logo

ఆ గంట.. సొత్తు భద్రమట!

రోడ్డు ప్రమాద క్షతగాత్రులను గంటలోపు ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు నిలిచే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతుంటారు.

Updated : 08 Apr 2024 08:59 IST

సైబర్‌ నేరాల్లో తక్షణ ఫిర్యాదుతోనే రికవరీ సాధ్యం

  • కొత్తగూడెంలోని న్యూ గొల్లగూడేనికి చెందిన యువతికి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు.. ఆమె తండ్రి ఉద్యోగ విరమణ సెటిల్‌మెంట్‌కు సంబంధించిన డబ్బులు జమ చేస్తామని నమ్మబలికారు. వారు పంపిన లింక్‌ ఓపెన్‌ చేయగానే ఖాతాలోంచి రూ.9 వేలు డ్రా చేసినట్లు మెసేజ్‌ వచ్చింది. కంగుతున్న బాధితురాలు నిమిషాల వ్యవధిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు సైబర్‌ క్రైం విభాగం సాయంతో ఖాతాలోంచి నగదు విత్‌డ్రా కాకుండా స్తంభింపజేశారు.
  • బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన  ఓ గృహిణి ఆన్‌లైన్‌ ప్రకటనను నమ్మి పార్ట్‌ టైం ఉద్యోగం కోసం ఆరు దఫాలుగా రూ.1.83 లక్షలు చెల్లించింది.  ఆ తర్వాత మోస పోయానని గ్రహించింది. ఫిర్యాదు ఆలస్యం కావడంతో.. సొమ్ము రికవరీ జాప్యమవుతుందని సైబర్‌ క్రైం పోలీసు చెబుతున్నారు.

కొత్తగూడెం నేరవిభాగం, ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే

రోడ్డు ప్రమాద క్షతగాత్రులను గంటలోపు ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు నిలిచే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతుంటారు. దీన్నే ‘గోల్డెన్‌ అవర్‌’గా పేర్కొంటున్నాం. నేడు రోడ్డు ప్రమాదాలకు మించిన సంఖ్యలో నమోదవుతున్నవే సైబర్‌ నేరాలు. వీటిల్లో ఆర్థికపరమైన కేసులే ఎక్కువ. ఈ నేరాల్లో బాధితులు పోగొట్టుకున్న నగదును తిరిగి దక్కించుకునేందుకు కూడా ‘గోల్డెన్‌ అవర్‌’ కీలకమని రాష్ట్రపోలీసు శాఖకు చెందిన సైబర్‌ నిపుణులు ఇటీవల అవగాహన కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నిత్యం ఎవరో ఒకరు సైబర్‌ నేరాల వలలో చిక్కుకుంటున్నారు. వారంతా ఆలస్యంగా ఫిర్యాదు చేస్తున్నారు. 

నేరం జరిగిందని గ్రహించిన వెంటనే బాధితులు ‘1930’ నంబరుకు ఫోన్‌చేయాలి. లేదా ఎన్‌సీఆర్‌పీ(నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌)లో ఫిర్యాదు నమోదు చేయాలి. అదీ.. గంట వ్యవధిలో అయితే ఫలితం ఉంటుంది. బాధితుల ఖాతాలోంచి నగదు నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా స్తంభింపజేయడం (హోల్డ్‌) సత్వర ఫిర్యాదుతోనే సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఉభయ జిల్లాల్లోని అన్ని స్టేషన్ల పరిధిలో ‘సైబర్‌ వారియర్స్‌’ అందుబాటులోకి వచ్చారు. ఫిర్యాదు, కేసు అనుశీలనలో వారు సహాయపడతారు. ఖమ్మం కమిషనరేట్‌ పరిధిలో గత మూణ్నెల్లలో వందలాది మంది సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కారు. రూ.లక్షల్లో సొమ్ము పోగొట్టుకున్నారు. వీరిలో చాలామంది గంటలోపు ఫిర్యాదు చేయలేకపోయారు. ‘బాధితులు మోసం జరిగిన గంటలోగా ఆశ్రయిస్తే రికవరీకి 90-100 శాతం అవకాశం ఉంటుంది. ఆరు గంటల వరకైతే 60%, ఆ తర్వాత కేవలం 20 శాతం వరకే రికవరీ అవకాశాలుంటాయి’ అని కొత్తగూడెం సైబర్‌ క్రైం సీఐ జితేందర్‌ వెల్లడించారు.

దేన్నీ నమ్మొద్దు.. వేటికీ స్పందించొద్దు..

లోన్లు, తాత్కాలిక ఉద్యోగాల పేరుతో యువతకు ఎర వేస్తున్నారు. ప్రకటనలు చూస్తే చాలు, డబ్బులిస్తామని ముగ్గులోకి దింపుతున్నారు. పెట్టుబడి పెడితే రెట్టింపు నగదు ఇస్తామని దోచేస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, యాప్‌ల ఇన్‌స్టాల్‌కు వ్యక్తిగత, బ్యాంకుల సమాచారం ఇవ్వొద్దు. నకిలీ ‘మ్యాట్రిమోనీ సైట్ల’ వ్యామోహంలో చిక్కుకుంటే ఆర్థికంగా చితికినట్లే. లాటరీ గెలిచారని, ముందు కొంత డబ్బు పంపాలని గాలం వేస్తుంటారు. అలాంటి కాల్స్‌, మెసేజ్‌లను నమ్మొద్దు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ నిండా ముంచేస్తాయి. నోయువర్‌ కస్టమర్‌ (ఈ-కేవైసీ) అంటూ వచ్చే ఫోన్‌కాల్స్‌కు స్పందించొద్దు. అనుమానాస్పద లింక్‌లు ఓపెన్‌ చేసినా..  క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసినా ఖాతాల్లోంచి నగదు మాయమవుతుంది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు.

‘సైబర్‌ నేరాల కట్టడికి పోలీసు శాఖ ప్రత్యేకం యంత్రాంగం పటిష్ఠంగా పనిచేస్తోంది. ప్రజలు అవగాహనతో నేరాల తీరును గమనించాలి. స్మార్ట్‌ఫోన్లు ఉన్న యువత, చదువుకున్న వారే బాధితులుగా నమోదవుతున్నారు. వీరిలో మార్పు రావాలి’

బి.రోహిత్‌రాజు, ఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని