logo

హైదరాబాద్‌కు ‘అర్బన్‌’ బస్సులు

ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గతంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం(జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ అర్బన్‌ రెన్యువల్‌ మిషన్‌) బస్సులను ఖమ్మం రీజియన్‌కు కేటాయించింది.

Updated : 06 Feb 2023 06:17 IST

ఖమ్మం డిపోలో నిలిపిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులు

ఖమ్మం మయూరిసెంటర్‌, న్యూస్‌టుడే: ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గతంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం(జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ అర్బన్‌ రెన్యువల్‌ మిషన్‌) బస్సులను ఖమ్మం రీజియన్‌కు కేటాయించింది. 2014లో ఖమ్మం రీజియన్‌లోని ఖమ్మం డిపోకు 20, కొత్తగూడెం డిపోకు 2 బస్సులను కేటాయించారు. నాటి నుంచి ప్రయాణికులకు రవాణా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే వీటిని హైదరాబాదు సిటీకి పంపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.


ఖర్చు ఎక్కువ.. ఆదాయం తక్కువ

జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సుల్లో సీటింగ్‌ సామర్థ్యం తక్కువ. వీటిని బోనకల్లు, ఇల్లెందు వంటి ప్రాంతాలకు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. ఈ బస్సు రవాణాకు ఇంధనం ఖర్చు ఎక్కువగా ఉండేది. రాబడి మాత్రం తక్కువగా ఉండేది. ఈ క్రమంలో బస్సులను రోడ్డుపై తిప్పలేని పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.


ఆరు నెలలుగా డిపోలోనే..?

సుమారు ఆరు నెలలుగా జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులను ఖమ్మం, కొత్తగూడెం డిపోల్లోనే ఉంచుతున్నట్లు సమాచారం. గతంలో నిత్యం సేవలందించే బస్సులు ఇటీవల రోడ్లపై పరుగులు తీయడం లేదు. అయితే కండీషన్‌లో ఉంచేందుకు మాత్రం రొటేషన్‌ పద్ధతిలో రోడ్డెక్కిస్తున్నారు. అరుదుగా కనిపిస్తున్నాయి.


ఇప్పటికే సిటీకి 7 బస్సులు

ఖమ్మం డిపోలో ఉన్న 20 బస్సుల్లో ఇప్పటికే 7 హైదరాబాదు సిటీకి వెళ్లాయి. మిగిలిన వాటిని సైతం విడతల వారీగా పంపిస్తారని తెలుస్తోంది. 2014 నుంచి సుమారు 9 ఏళ్లపాటు ఖమ్మం రీజియన్‌లో సేవలందించాయి. బస్సులతో పాటు డ్రైవర్లూ వెళ్లాల్సి ఉంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

* జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సుల్లో ఇప్పటికే 7 హైదరాబాదు పంపించాం. హైదరాబాదు సిటీలో వీటి అవసరం ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. వారి ఆదేశాల ప్రకారమే పంపిస్తున్నాం. 

- ఎస్తర్‌ ప్రభులత, ఖమ్మం ఆర్‌ఎం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని