logo

అరచేతిలో వాతావరణ సమాచారం

వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్‌ మౌసం సేవా’ మొబైల్‌ యాప్‌ విడుదల చేసింది.

Updated : 28 Mar 2024 05:51 IST

మౌసం యాప్‌ లోగో
న్యూస్‌టుడే, రామగుండం: వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్‌ మౌసం సేవా’ మొబైల్‌ యాప్‌ విడుదల చేసింది. ‘ప్రతిచోటా వాతావరణం.. ఇంటింటికీ వాతావరణం’ పేరుతో ఈ కొత్త సేవను 12 భారతీయ భాషల్లో దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఎప్పటికప్పుడు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు, గాలి పవనాల వేగం, తేమశాతం, వర్షపాతం, పిడుగుపాటు, తుపాను హెచ్చరికలు, సూర్యదోయం, సూర్యాస్తమయం వంటి సమాచారాన్ని ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఎండలు మండిపోతుండటం, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు పెరగనుండటంతో ప్రజలు తాజా వాతావరణ ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవచ్చని రామగుండంలోని ఐఎండీ పరిశీలన కేంద్రం అధికారులు సూచిస్తున్నారు.  

 యాప్‌తో లబ్ధి ఇలా..

 ‘పంచాయత్‌ మౌసం సేవా’ మొబైల్‌ యాప్‌ను ప్లేస్టోర్‌  ద్వారా చరవాణిలో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. లాగిన్‌ అయి రాష్ట్రం, ప్రాంతం పేరును లేదా పిన్‌కోడ్‌, అక్షాంశ, రేఖాంశాలను తెలపాలి. వాతావరణ అంశాలను ప్రత్యేకంగా రంగుల(పిక్టొరియల్‌)తో రూపొందించడం వల్ల సాధారణ ప్రజలు, రైతులకు ఈ యాప్‌ ద్వారా సమాచారం సులువుగా అర్థం అవుతోంది. ఆంగ్లం, హిందీ సహా 12 భారతీయ భాషల్లో తాజా సమాచారం అందుతుంది. 24 రకాల వాతావరణ సమాచారం, సూచనలను ఈ యాప్‌లో పొందుపరిచారు. ఇందులోప్రజలకు మొదటిప్రాధాన్యం ఇచ్చారు. దీంతోపాటు రైల్వే, జాతీయ రహదారులు, విమానయానం, రక్షణ, నేవీ, టూరిజం, ఆరోగ్యం, నదులు, వాటి స్థితిగతులు, సీజనల్‌ వాతావరణం, మార్పులు, చేర్పులు వంటి వాటి గురించి తెలుసుకోవచ్చు.

ప్రతి గ్రామం.. రైతులతో అనుసంధానం

‘పంచాయతీ వాతావరణ సేవ’ ద్వారా మౌసం యాప్‌ను దేశంలోని ప్రతి గ్రామంలో అయిదుగురు రైతులతో అనుసంధానం చేయాలనే లక్ష్యంగా భారత వాతావరణ విభాగం అధికారులు ఈ యాప్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఐఎండీ ఈ ఏడాది జనవరి 16న దేశంలోని అన్ని వాతావరణశాఖ కార్యాలయాల్లో ఈ యాప్‌ను ప్రారంభించింది. ఈ ఏడాదంతా విద్యార్థులు, ప్రజలు, రైతులకు ప్రదర్శనలు, కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తోంది.

ఏడు దశాబ్దాలుగా సేవలు

రామగుండం పట్టణంలోని ఐఎండీ వాతావరణ పరిశీలన కేంద్రం గత ఏడు దశబ్దాలుగా ఉష్ణోగ్రతలు, వర్షపాతం, గాలుల వేగం వంటి అంశాలపై సేవలు అందిస్తోంది. ఉత్తర తెలంగాణలోని జిల్లాలకు నిరంతరం వాతావరణ సమాచార వివరాలు తెలియజేస్తోంది. నాలుగేళ్ల క్రితం ఈ కేంద్రంలో రేడియో సౌండ్‌ అండ్‌ రేడియో విండ్‌(ఆర్‌.ఎస్‌.-ఆర్‌.డబ్ల్యు.)పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతంలో అయిదు రకాల వాతావరణ పరిస్థితుల వివరాలతోపాటు వారం రోజులకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సైతం సేకరిస్తోంది. ఈ సమాచారాన్ని శాస్త్రవేత్తల విశ్లేషణ కోసం దిల్లీలోని కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని