logo

ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం

జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్‌ సమితి సంయుక్తంగా పోలింగ్‌ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి.

Published : 19 Apr 2024 02:54 IST

గెణికెహళ్‌లో ఎద్దుల బండ్లతో ఓటర్లకు అవగాహన

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్‌ సమితి సంయుక్తంగా పోలింగ్‌ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. బళ్లారి తాలూకా కుడతిని అంగన్‌వాడీ కేంద్రం ముఖ్య పర్యవేక్షకురాలు సుమంగళమ్మ నేతృత్వంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పసుపు, కుంకుమ అందజేసి మే 7న పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. జిల్లా స్వీప్‌ సమితి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మారథాన్‌, వాక్‌థాన్‌ కాగడాలు,  కొవ్వొత్తుల ప్రదర్శన, చిత్రకళ, ఎద్దుల బండ్ల ఊరేగింపు వంటి కార్యక్రమాలతో ఓటర్లకు అవగాహన కల్పించారు. కుడతిని అంగన్‌వాడీ కేంద్రం ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించడంతో అధికారులను అభినందించారు. కురుగోడు తాలూకా పంచాయతీ, స్వీప్‌ సమితి ఆధ్వర్యంలో పోలింగ్‌ శాతం పెంచడానికి వినూత్నంగా కురుగోడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. తహసీల్దార్‌ నిర్మల, అధికారులు రేణుకాదేవి, తిమ్మప్ప, అనిల్‌కుమార్‌ ప్రారంభించారు. తాలూకా ఓర్వాయి, గెణికెహళ్‌ గ్రామాల్లో ఎద్దుల బండ్లపై ఓటర్లకు అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ అధికారి జయలక్ష్మి, తదితర అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించారు.

కురుగోడులో ఓటర్లకు అవగాహన కల్పించడానికి క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభిస్తున్న అధికారులు

ఎన్నికల జాగృతికి రీల్స్‌ పోటీలు

హొసపేటె: వచ్చే నెల 7న జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాగృతి కోసం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా ప్రజలకు రీల్స్‌ పోటీలను ఏర్పాటు చేశామని జిల్లా పాలనాధికారి ఎం.ఎస్‌.దివాకర ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగర జిల్లాలో ఓటింగ్‌ శాతం 90 దాటాలన్న లక్ష్యంతో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వినూత్నంగా జిల్లా ప్రజల నుంచి ఓటింగ్‌ జాగృతి రీల్స్‌ పోటీలను ఏర్పాటు చేశామన్నారు. 30 సెకన్ల నుంచి ఒక నిమిషం నిడివిలో జాతృతి రీల్స్‌ను చేసి వాట్సాప్‌ నంబరు 8660752667కు పంపాలన్నారు. ఈ నెల 26లోగా రీల్స్‌ను సమర్పించాలన్నారు. ప్రథమ బహుమతి రూ.5వేలు, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.3, రూ.2వేలు అందజేస్తామని డీసీ పేర్కొన్నారు.


ఎమ్మిగనూరులో ఎడ్ల బండి జాతా

జాతాలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు

కంప్లి, న్యూస్‌టుడే: ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా తాలూకాలోని ఎమ్మిగనూరులో స్వీప్‌ సమితి గురువారం ఎడ్ల బండి జాతా నిర్వహించింది. ప్రభుత్వ పాఠశాల వద్ద జాతాను తాలూకా పంచాయతీ అధికారి ఆర్‌.కె.శ్రీకుమార్‌ ప్రారంభించారు. జాతా పాఠశాల నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల్లో సాగింది. ప్రజల్లో జాగృతి కలిగించేందుకు ఓటు హక్కు నినాదాలు చేశారు. గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు శారద, సభ్యులు, అధికారులు, ఉపాధ్యాయులు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని