logo

జిల్లా తొలిమంత్రి శీలం సిద్ధారెడ్డి

1952లో ఏర్పడ్డ మధిర నియోజకవర్గం నుంచి శీలం సిద్ధారెడ్డి జిల్లాలోని తొలిమంత్రిగా పనిచేశారు. ఆయన స్వగ్రామం ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు.

Published : 28 Oct 2023 05:01 IST

మధిర, న్యూస్‌టుడే

1952లో ఏర్పడ్డ మధిర నియోజకవర్గం నుంచి శీలం సిద్ధారెడ్డి జిల్లాలోని తొలిమంత్రిగా పనిచేశారు. ఆయన స్వగ్రామం ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు. సిద్ధారెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికై కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో 1967 మార్చి 6న మంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు నీటిపారుదల, గిరిజన సంక్షేమశాఖలు కేటాయించారు. ఎర్రుపాలెం మండలానికి కట్లేరుపై సాగునీటి ప్రాజెక్టును నిర్మించేందుకు కృషి చేశారు. పలు ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు ఆయన హయాంలోనే జరిగాయి. బనిగండ్లపాడులో ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆడిటోరియం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ముఖ్యమంత్రిగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేయటంతో ఆ మంత్రివర్గంలో ఉన్న సిద్ధారెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం తిరిగి బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రిగా 1969 జులై 19న ప్రమాణ స్వీకారం చేయించారు. 1970లో జరిగిన శాసన మండలికి శాసనసభ్యుల ద్వారా జరిగిన ఎన్నికల్లో సిద్ధారెడ్డి మూడోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1971 సెప్టెంబర్‌ 30న పీవీ నర్సింహారావు మంత్రివర్గంలో సిద్ధారెడ్డి నీటిపారుదలశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రభుత్వంలో ఏర్పడ్డ విభేదాలు కారణంగా 1972 మార్చి 20న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన ఏఐసీసీ సభ్యులుగా ఉంటూ రాష్ట్ర, దేశ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. 1978లో జరిగిన ఎన్నికల్లో మధిర నుంచి జాతీయ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1983 జనవరి 3న జరిగిన ఎన్నికల్లో మధిర నుంచి కాంగ్రెస్‌ తరఫున తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985, 1989, 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి వరుస పరాజయాలు పొందారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిద్ధారెడ్డిని షాడో ముఖ్యమంత్రి అని పిలిచేవారు. గోసవీడు క్యాంపు ఇన్‌ఛార్జిగా పనిచేసి రజాకార్లను గడగడలాడించిన సమరయోధుడిగా పేరుపొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని