logo

‘సైబర్‌’ దోపిడీ సొమ్ము.. అమాయకుల ఖాతాలకు!

సైబర్‌ నేరస్థులు అమాయకుల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారని, వాటి సాయంతో లూటీ సొమ్మును వాడుకుంటున్నారని ఎస్పీ బి.రోహిత్‌రాజు గురువారం తెలిపారు. 

Updated : 29 Mar 2024 04:48 IST

కొత్తగూడెం నేరవిభాగం: సైబర్‌ నేరస్థులు అమాయకుల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారని, వాటి సాయంతో లూటీ సొమ్మును వాడుకుంటున్నారని ఎస్పీ బి.రోహిత్‌రాజు గురువారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ‘సుధాకర్‌ అనే వ్యక్తి అశోక్‌గుప్తాతో కలిసి దుబాయ్‌ నుంచి ఖమ్మం రూరల్‌ మండలం గుర్రాలపాడుకు చెందిన తన బావమరిది కస్యా చినబాబు అలియాస్‌ హర్షకు కొద్దినెలల క్రితం ఫోన్‌చేశాడు. తాము ట్రేడింగ్‌ చేయడానికి బ్యాంకు కరెంట్‌ ఖాతా కావాలని చెప్పారు. ఇందుకోసం రూ.50 వేలు ఇస్తామన్నారు. ఖమ్మం గాంధీచౌక్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో లోన్‌ కన్సల్టెంట్గా పనిచేస్తున్న కస్యా డబ్బుకు ఆశపడి తన భార్య ప్రియాంక పేరిట కరెంట్‌ ఖాతా తెరిచి ఆవివరాలు వారికి పంపాడు. కొంతకాలం తర్వాత అశోక్‌గుప్తా మళ్లీ కస్యాను ఫోన్లో సంప్రదించాడు. మరో ఐదుగురిపై బ్యాంకు ఖాతాలు తెరిపించాలని మరింత డబ్బు ఆశచూపాడు. కస్యా ఇల్లెందుకు చెందిన తన భార్య ప్రియాంక ద్వారా ఆమె స్నేహితుడైన చైతన్యను సంప్రదించాడు. రూ.లక్ష డబ్బు ఆశ చూపడంతో అతడు డ్వాక్రా మహిళల ఆధారాలతో ఖాతాలు తెరిపించాడు. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఇచ్చాడు. మిగతా రూ.25 వేలు తన జేబులో వేసుకున్నాడు. బ్యాంకు ఖాతాల ఏటీఎం, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వివరాలను అశోక్‌గుప్తాకు పంపించాడు. అక్రమ లావాదేవీల వ్యవహారం బయటకు పొక్కింది.  బాధితుల ఫిర్యాదుతో ఇల్లెందు   పోలీసులు రంగంలోకి దిగారు.  

దుబాయ్‌ అడ్డాగా దందా..  దుబాయ్‌ కేంద్రంగా అశోక్‌గుప్తా, సుధాకర్‌ సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. ఇండియాలోని పలువురు వ్యాపారులను వాట్సాప్‌ ద్వారా సంప్రదిస్తున్నారు. క్రిఫ్టోకరెన్సీ, బిట్ కాయిన్‌లలో పెట్టుబడి పెడితే ఎన్నో రెట్లు లాభాలు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. ఆ డబ్బును దుబాయ్‌లోని తమ సొంత ఖాతాలకు బదిలీ చేయించుకుని విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. గతంలో ఇదే తరహాలో మోసాలకు పాల్పడిన వీరిపై హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ ఠాణాలో కేసులు నమోదైనట్లు ఇల్లెందు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసుతో సంబంధం ఉన్న స్థానిక నిందితులను గురువారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని