logo

రాజకీయ చైతన్యం..హుజూరాబాద్‌ ప్రత్యేకం

ఉద్యమాల పురిటిగడ్డగా.. రాజకీయ చైతన్యానికి ప్రతీకగా పేరొందిన హుజూరాబాద్‌ నియోజకవర్గం ఎన్నో ప్రత్యేకతల్ని మిళితం చేసుకుంది.

Updated : 29 Oct 2023 05:58 IST

న్యూస్‌టుడే, హుజూరాబాద్‌: ఉద్యమాల పురిటిగడ్డగా.. రాజకీయ చైతన్యానికి ప్రతీకగా పేరొందిన హుజూరాబాద్‌ నియోజకవర్గం ఎన్నో ప్రత్యేకతల్ని మిళితం చేసుకుంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఇక్కడి ప్రాంతం ఎన్నెన్నో విశేషాలకు కేంద్ర బిందువుగా మారింది. 1952లో ఆవిర్భవించిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటివరకు 15 పర్యాయాలు సాధారణ ఎన్నికలు, మూడుసార్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఉద్యమకారులకు అడ్డాగా మారిన ఈ ప్రాంతం తెలంగాణ ఉద్యమంలో కీలకమైన భూమికను పోషించింది. జిల్లాలోనే వరి, పత్తి సాగు ఇక్కడే అత్యధికంగా సాగవుతోంది. దిగువ మానేరు నుంచి ప్రధాన కాలువ ద్వారా వరంగల్‌, ఖమ్మం వరకు ఇక్కడి నుంచే సాగునీరు వెళ్తుండగా భౌగోళికంగా ఎస్సారెస్పీ కాలువలకు ఇరువైపులా విస్తరించి ఉండటంతో 80 శాతం పంటలు ఇదే కాలువల కిందే సాగవుతున్నాయి.

మంత్రులుగా అయిదుగురు..

హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైన వారికి రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు లభించింది. ఇక్కడి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కమలాపూర్‌ నియోజకవర్గంలో రెండుసార్లు, హుజూరాబాద్‌లో అయిదుసార్లు గెలిచారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2014లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా, 2018లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2021లో మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడంతో తెరాసకు రాజీనామా చేసి ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచి సంచలనం సృష్టించారు. 1994, 1999లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఇనుగాల పెద్దిరెడ్డి తెదేపా ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రి పదవులు చేపట్టారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన ముద్దసాని దామోదర్‌రెడ్డి కమలాపూర్‌ నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994, 1999లో ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీ రామారావు ప్రభుత్వంలో భూగర్భ గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1962, 1967లో కమలాపూర్‌ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కె.వి.నారాయణరెడ్డి న్యాయశాఖ మంత్రిగా సేవలు అందించారు.

ఇవీ ప్రత్యేకతలు

  •  స్వాతంత్య్రానికి పూర్వం జమ్మికుంటలో 1920వ దశకంలోనే ఏర్పాటైన రైల్వే స్టేషన్‌ ఇక్కడి ప్రత్యేకత.
  •  కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రత్యేక రైలు బ్రిడ్జి జమ్మికుంటకు ప్రత్యేక ఆకర్షణ.
  •  వావిలాల ఖాదీ ప్రతిష్ఠాన్‌ 1929లో ప్రారంభించారు. ఇది మెట్‌పల్లి ఖాదీకి అనుసంధానంగా ఉండేది. ఆ తర్వాత 1974లో విభజన జరిగి వావిలాల ఖాదీ ప్రతిష్ఠాన్‌గా ఏర్పాటైంది. దీనికి పీవీ నర్సింహారావు ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఇక్కడ తయారైన జాతీయ జెండాలను దిల్లీలోని ఎర్రకోటపై ఎగురవేయడంతో పాటు అతిపెద్ద జంపఖానాల తయారీ ఇక్కడి ప్రత్యేకత.
  • జమ్మికుంట పత్తి మార్కెట్‌ యార్డు రాష్ట్రస్థాయిలో అతి పెద్ద మార్కెట్‌గా గుర్తింపు పొందింది.  
  • ఇక్కడి పాత వ్యవసాయ మార్కెట్‌ యార్డును 1950లో హైదరాబాద్‌ సంస్థానం ప్రధాని ఎం.కె.వెల్లోడి ప్రారంభించారు.

నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు

రాజకీయ చైతన్యం కలిగిన ఇక్కడి నేతలకు రాష్ట్రస్థాయిలో పదవులు అందాయి. 2021లో జరిగిన ఉప ఎన్నికల ముందు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇక్కడి నేతలకు నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టారు. బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బండ శ్రీనివాస్‌ (ఇటీవల పదవీ కాలం పూర్తయింది) నియమితులయ్యారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ పదవి, పాడి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి వరించింది. ఇటీవల పిట్టల రవీందర్‌ను ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించారు. గత చరిత్రను పరిశీలిస్తే ఇక్కడి నేతలకు అనేక పదవులు దక్కాయి. మాజీ ఎమ్మెల్యే దుగ్గిరాల వెంకట్రావు ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో కర్షక పరిషత్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. సోదరులైన వొడితెల రాజేశ్వర్‌రావు, కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు ఇటు ఎమ్మెల్యేలుగా గెలవడంతో పాటు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై రెండు పదవులు అందుకున్నారు. పీవీ నర్సింహారావుకు అత్యంత సన్నిహితుడైన వొడితెల రాజేశ్వర్‌రావు ఆయన ప్రధాన మంత్రి ఉన్నపుడు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాజకీయ చక్రం తిప్పారు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన పొల్సాని నర్సింగరావు ఆర్టీసీ ఛైర్మన్‌గా సేవలు అందించి నియోజక వర్గంలో ప్రయాణ ప్రాంగణాల నిర్మాణంతో పాటు ఉమ్మడి జిల్లాలో ప్రజారవాణా మెరుగయ్యేలా కృషి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని