logo

నిఘా నీడలో నియమావళి

సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేస్తోంది.

Published : 16 Apr 2024 03:18 IST

360 డిగ్రీల కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ

పెద్దపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో 360 డిగ్రీల కెమెరాలతో వాహనాలు

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేస్తోంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. నగదు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్టుకట్ట వేసేందుకు పలు బృందాలను నియమించింది. కోడ్‌ అమలులోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గాల్లో నిఘా బృందాలు రంగంలోకి దిగాయి. నామినేషన్‌ పర్వం సమీపిస్తుండటంతో తనిఖీలు ముమ్మరం చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన 360 డిగ్రీల కెమెరాల విధానం సత్ఫలితాలిచ్చింది. ఈ ఎన్నికల్లో దాన్ని వినియోగించనున్నారు.

నియోజకవర్గానికి అయిదు బృందాలు

ప్రతి శాసనసభా నియోజకవర్గానికి అయిదు రకాల నిఘా బృందాలు పని చేస్తున్నాయి. పోలీస్‌, రెవెన్యూ, సహకార, ఇతర శాఖలను ఇందులో భాగస్వాములను చేశారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లో పోలీస్‌ అధికారి, ఒక వీడియోగ్రాఫర్‌, స్టాటిక్‌ సర్వేలెన్స్‌లో డిప్యూటీ తహసీల్దార్‌, పోలీస్‌, అబ్కారీ, అటవీ శాఖ సిబ్బంది ఉంటారు. వీడియో సర్వే లెన్స్‌ బృందం ద్వారా వచ్చిన వీడియోలను వీడియో వ్యూయింగ్‌ బృందం సభ్యులు నిశితంగా పరిశీలిస్తారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌(ఎంసీసీ) బృందంలో గెజిటెడ్‌ అధికారితో పాటు పోలీస్‌, వీడియోగ్రాఫర్‌ ఉంటారు. నియమావళి ఉల్లంఘన, అభ్యర్థుల ప్రచారం, ఖర్చులపై వీరు నిఘా పెడతారు.

రాష్ట్ర కార్యాలయానికి అనుసంధానం

నిఘా బృందాల వాహనాలకు 360 డిగ్రీల కెమెరాలు బిగిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించారు. అభ్యర్థుల ప్రచారం, డబ్బు, మద్యం, ఇతర తాయిలాల పంపిణీ, అల్లర్లు, ఘర్షణలకు సంబంధించిన దృశ్యాలు ఈ కెమెరాల్లో నిక్షిప్తం కానున్నాయి. ప్రతి నియోజకవర్గానికి మూడు చొప్పున వాహనాలను అధికారులతో తిప్పుతున్నారు. వాహనాల కెమెరాలను జియోట్యాగింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర, జిల్లా ఎన్నికల కార్యాలయాలకు అనుసంధానించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో జరిగే ఘటనలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు వీక్షిస్తున్నారు.

ప్రలోభాలకు అడ్డుకట్ట

ఎన్నికలపై నిఘా బృందాలు పకడ్బందీగా పర్యవేక్షిస్తుండటంతో అల్లర్లు, హింస, మద్యం, ప్రలోభాలకు అడ్డుకట్ట పడుతోంది. గ్రామాలు, పట్టణాల్లో నిఘా బృందాల వాహనాలు అభ్యర్థుల వెంట నిరంతరం నీడలా వెంటాడుతున్నాయి. సీవిజిల్‌ యాప్‌, 1950 టోల్‌ఫ్రీ నంబరు ఫిర్యాదుల ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ఉల్లంఘిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని