logo

అసైన్డ్‌ భూముల్లో కట్టడాల కూల్చివేత

ఖమ్మం నగరంలోని 8వ డివిజన్‌ వైఎస్‌ఆర్‌ నగర్‌ ప్రాంతంలో అసైన్డ్‌ భూముల్లో అసలు యజమానులు కాకుండా కొనుగోలు చేసినవారు చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు గురువారం కూల్చివేశారు.

Published : 29 Mar 2024 02:24 IST

వైఎస్‌ఆర్‌ నగర్‌ సమీపంలో స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన స్థలాల్లో నిర్మాణాలను కూల్చివేస్తున్న నగరపాలక సంస్థ సిబ్బంది

ఖమ్మం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ఖమ్మం నగరంలోని 8వ డివిజన్‌ వైఎస్‌ఆర్‌ నగర్‌ ప్రాంతంలో అసైన్డ్‌ భూముల్లో అసలు యజమానులు కాకుండా కొనుగోలు చేసినవారు చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు గురువారం కూల్చివేశారు. 1997, 2005 సంవత్సరాల్లో ఖానాపురం, వైఎస్‌ఆర్‌ కాలనీ స్వాతంత్య్ర సమరయోధులకు 144 చదరపు గజాల స్థలాన్ని 439కి అసైన్డ్‌ చేశారు. ఆ తరువాత ఆయా స్థలాలను పొందిన వారు ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. కొందరు నిబంధనలకు విరుద్ధంగా వాటిని ఇతరులకు అమ్ముకున్నారు. ఇదే సమయంలో ఒక్కో స్థలం ముగ్గురు, నలుగురు చేతులు మారింది. కొంతమంది వాటికి నకిలీ పత్రాలు సృష్టించి నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయంలో కలెక్టర్‌కు ఫిర్యాదులు అందిన  నేపథ్యంలో సుమారు 22 కట్టడాలు, 20 పునాదులను అధికారులు కూల్చేశారు.

కొనుగోలుదారుల ఆందోళన: ఇళ్లు, పునాదులను కూల్చివేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న కొనుగోలుదారులు భారీఎత్తున అక్కడకు చేరుకున్నారు. అప్పటికే కట్టడాలను కూల్చివేయడంతో వారంతా మిన్నకుండిపోయారు. అక్కడున్న అధికారులను అడిగినా తమకేమీ తెలియదని,  ఉన్నతాధికారుల ఆదేశాలను మాత్రమే తాము అమలుచేస్తున్నామని చెప్పడంతో ఆందోళన చెందారు.

ఒకరిపై ఒకరు దాడులు: ఈ స్థలాల అమ్మకాల్లో కీలక పాత్ర పోషించిన కొంతమంది మధ్యవర్తులు అదే సమయంలో అక్కడకు చేరుకోవడంతో వివాదం చోటుచేసుకుంది. రెవెన్యూ, పోలీస్‌, నగరపాలక సంస్థ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోగానే కొనుగోలు చేసిన కొంతమంది ఆ ప్రాంతంలో నివాసం ఉంటూ మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తిని నిలదీయడంతో  వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా ఉద్రిక్తంగా మారి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. స్థానికులు జోక్యం చేసుకోవటంతో వివాదం సద్దుమణిగింది.

నిరుపయోగ అసైన్డ్‌ స్థలాల స్వాధీనం: వైఎస్‌ఆర్‌ నగర్‌లోని సర్వే నంబర్‌ 37లో స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన స్థలాలు నిరుపయోగంగా ఉండటంతో వాటిని స్వాధీనపరచుకున్నట్లు అధికారులు తెలిపారు. 439 మందికి అసైన్డ్‌ చేయగా, కొంతమంది నిర్మాణాలు చేపట్టలేదని, మరికొందరు ఇతరులకు అమ్ముకున్నారని చెప్పారు. కూల్చివేత కార్యక్రమంలో ప్రణాళిక విభాగం ఏసీపీ వసుంధర, టీపీఎస్‌ సంతోష్‌, ఆర్‌ఐలు రమేష్‌, రవి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని