logo

భాజపా రామాలయం నిర్మిస్తే.. మేం రామరాజ్యమే తెస్తాం

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రామరాజ్యమే నిర్మిస్తామని బళ్లారి జిల్లా మంత్రి బి.నాగేంద్ర స్పష్టం చేశారు. జూన్‌ 4న కేంద్రంలో భాజపా ప్రభుత్వం పతనమవుతుంది.

Published : 18 Apr 2024 02:44 IST

కాంగ్రెస్‌ ప్రణాళిక ప్రతులను విడుదల చేస్తున్న మంత్రులు జమీర్‌ అహ్మద్‌ఖాన్‌, బి.నాగేంద్ర, అభ్యర్థి తుకారాం

హొసపేటె, న్యూస్‌టుడే: కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రామరాజ్యమే నిర్మిస్తామని బళ్లారి జిల్లా మంత్రి బి.నాగేంద్ర స్పష్టం చేశారు. జూన్‌ 4న కేంద్రంలో భాజపా ప్రభుత్వం పతనమవుతుంది. రాహుల్‌గాంధీ ప్రధానిగా అధికారం స్వీకరిస్తారని జోస్యం పలికారు. హొసపేటెలో బుధవారం ఏర్పాటు చేసిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. భాజపావారు ఉత్తరప్రదేశ్‌లో రామమందిరాన్ని మాత్రమే నిర్మించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రామరాజ్య కల నిజం చేస్తామని అన్నారు. లోక్‌సభ కురుక్షేత్రంలో పాండువులు, కౌరవుల నడుమ యుద్ధం జరుగుతోంది. చివరికి గెలుపు పాండువులదే. భాజపాలోని కౌరవులంతా మట్టి కరుస్తారని జోస్యం పలికారు. బళ్లారి, విజయనగర జిల్లాల్లో విస్తరించిన బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేటికీ పటిష్ఠంగా ఉంది. రెండు జిల్లాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి తుకారాంను ఆధిక్యంతో గెలిపిస్తామని తాను, మంత్రి జమీర్‌ ప్రతినబూనామని స్పష్టం చేశారు. ఇద్దరు మంత్రులకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయని తెలిపారు. విజయనగర జిల్లా బాధ్యమంత్రి జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలు, నాయకులు రేయింబవళ్లు కృషి చేయాలని సూచించారు. ఎన్నికల తరువాత రాష్ట్రంలో అభివృద్ధి మరింత పుంజుకుంటుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన విధంగా దేశ ప్రజలకు ఇంకా మంచి ఎప్పుడొస్తాయో అని వ్యంగమాడారు. అభ్యర్థి ఇ. తుకారాం, మాజీ ఎంపీ వి.ఎస్‌.ఉగ్రప్ప, ఎమ్మెల్యేలు గవియప్ప, డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడారు. హడగలి, హొసపేటెలోని పలువురు భాజపా నాయకులు, హగరిబొమ్మన హళ్లిలోని కొందరు జేడీఎస్‌ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. కేపీసీసీ ప్రధాన కార్యదర్శి రాణిసంయుక్త, డీసీసీ అధ్యక్షుడు సిరాజ్‌ షేక్‌, శివయోగి స్వామి, మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ రఫీక్‌ పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని