logo

దండుకున్నారు.. తిప్పించుకుంటున్నారు..!

కొత్తగూడెం నియోజకవర్గంలో ‘దళితబంధు’ పేరిట భారీగా వసూళ్ల పర్వం సాగింది. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.3 లక్షలు దండుకున్నారు. ఈవ్యవహారంలో అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు, పురపాలికలోని కొంతమంది ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించారు.

Published : 29 Mar 2024 02:25 IST

కొత్తగూడెం నియోజకవర్గంలో ‘దళితబంధు’ పేరిట భారీగా వసూళ్ల పర్వం సాగింది. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.3 లక్షలు దండుకున్నారు. ఈవ్యవహారంలో అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు, పురపాలికలోని కొంతమంది ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించారు. తీరా యూనిట్‌ దక్కకపోవటంతో తమ డబ్బు తిరిగి చెల్లించాలంటూ నేతల ఇళ్ల చుట్టూ బాధితులు తిరుగుతున్నారు. భద్రాచలం నియోజకవర్గంలోనూ వివిధ మండలాల్లో వసూళ్ల పర్వం సాగింది. యూనిట్లు రావని తేలడంతో కొంతమందికి సొమ్ము తిరిగిచ్చేశారు.

దళితబంధు యూనిట్‌ ఇప్పిస్తామంటూ వైరా నియోజకవర్గంలో కొన్నిచోట్ల రూ.లక్ష నుంచి రూ.4 లక్షల చొప్పున వసూలుచేశారు. అప్పట్లో ఓ ప్రజాప్రతినిధికి ఏకంగా రూ.కోటి వరకు ముట్టాయి. ఎన్నికల తర్వాత సర్కారు మారటంతో తామిచ్చిన డబ్బు తిరిగి చెల్లించాలంటూ ప్రజాప్రజానిధులు, నేతల వద్దకు బాధితులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఆందోళనలకు దిగుతున్నారు. ఠాణాల్లో ఫిర్యాదు చేస్తామనటంతో కొంతమంది దిగొచ్చి డబ్బు చెల్లించారు. ఇంకొందరికి చెక్కులు, మరికొందరికి ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు.

ఈటీవీ- ఖమ్మం: దళితుల అభ్యున్నతికి గత ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టింది. తొలి విడతలో లబ్ధిదారుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయమందించింది. రెండో దఫాలో లబ్ధి చేకూరుతుందని నమ్మి అప్పటి అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు భారీగా డబ్బు సమర్పించుకున్న వారికి ఇప్పుడు మనోవేదనే మిగులుతోంది. ‘దళితబంధు మాకొద్దు.. మాడబ్బు మాకివ్వండి’ మహాప్రభో అంటూ ప్రజాప్రతినిధులు, నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం గమనార్హం.

పట్టుబట్టి వసూళ్లు..

భారాస ప్రభుత్వం తొలిదఫాలో హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని దళితబంధు పథకం అమలుచేసింది. తదనంతరం నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాలకు వర్తింపజేసింది. ఆతర్వాత అన్ని నియోజకవర్గాలకు అందించాలనే లక్ష్యంతో 2023 మార్చిలో రెండో విడతకు శ్రీకారం చుట్టింది. ప్రతి నియోజకవర్గానికి 1,100 చొప్పున యూనిట్లు కేటాయించింది. ఎమ్మెల్యేలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు అప్పగించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు వసూళ్ల పర్వానికి తెరలేపారు. యూనిట్‌ దక్కాలంటే రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు ముట్టజెప్పాల్సిందేనంటూ పట్టుబట్టారు. కొన్నిచోట్ల దళితబంధు పథకాన్ని అంగడి సరకులా అమ్ముకున్నారు. కొంతమంది అర్హులు అప్పోసప్పో తెచ్చి డబ్బులు ముట్టచెప్పారు. ఉభయ జిల్లాల్లో  నాయకులు, ప్రజాప్రతినిధులు రూ.కోట్లు దండుకున్నారు.

బాధితుల ప్రదక్షిణలు

కుటుంబానికి రూ.10 లక్షల యూనిట్‌ దక్కితే తమ బతుకులు మారుతాయని, ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చన్న ఉద్దేశంతో కొంతమంది అర్హులు ముడుపులు చెల్లించారు. లబ్ధిదారుల జాబితా సిద్ధమవటంతో యూనిట్లు మంజూరవుతాయని సంబరపడ్డారు. ఈలోపు శాసనసభ ఎన్నికలు వచ్చాయి. పథకం అమలు ప్రక్రియ నిలిచిపోయింది. రూ.లక్షలకు లక్షలు ముట్టచెప్పిన తమ సంగతేంటని నేతల వద్దకు వెళ్తే.. మళ్లీ వచ్చేది భారాస ప్రభుత్వమేనని, కచ్చితంగా లబ్ధి చేకూరుతుందని నమ్మబలికారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి అధికారం చేపట్టడంతో బాధితుల్లో కలవరం మొదలైంది. సుమారు మూడు నెలలుగా తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వసూలు చేసిన సొమ్ములో కొంతమొత్తం తిరిగి చెల్లిస్తుండగా.. మరికొన్నిచోట్ల ప్రామిసరీ నోట్లు రాయించి వారిని పంపించేస్తున్నారు. ఇంకొందరు దళారులు రేపు, మాపు అంటూ తిప్పించుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని