడంతో ధాన్యం బస్తాల వద్ద రేయింబవళ్లూ కాపలా కాస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించే వరకు మిగతా వారివి తూకం వేయకుండా నిలిపివేస్తున్నారు. ఫలితంగా అకాల వర్షాలకు తడిసి మొలకెత్తి రైతులు నష్టపోతున్నారు. తూకం వేసిన వారం, పది రోజుల వరకు తరలించకుండా అధికారులు నిర్లక్ష్యం చేయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. లారీలకు వెయిటింగ్‌ ఛార్జీలతో పాటు బస్తాకు రూ.5 చొప్పున వసూలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.

34 కేంద్రాల్లో పూర్తి..

జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో అధికారులు 257 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా ఇప్పటి వరకు 34 కేంద్రాల్లో సేకరణ పూర్తయింది. ఇంకా 223 కేంద్రాల్లో కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో 18,29,59.460 మెట్రిక్‌ టన్నులను సేకరించారు. ఇందులో 17,12,80.360 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైస్‌ మిల్లులకు తరలించారు. ఇంకా 11,679.100 మెట్రిక్‌ టన్నులు కేంద్రాల్లో నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

గంభీరావుపేట మండలం లింగన్నపేట రైస్‌ మిల్లు వద్ద నిలిచిన ధాన్యం ట్రాక్టర్లు


నేటి నుంచి లారీలు పంపిస్తాం

జిల్లాలో రేషన్‌ దుకాణాలకు బియ్యం తరలింపు పూర్తయింది. గురువారం సాయంత్రం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపిస్తాం. జిల్లాలో 257 కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటి వరకు 34 కేంద్రాల్లో సేకరణ పూర్తయింది. మిగతా వాటిలో కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

జితేందర్‌రెడ్డి, డీఎస్‌వో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని