logo

ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట

రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో కీలక నేతల సందడి కొనసాగుతోంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రముఖులు అమిత్‌ షా, జేపీ నడ్డా రాకతో అభ్యర్థులు చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు.

Published : 24 Apr 2024 05:54 IST

 ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 

మల్లికార్జున ఖర్గే

ఈనాడు, బెంగళూరు : రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో కీలక నేతల సందడి కొనసాగుతోంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రముఖులు అమిత్‌ షా, జేపీ నడ్డా రాకతో అభ్యర్థులు చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌లోనూ సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడుమల్లికార్జున ఖర్గే బెంగళూరు గ్రామీణం, చిక్కబళ్లాపుర పరిధిలో ప్రచారాన్ని కొనసాగించారు. మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండ్య, హాసన, శివమొగ్గ జిల్లాల్లో, డీకే శివకుమార్‌ బెంగళూరు గ్రామీణలో సోదరుడు డీకే సురేశ్‌ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారానికి చివరి క్షణాలు చేరువైన క్రమంలో నేతలంతా అభ్యర్థుల కోసం పతాక స్థాయిలో ప్రచారానికి సిద్ధమవుతున్నారు.

 కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో 15 నుంచి 20 స్థానాల్లో విజయం సాధించటం ఖాయమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆయన సోమవారం రాత్రి చెన్నపట్టణలో మాట్లాడుతూ ప్రజలంతా పేదల ప్రభుత్వం, ఉపాధి అందించే వ్యవస్థ, ఆర్థిక మాంద్యాన్ని నియంత్రించే యంత్రాంగం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. వారి ఆశయాలు నెరవేరే ప్రభుత్వం ఏర్పాటవుతుందని ప్రకటించారు. భాజపాకు కేవలం ఎన్నికల్లో విజయం సాధిస్తే చాలనేదే లక్ష్యమన్నారు. దేశ ప్రజలంతా సురక్షితంగా జీవించే వ్యవస్థలు కల్పించేందుకు కాంగ్రెస్‌ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. భాజపా ఏనాడూ ప్రభుత్వరంగ సంస్థల వాస్తవాలను బహిరంగపరచదన్నారు. టీవీలు, మొబైళ్లను చూసిన వెంటనే వారి ఫొటోలు కనిపించేలా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. దేశ ప్రజలు, ప్రజాస్వామ్యం కోసం కమలనాథులు ఏమీ చేయలేదన్నారు. ఏదైనా సంఘటన జరిగితే దానిని ఎలా రాజకీయం చేయాలో చూస్తుంటారని తప్పుపట్టారు. హుబ్బళ్లిలో విద్యార్థిని హత్యనూ అదే కోణంలో రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని నిందించారు. ఈ సంఘటన వెనుక ఉన్నవారిని శిక్షించేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధంగా ఉందన్నారు. చట్టప్రకారం అతనికి శిక్ష పడటం ఖాయమన్నారు. ఇందులో రాజకీయం చేయాల్సింది ఏదీ లేదన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అరిసికెరెలో చేపట్టిన ప్రచారంలో దేవేగౌడ కుటుంబం ఒక్కలిగ నేతల ఉన్నతికి ఎలా అడ్డుకట్ట వేసిందో వివరిస్తూ ప్రచారం చేయగా.. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ యలహంక, కనకపురల్లో భాజపా సర్కారు కరోనా సమయంలో పాల్పడిన అక్రమాలను ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని