logo

బెంగళూరులో ఐటీ ఉద్యోగుల నీటి కష్టాలు..

బెంగళూరు నగరంలో ఏర్పడిన తాగునీటి సమస్య ఐటీ ఉద్యోగులపై తీవ్రప్రభావం పడింది. దాహార్తి వెంటాడుతుండటంతో వారు నీటి క్యాన్లు చేతపట్టుకుని గంటల తరబడి ఆర్‌ఓ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.

Updated : 20 Mar 2024 07:17 IST

నీటి క్యాన్లు చేతపట్టుకున్న బారులు తీరిన టెక్కీలు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రాష్ట్రరాజధాని బెంగళూరు నగరంలో ఏర్పడిన తాగునీటి సమస్య ఐటీ ఉద్యోగులపై తీవ్రప్రభావం పడింది. దాహార్తి వెంటాడుతుండటంతో వారు నీటి క్యాన్లు చేతపట్టుకుని గంటల తరబడి ఆర్‌ఓ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. కార్యాలయాలకు వెళ్లి పని చేయలేని పరిస్థితి ఏర్పడుతోందని ఐటీ ఉద్యోగులు వాపోయారు. నీటి కష్టాలు ప్రముఖ ఐటీ కంపెనీలపై పడింది. వారంతా దాహార్తి కేకలు, బాధలు, ఇబ్బందులను సామాజిక మాధ్యమాల్లో స్నేహితులతో పంచుకుంటున్నారు. కొన్ని వారాలపాటు వివిధ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానానికి అనుమతించక తప్పడం లేదు. కొందరు టెక్కీలు కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊర్లకు ప్రయాణం కట్టారు. నీటి కోసం ట్యాంకర్లను బుకింగ్‌ చేస్తే అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. వంట పాత్రలు కడిగే పనిలేకుండా ప్రత్యామ్నాయాలు వెదుక్కుంటున్నారు. 25 లీటర్ల నీటి డబ్బాలతో ఎక్కువ మంది టెక్కీలు ఉదయాన్నే శుద్ధీకరణ కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్న దృశ్యాలు సర్వసాధారణంగా మారాయి. అనేక అపార్ట్‌మెంట్లలో నీటి రేషన్‌ వ్యవస్థను అమలులోకి తెచ్చారు. నిర్ణయించిన స్థాయిలోనే వినియోగించాలి. ఎక్కువగా వాడితే జరిమానా విధిస్తున్నారు. కొన్ని కుటుంబాలు రోజుకు రూ.500 వరకు నీటికే వెచ్చించక తప్పడం లేదు.

మాఫియా మాయాజాలం

రాజధాని నగరంలో తలెత్తిన తాగునీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పూర్తిగా ‘ట్యాంకర్‌ మాఫీయా’కు లొంగిపోయారని ప్రతిపక్ష నేత ఆర్‌.అశోక్‌ ఆరోపించారు. గడువు పూర్తయినా ప్రభుత్వ ఆదేశాలను ట్యాంకర్ల యజమానులు లెక్క చేయలేదన్నారు. నీటి సరఫరా కోసం ప్రైవేట్‌ ట్యాంకర్ల యజమానులు పేర్లు నమోదు చేసుకోలేదని, నమోదు చేసుకున్న యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆయన ఎక్స్‌ వేదికపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి గందరగోళం మధ్య ప్రజలు గొంతులు తడుపుకోవడానికి పరుగులు తీస్తున్నారని వాపోయారు. కాంగ్రెస్‌ పాలకులు ఏమీ పట్టినట్లుగా మొద్దునిద్రలో ఉన్నారని మండిపడ్డారు. సమస్య పరిష్కరించేందుకు నిజాయితీగా ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదన్నారు. సహాయవాణికి ఎవరైనా ఫోన్‌ చేస్తే స్పందన తక్కువేనని, ప్రైవేట్‌ సంస్థల సహకారంతో వార్డుకు ఒకటి చొప్పున సహాయవాణి కేంద్రాలను ప్రారంభించి ప్రజాసమస్యలకు స్పందించాలని ఒత్తిడి తెచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని