logo
Published : 20 May 2022 02:13 IST

రైతు కష్టాలకు అడ్డుకట్ట

వ్యవసాయ డ్రోన్ల కొనుగోలుకు రాయితీ

మైసూరులో మొదలైన ఆహార ఉత్సవం

సమ్మేళనాన్ని ప్రారంభిస్తున్న కైలాశ్‌ చౌదరి, బీసీ పాటిల్‌, శ్రీదేవి అన్నపూర్ణ సింగ్‌ తదితరులు

ఈనాడు, బెంగళూరు : ఓ సామాన్య రైతు ఆహార ప్రక్రియ వ్యవస్థలను సమకూర్చుకోవటం కష్టంతో కూడుకున్న పని. నాజూకు వ్యవసాయ విధానంలో ఆహార ఉత్పాదన ప్రక్రియ (ఫుడ్‌ ప్రాసెసింగ్‌) వ్యవస్థలపై అనివార్యంగా అవగాహన ఉండాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాశ్‌ చౌదరి అన్నారు. మైసూరులోని కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ (సీఎఫ్‌టీఆర్‌ఐ)లో టెక్‌ భారత్‌- మూడో సమ్మేళనాన్ని ఆయన గురువారం ప్రారంభించి మాట్లాడారు. కనీసం 300 మంది రైతులు ఓ బృందంగా ఏర్పడి రైతు తయారీ సంస్థ (ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌- ఎఫ్‌పీఓ)ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ సంక్షేమ నిధుల ద్వారా 10 వేల ఎఫ్‌పీఓలను స్థాపించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 2013 నాటికి వ్యవసాయ రంగానికి రూ.23 వేల కోట్లను మాత్రమే కేటాయిస్తుండగా.. నేడు ఆ ప్రమాణం రూ.1.35 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. ఇందులో రూ.లక్ష కోట్లను వ్యవసాయ సంక్షేమ పథకాలకు కేటాయిస్తున్నాయన్నారు. ఈ నిధుల వినియోగంలో రైతు సముదాయాలు వెనుకబడి పోతున్నట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.65 వేల కోట్లను కిసాన్‌ సమ్మాన్‌ పథకం ద్వారా రైతుల ఖాతాకు నేరుగా వేసిన కేంద్రం.. మరిన్ని పథకాలను రూపొందిస్తున్నట్లు కైలాశ్‌ చౌదరి ప్రకటించారు.

ఎఫ్‌పీఓల్లో సభ్యులైన రైతులకు 75 శాతం రాయితీలతో వ్యవసాయ డ్రోన్లు కొనుగోలు చేసే వీలుందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. హరిత గృహాలు, శీతల గిడ్డంగులు, పంట విశ్లేషణ యూనిట్ల కోసం రూ.2 కోట్ల వరకు రుణాలిస్తున్న కేంద్రం వడ్డీ రేటును తగ్గిస్తోందని చెప్పారు. వీటిని ఆధునిక వ్యవసాయం కోసం వినియోగించాలని సూచించారు. వ్యవసాయ ఆవిష్కరణలు ఊపందుకునేందుకు యువత ఈ రంగంలో ఆసక్తి చూపుతుండటమే కారణమని రాష్ట్ర వ్యవసాయ మంత్రి బి.సి.పాటిల్‌ ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఎక్కువ శాతం వ్యవసాయ పథకాలకు, విలువ ఆధారిత, వైవిధ్య, మార్కెటింగ్‌, వ్యవసాయ ఉపాధి అవకాశాల కోసం కేటాయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్‌ మాజీ సీఈఓ క్రిస్‌ గోపాలకృష్ణన్‌, సీఎస్‌ఐఆర్‌ సీఎఫ్‌టీఆర్‌ఐ డైరెక్టర్‌ శ్రీదేవీ అనుపమా సింగ్‌, మైసూరు రాజవంశీకుడు యదువీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts