logo

నేటి నుంచి నామినేషన్లు షురూ!

ఎన్నికల సమరంలో అసలైన ఘట్టం గురువారం నుంచి మొదలవనుంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ నెల రోజుల కిందటే వెలువడినప్పటికీ నేడు వెలువడే అధికారిక నోటిఫికేషన్‌తో అసలు అంకం షురూ అవనుంది.

Updated : 18 Apr 2024 05:14 IST

కలెక్టరేట్‌లలో పూర్తయిన ఏర్పాట్లు

నామినేషన్ల స్వీకరణకు పెద్దపల్లి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం

ఈనాడు - కరీంనగర్‌, పెద్దపల్లి: ఎన్నికల సమరంలో అసలైన ఘట్టం గురువారం నుంచి మొదలవనుంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ నెల రోజుల కిందటే వెలువడినప్పటికీ నేడు వెలువడే అధికారిక నోటిఫికేషన్‌తో అసలు అంకం షురూ అవనుంది. కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ లోక్‌సభ స్థానాలతో ముడి పడి ఉన్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇక అసలు సిసలు రాజకీయం కనిపించనుంది. వచ్చే నెల 13వ తేదీన ఎన్నికలు జరగనుండటంతో ప్రచారం హోరెత్తనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. 25వ తేదీ వరకు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసేందుకు అవకాశం ఉండటంతో ఆ దిశగా సన్నద్ధమయ్యారు. మంచి ముహూర్తాన్ని చూసుకుని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి పత్రాలను అందించనున్నారు. మధ్యలో ఆదివారం సెలవు రోజు మినహాయించి మిగతా అన్ని రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పత్రాలను స్వీకరిస్తారు. కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్‌లలో ఆయా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పోటీ చేసే అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కలెక్టర్ల ఛాంబర్‌లను సిద్ధం చేశారు. అక్కడ మూడంచెల పటిష్ఠమైన భద్రతతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థితోపాటు మరో నలుగురు మాత్రమే రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

19న మొదటి సెట్‌

కాంగ్రెస్‌, భారాస, భాజపా తరపున పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఒక్క కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసేదెవరో ఇంకా ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన వెంటనే నామినేషన్లు స్వీకరించనున్నారు. 25 వరకు నామినేషన్లు వేసుకోవచ్చు. 19వ తేదీ బలమైన ముహూర్తం ఉందని భావిస్తున్న అభ్యర్థులు మొదటి సెట్‌ ఆ రోజు దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు. తరువాత మరో మంచి రోజు చూసుకుని అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశముంది. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ, భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌, భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌ తమ మొదటి సెట్‌ నామపత్రాలు 19వ తేదీన దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆయా పార్టీల నాయకులు చెప్పారు. పెద్దపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు ఎమ్మెల్యేలు హాజరవనుండగా, భారాస అభ్యర్థి వెంట ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక భాజపా అభ్యర్థి 19న మొదటి సెట్‌ నామినేషన్‌ వేసి, 24వ తేదీన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, భాజపా ముఖ్య నేతలతో కలిసి మరోసారి నామినేషన్‌ వేయనున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌ 19వ తేదీన, భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌ 20వ తేదీన తమ మొదటి సెట్‌ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 25వ తేదీన అట్టహాసంగా మరోసారి నామినేషన్లు వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ధర్మపురి అర్వింద్‌ (భాజపా), బాజిరెడ్డి గోవర్ధన్‌ (భారాస)లు 19వ తేదీన నామినేషన్‌ వేయడానికి సిద్ధమవుతుండగా, కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి 22న నామపత్రాలు దాఖలు చేయనున్నారు.

200 మీటర్లు దూరంగా..

కలెక్టరేట్లలో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఉన్నందున 200 మీట్రర్ల దూరంగానే ర్యాలీలు నిలిపి వేయాలి. ఈ పరిధిలో నాయకుల ప్రచారం, ప్రసంగాలు నిషేధం. 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. నామపత్రాల దాఖలుకు వచ్చే సందర్బంలో అనుమతి తీసుకున్న మూడు వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తారు. పార్టీలు ప్రచార సభ, ర్యాలీల కోసం సువిధ యాప్‌లో అనుమతి తీసుకోవడం తప్పనిసరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని