logo

పత్తి కొనుగోళ్లపై తొలగని ప్రతిష్టంభన

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో  నాలుగు రోజుల నుంచి పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. జీఎస్టీ చెల్లింపుల విషయంలో అధికారులకు, వ్యాపారులకు మధ్య ఏర్పడిన సమస్య పరిష్కారం కోసం వ్యాపారులు నవంబరు 28న కొనుగోళ్లు నిలిపివేసిన విషయం తెలిసిందే.

Published : 02 Dec 2022 02:55 IST

ఛైర్‌పర్సన్‌ లక్ష్మీప్రసన్నకు కర్షకుల ఇబ్బందులు వివరిస్తున్న రైతుకూలీ సంఘం నాయకులు గుర్రం అచ్చయ్య తదితరులు

ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో  నాలుగు రోజుల నుంచి పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. జీఎస్టీ చెల్లింపుల విషయంలో అధికారులకు, వ్యాపారులకు మధ్య ఏర్పడిన సమస్య పరిష్కారం కోసం వ్యాపారులు నవంబరు 28న కొనుగోళ్లు నిలిపివేసిన విషయం తెలిసిందే. ·రైతు సంఘాలు సైతం కొనుగోళ్లు చేపట్టాలని ఆందోళన నిర్వహిస్తున్నాయి. గురువారం ఉదయం వ్యవసాయ మార్కెట్లో పత్తి వ్యాపారులతో సమావేశమయ్యాయి. వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, ఉపాధ్యక్షుడు జీవై నరేశ్‌, దిగుమతిశాఖ అధ్యక్ష, కార్యదర్శులు దిరిశాల చిన వెంకటేశ్వర్లు, ముత్యం ఉప్పల్‌రావు, ఎగుమతిశాఖ అధ్యక్ష, కార్యదర్శులు నల్లమల ఆనంద్‌, చెరుకూరి సంతోష్‌కుమార్‌, ఛాంబర్‌ ఈసీ సభ్యులు, పలువురు కార్యదర్శులు, ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర నాయకులు గుర్రం అచ్చయ్య, జిల్లా కార్యదర్శి ఆవుల వెంకటేశ్వర్లు చర్చించారు. కొనుగోళ్లు జరపాలని మార్కెట్‌ పాలకవర్గం, అధికారులు, దిగుమతిశాఖ విజ్ఞప్తి చేసినా సమ్మెకే సిద్ధపడ్డారు. అధికారులు పత్తి మార్కెట్‌కు శుక్రవారమూ బంద్‌ ప్రకటించారు. ఈ విషయాన్ని ఏఎంసీ ఛైర్‌పర్సన్‌ డౌలె లక్ష్మీప్రసన్న, వైస్‌ఛైర్మన్‌ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మార్కెట్‌ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఆర్‌.మల్లేశం దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌ గౌతమ్‌, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ను కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. మరోవైపు వరంగల్‌ వ్యవసాయ మార్కెట్లో పత్తి వ్యాపారులు కొనుగోళ్ల నిలిపివేతకు గురువారం అక్కడి అధికారులకు నోటీసులు ఇచ్చారు.

నేడు హైదరాబాద్‌లో చర్చలు:

పత్తి వ్యాపారుల సమస్య మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు దృష్టికి వెళ్లింది. ఖమ్మం, వరంగల్‌ మార్కెట్ల పరిధిలోని పత్తి వ్యాపారులను చర్చల కోసం హైదరాబాద్‌కు శుక్రవారం ఆహ్వానించారు. కాటన్‌ ట్రేడర్స్‌ అండ్‌ జిన్నింగ్‌ మిల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొడవర్తి శ్రీనివాసరావు, ఖమ్మం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎగుమతిశాఖ అధ్యక్షుడు నల్లమల ఆనంద్‌, కార్యదర్శి చెరుకూరి సంతోష్‌కుమార్‌ చర్చలకు హాజరుకానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని