logo

ఇటు చల్లని సీతమ్మ.. అటు చక్కని రామయ్య

రామారాధన ఆనందకరమని దేవనాథరామానుజ జీయర్‌ స్వామి ప్రవచించారు. లోకమంతా పూజించే దైవం సీతారాముడు అని సుభాషించారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఉత్తర ద్వారం వద్ద మంగళవారం రాత్రి నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం సంతోషాలను పంచింది.

Updated : 17 Apr 2024 06:07 IST

రససాగరంలో ఓలలాడించిన ఎదుర్కోలు ఉత్సవం

ఎదుర్కోలు ఉత్సవంలో వేదపండితుల నృత్యం

భద్రాచలం, భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: రామారాధన ఆనందకరమని దేవనాథరామానుజ జీయర్‌ స్వామి ప్రవచించారు. లోకమంతా పూజించే దైవం సీతారాముడు అని సుభాషించారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఉత్తర ద్వారం వద్ద మంగళవారం రాత్రి నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం సంతోషాలను పంచింది. ఈ క్రతువు సందర్భంగా దేవనాథరామానుజ జీయర్‌ స్వామి చేసిన ప్రవచనం రససాగరంలో ఓలలాడించింది. జగత్తును రక్షించే సీతారాముడికి నిర్వహించే కల్యాణం లోక కల్యాణమని అభివర్ణించారు. వధూవరూల వంశాల విశిష్టతను వివరిస్తూ సీతారాముల ఔనత్యాన్ని చాటిచెప్పారు. చల్లని సీతమ్మ, చక్కని రామయ్య జంట కన్నులకు పంట అని కొనియాడారు. ఎదుర్కోలును పురస్కరించుకొని స్థానాచార్యుడు స్థలసాయి, ఉప  ప్రధానార్చకుడు శ్రీమన్నారాయణాచార్యులు సీతారాములవారి పక్షాన ఉండి చేసిన సంవాదం  భక్తులను ఆకట్టుకుంది.

ఎదుర్కోలు కార్యక్రమానికి హాజరైన భక్త జనం

వెల్లువలా వస్తున్న భక్తులు

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన రాములవారికి సకల సుగుణాల రాశి సీతమ్మకు బుధవారం జరిగే కల్యాణానికి ఒకరోజు ముందు ఎదుర్కోలు ఉత్సవాన్ని కనులపండువగా కొనసాగించారు. ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది తరలిరావటంతో భద్రాచలం రామమయమైంది. ఉదయం నుంచి ప్రసాదాల కౌంటర్ల వద్ద సందడి నెలకొంది. క్యూలైన్లు కిటకిటలాడాయి. ఉచిత దర్శనాల వద్ద భక్తులు   చాలాసేపు వేచిచూడాల్సి వచ్చింది. ఉత్సవ వైభవాన్ని వేద మంత్రోచ్చారణ మరింత పెంచింది. భక్తులు ఆలపించిన కీర్తనలు మంత్రముగ్ధులను చేశాయి. సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చినవారు స్వామిని దర్శించి పులకించిపోయారు. భక్తులకు ఉచితంగా సేవలందించేందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉడతా భక్తి చాటారు. ఎటుచూసినా సీతారాముల పెళ్లిముచ్చట్లే. జగత్‌కల్యాణానికి సంబంధించిన ఊసులే వినిపించాయి. రామయ్య తండ్రి తిరువీధికి వెళ్లే రాజవీధిలో కట్టిన మామిడాకుల తోరణాలు పెళ్లికళను రెట్టింపు చేశాయి. ఆహా ఏమీ మాభాగ్యం అంటూ బ్రహ్మోత్సవాలను వీక్షించిన భక్తజనం సాష్టాంగపడింది.

సీఎం రేవంత్‌రెడ్డి రానట్లే

తానీషా కాలం నుంచి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను తీసుకొచ్చే ఆనవాయితీ కొనసాగుతుండగా   కొన్నేళ్లుగా వేర్వేరు కారణాలతో ఇది అమలుకావటం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015, 2016లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టువస్త్రాలను తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన భద్రాచలం రామాలయానికి రాలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈసారి తలంబ్రాలు తీసుకొస్తారని భావించినప్పటికీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయినట్లు సమాచారం. శ్రీరామనవమి ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • భద్రాద్రి రామయ్యను ఐజీ రంగనాథ్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎదుర్కోలు ఉత్సవంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు.. స్వామివారికి  వస్త్రాలను  సమర్పించారు. ప్రముఖుల రాకతో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.

అప్పుడు రేడియో.. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు

సీతారాముల కల్యాణం చూతము రారండి అంటూ ఆనాడు వ్యాఖ్యాతలు రేడియోలో చెప్పే విషయాలతో భక్తులు పరమానందం పొందేవారు. భద్రాద్రిలో రామయ్యకు తలంబ్రాలు పోశారన్న మాటలు వినగానే ఆసమయాన్ని ప్రామాణికంగా తీసుకుని తమ గ్రామాల్లో సీతారాములవారి కల్యాణ  మహోత్సవాలు నిర్వహించేవారు. నాటి రేడియో వ్యాఖ్యాతలు కల్యాణ విశేషాలను కళ్లకు కట్టినట్లు చెప్పేవారని పాతతరంవారు ఇప్పటికీ చెబుతుంటారు. రవాణా సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో ఆలిండియా రేడియో ఉడతా భక్తిని చాటింది. అసలే నీలమేఘశ్యాముడు, ఆపై బుగ్గన చుక్క.. నుదుట బాసికం, పట్టు పీతాంబరాలు ధరించి మరింత శోభాయమానంగా దర్శనమివ్వగా... జగన్మాత సీతమ్మ తల్లి తన చల్లని చూపులతో స్వామిని తిలకించటంతో ముల్లోకాలు మురిసిపోతున్నాయంటూ వ్యాఖ్యానాలు చేస్తుండటంతో భక్తులు ప్రణమిల్లేవారని పాత మధురాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆస్థానాన్ని శాటిలైట్‌ విప్లవం ఆక్రమించింది. కల్యాణం జరుగుతున్న తీరును కోట్లాదిమంది తమ ఇళ్ల నుంచి ప్రత్యక్షంగా టీవీల్లో వీక్షిస్తున్నారు. ఎన్ని ఛానళ్లు లైవ్‌ ప్రసారాలు చేసి కళ్ల ముందు కల్యాణాన్ని ఉంచినా ఆ రోజులు వేరులే అంటున్నారు భక్తులు.

రామయ్యను దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి

భద్రాచలం: శ్రీసీతారామచంద్రస్వామివారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నర్సింహ కుటుంబసమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు రామాయణ పారాయణదారు కృష్ణమాచార్యులు సాదర స్వాగతం పలికారు. వైదిక పెద్దలు తీర్థప్రసాదాలను ఇచ్చి ఆశీర్వచనం పలికారు. ప్రధాన కోవెలలోని మూలవిరాట్‌, అనుబంధంగా ఉన్న ఆంజనేయుణ్ని, లక్ష్మీతాయారు అమ్మవారిని న్యాయమూర్తి దర్శించుకున్నారు.

  • హైకోర్టు అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.

వన రాముడే.. మన రాముడు

పంచారామ క్షేత్రాలు ఎలా ప్రసిద్ధి గాంచాయో అదే తరహాలో భద్రాచలం పరిసరాల్లోని పంచ రామ క్షేత్రాలు ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతున్నాయి. రామాయణ కాలంలో రాముడు వనవాసంలో ఎక్కువ కాలం ఈప్రాంతంలోని గోదావరి తీరంలో గడపటంతో వనరాముడు మన రాముడయ్యాడు. త్రేతాయుగం నాటి గుర్తులు ఇప్పటికీ దర్శనీయంగా వెలుగొందుతున్నాయి. భద్రాచలం, దుమ్ముగూడెంలోని ఆత్మారామ క్షేత్రం, పర్ణశాల, అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురం మండలం శ్రీరామగిరి రామాలయాల్లో ఆయా రూపాల్లో రాముడు దర్శనమిస్తాడు. ఈనాలుగు క్షేత్రాలతో పాటు వన రూపంలో రాముడు ఉంటాడని భక్తుల విశ్వాసం. ఈ ఐదు ప్రాంతాలను దర్శిస్తే సకల అభీష్టాలు నెరవేరుతాయని నమ్మిక.

త్రేతాయుగం నాటి ఊరే ఉష్ణగుండాల

భద్రాచలం పుణ్యక్షేత్రానికి ఐదు కి.మీ. దూరంలో ఉన్న గుండాల గ్రామం రామాయణ కాలం నాటిదని భక్తుల విశ్వాసం. ఇప్పుడున్న ఇళ్లు ఈతరానికి చెందినవే అయినప్పటికీ నాటి గుర్తులు ఇప్పటికీ గ్రామంలో కనిపిస్తున్నాయి. వనవాసం సమయంలో ఒకరోజు సీతాదేవి పవిత్ర గోదావరి తీరంలో విహరించగా కొద్దిసేపటి తర్వాత ప్రయాణ బడలికతో స్నానం చేయాలని అనుకుంటుంది. ఆమె కోరిక ప్రకారం రాముడు బాణం సంధించగా.. అది రెండుగా చీలిపోయి ఇసుకలో రెండు చోట్ల పడుతుంది. మొదటి బాణం పడిన దగ్గర చన్నీళ్ల జలధార వచ్చిందని నమ్ముతుంటారు. దీనికి కొద్దిదూరంలో మరో బాణం పడటంతో అక్కడ పొగలు చిమ్ముతూ ఉష్ణోదకం బయటకు వచ్చింది. ఈ వేడి నీటితో సీతాదేవి గుండాల వద్ద స్నానం చేయటంతో దీనికి ఉష్ణ గుండాల అనే పేరు స్థిరపడింది. ఇసుకలో ఆరడుగుల బావి తవ్వి నీటిని బయటకు తీస్తుంటారు. వరదల కాలంలో ఇది మునుగుతుంది. శ్రీరామనవమికి గుండాలలోని వేడి నీటిని శిరస్సుపై చల్లుకుంటే కష్టాలు తొలగి శుభాలు సిద్ధిస్తాయన్న నమ్మకంతో విశేషంగా దర్శించుకుంటున్నారు. రామాయణ కాలంలో ఏర్పడిన చన్నీటి ధార కాలక్రమేణా గోదావరిలో కలిసిందని చెబుతుంటారు.

భద్రాచలం, న్యూస్‌టుడేఇసుకలో వేడి నీరు వచ్చే బావి

నేడు కల్యాణోత్సవం

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏడాదికి ఒకసారి నిర్వహించే వార్షిక కల్యాణోత్సవం ఎంతో విశిష్టమైంది. ఇది బుధవారం జరగనుంది. ప్రపంచంలోని రామభక్తులు వీక్షించే అతిపెద్ద దైవకార్యం. ఈ జగత్‌ కల్యాణంలోని ప్రతి ఘట్టమూ మధురమే. కల్యాణానికి పరమార్థమై దాంపత్యానికి దివ్యత్వాన్ని ఆపాదించింది సీతారాములవారే. కల్యాణానికి సంబంధించిన పూజలు మిథిలా మండపంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు అభిజిత్‌ లగ్నంలో నిర్వహిస్తారు. తిరు కల్యాణానికి సంకల్పం పలికి.. సర్వ విజ్ఞాన శాంతికి విష్వక్సేనుల వారిని ఆరాధిస్తారు. పుణ్యాహ వాచనం ఉంటుంది. క్రతువుకు ఉపయోగించే సామగ్రిని సంప్రోక్షణ చేస్తారు. రక్షాబంధనం నిర్వహిస్తారు. దర్బలతో ప్రత్యేకంగా అల్లిన తాడుని సీతమ్మవారి నడుముకి బిగిస్తారు. దీన్ని యోక్త్రధారణగా పండితులు చెబుతుంటారు. యోక్త్రధారణ వల్ల ఉదర సంబంధ సమస్యలు రావు. ఆరోగ్యంగా ఉండి సంతానవతులవుతారని ప్రతీతి. సీతారాముల వారికి రక్షాసూత్రాలు కడతారు. స్వామి గృహస్థాశ్రమసిద్ధి కోసం రామయ్యకు యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. తాంబూలాది సత్కారాలు చేసి కన్యావరణం నిర్వహిస్తారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువు అని పెద్దలు నిర్ణయిస్తారు. రెండు వంశాల గోత్రాలు పఠిస్తారు. స్వామివారి పాద ప్రక్షాళన ఉంటుంది. మహాదానాలు సమర్పిస్తారు. వధూవరులకు మంగళం చేకూర్చాలనే భావంతో అందించే ఈ ఆశీస్సులు కల్యాణం వీక్షించే భక్తులందరికీ వర్తించేలా ఉంటాయి. కల్యాణ వైభవాన్ని చాటిచెప్పేలా చూర్ణికను పఠిస్తారు. వేద మంత్రోచ్చారణ మార్మోగుతుండగా అభిజిత్‌ లగ్నం సమీపించగానే  జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాములవారి శిరస్సుపై ఉంచుతారు. ఇది శుభ ముహూర్తం. జగత్‌ కల్యాణ శుభ సన్నివేశం.

బ్రహ్మాండమైన వేడుక

ఇదేమైనా ‘బ్రహ్మ విద్యా’ అనేమాట వాడుతున్నారంటే బ్రహ్మకు ఉన్న ప్రత్యేకత తెలుస్తుంది. బ్రహ్మ అంటే గొప్పది అనే అర్థం ఉంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన దేవదేవుడికి జరిగే వేడుక గొప్పగా ఉండాలనే భావనతో బ్రహ్మోత్సవం చేస్తారని భద్రాచలం ఆలయ స్థానాచార్యుడు స్థలసాయి, ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్‌, ఉప ప్రధానార్చకుడు రామస్వరూప్‌ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీరామనవమి అంటే భక్తులకు ఆనందకరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని