logo

‘వారసత్వ’ రథాల జోరు

లోక్‌సభ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న తమ వారసులను గెలిపించుకునేందుకు కుటుంబసభ్యులు ప్రచార రంగంలోకి దిగారు. మండుటెండలనూ లెక్క చేయకుండా ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

Published : 17 Apr 2024 05:04 IST

బెంగళూరు దక్షిణ : కాంగ్రెస్‌ అభ్యర్థి సౌమ్యారెడ్డి, మంత్రి రామలింగారెడ్డి ప్రచారం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న తమ వారసులను గెలిపించుకునేందుకు కుటుంబసభ్యులు ప్రచార రంగంలోకి దిగారు. మండుటెండలనూ లెక్క చేయకుండా ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. వరుసకు బంధువులైన వారంతా ప్రచార రంగంలో దిగారు. మునుపెన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల్లో రాజకీయ నాయకుల వారసులు బరిలో నిలిచారు. వారి విజయం కోసం కుటుంబసభ్యులంతా శ్రమిస్తున్నారు. బెంగళూరు దక్షిణ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి సౌమ్యారెడ్డి తరఫున ఆమె తండ్రి మంత్రి రామలింగారెడ్డి రాత్రింబగళ్లు పని చేస్తున్నారు. ప్రచారంతో పాటు ఇతర పార్టీల నేతలతో చర్చిస్తున్నారు. నేతలు- కార్యకర్తల మధ్య సమన్వయ సాధనను తలకెత్తుకున్నారు. బెంగళూరు కేంద్ర లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి మాన్సూర్‌ అలిఖాన్‌ భార్య తస్బియా అలి ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ భార్య డీకే ఉషా తన మరిది బెంగళూరు గ్రామీణ లోక్‌సభ కాంగ్రెస్‌ సభ్యుడు డీకే సురేష్‌ గెలుపు కోసం పక్షం రోజులుగా కష్టపడుతున్నారు. ఆమె రాజరాజేశ్వరీనగర విధానసభ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడ అల్లుడు డాక్టర్‌ మంజునాథ్‌ బెంగళూరు గ్రామీణ లోక్‌సభ భాజపా అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయన భార్య అనసూయ ప్రచారానికి కదలిరావడం ఆసక్తిదాయక ఘట్టం. విద్యావంతుడు, వైద్యులు మంజునాథ్‌ సేవలను ఆమె ఓటర్లకు వివరించి, ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మండ్యలో పోటీ చేస్తున్న కుమారస్వామికి మద్దతుగా ఆయన కుమారుడు నిఖిల్‌ కుమారస్వామి బాధ్యతలన్నీ తలకెత్తుకున్నారు.


ఓటర్ల మనసు గెలిచేదెలా?

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఓటర్ల మనసు గెలవాలి.. ఎన్నికల్లో నెగ్గాలి.. ఇదే అభ్యర్థులందరి లక్ష్యం! మొదటి విడుత ఎన్నికల బహిరంగ ప్రచారానికి మరో ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉంది. బెంగళూరులో ఉత్తర, దక్షిణ, కేంద్ర, గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు తమ ప్రచార జోరును పెంచారు. మంత్రి దినేశ్‌ గుండూరావు, మాజీ ఎమ్మెల్సీ రమేశ్‌ కుమార్‌, యువ కాంగ్రెస్‌ సమితి నాయకుడు మహ్మద్‌ నలపాడ్‌ తదితరులతో కలిసి సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి మన్సూర్‌ అలీ ఖాన్‌ మంగళవారం సుడిగాలి పర్యటనలు చేశారు. హైకోర్టు ఆవరణలో సౌమ్యారెడ్డి, మన్సూర్‌ అలీఖాన్‌, ఆచార్య రాజీవ్‌గౌడ న్యాయవాదులతో కొంత సమయం చర్చించారు. బెంగళూరు గ్రామణ విభాగం కనకపుర చుట్టుపక్కల గ్రామాల్లో పాదయాత్ర ద్వారా కాంగ్రెస్‌ అభ్యర్థి డీకే సురేశ్‌ ప్రచారాన్ని నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తన నియోజకవర్గం పరిధిలో ఓటర్లను పలకరిస్తూ కొంత సమయం ప్రచారాన్ని నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని