logo

రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి

రైతుల ఆదాయం రెట్టింపయినప్పుడే వారి శ్రమకు ప్రతిఫలం దక్కినట్లని తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ ఎండీ కె.అశోక్‌రెడ్డి అన్నారు.

Published : 20 Apr 2024 02:12 IST

టీజీ ఆయిల్‌ఫెడ్‌ ఎండీతో

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: రైతుల ఆదాయం రెట్టింపయినప్పుడే వారి శ్రమకు ప్రతిఫలం దక్కినట్లని తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ ఎండీ కె.అశోక్‌రెడ్డి అన్నారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని పామాయిల్‌ పరిశ్రమలు, నర్సరీ, తోటలను అధికారులతో కలిసి ఆయన ఇటీవల పరిశీలించారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌టుడే’తో ముచ్చటించారు. ఆ వివరాలు మీ కోసం..

న్యూస్‌టుడే: ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఎలా పూర్తి చేయనున్నారు?

ఎండీ: గత ఏడాది 40వేల ఎకరాల్లో కొత్తగా తోటలు పెంపకం చేపట్టగా.. ఈ ఏడాది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20వేల ఎకరాల్లో ఆయిల్‌పాం తోటల పెంపకానికి చర్యలు చేపట్టాం. క్షేత్రస్థాయిలో ఇబ్బందులుంటే గుర్తించి తగు చర్యలు చేపడుతున్నాం.


న్యూ: కేంద్రం తెచ్చిన ఆయిల్‌పాం వయబులిటీ ప్రైస్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు?
ఎండీ: ఉద్యాన మిషన్‌ ద్వారా తెచ్చిన వయబులిటీప్రైస్‌తో  రైతులకు ఎంతమేర లబ్ధి చేకూరుతుందన్నదీ అధ్యయనం చేస్తున్నాం. రైతులకు ఇబ్బంది లేని విధంగా త్వరలోనే సానుకూల నిర్ణయం జరుగుతుంది. ఇది ఎన్నికల తదనంతరం ఉండనుంది.


న్యూ: సిబ్బంది లేమితో క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలపై స్పందించలేకపోతున్నారనే విమర్శలపై ఏమంటారు?
ఎండీ: సిబ్బంది కొరత వాస్తవమే. ఎన్నికల షెడ్యూలుకు ముందే ఎంపిక జరిగింది. 19మంది ఉద్యాన అధికారులకు నియామక పత్రాలు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంపై ఈసీని కలిసి నియామకాలపై చర్చించనున్నాం. లేదా ఎన్నికల తరువాత నియమించే వీలుంది. ముందు ఎక్కడ అవసరం ఉందో అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయనున్నాం.


న్యూ: మన్యం ప్రాంతంలో పోడు పట్టాలు ఇటీవల ఇచ్చారు. ఆ రైతులకు మొక్కలు కావాలంటే సాంకేతిక ఇబ్బంది, బోర్లు కొరత వేధిస్తుంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు.
ఎండీ: ఏజెన్సీలో పోడు పట్టాలు ఉన్న రైతులకు ఇప్పటికే నీటి సౌకర్యం ఉంటే వెంటనే మొక్కలు ఇచ్చేందుకు అభ్యంతరం లేదు. నీటివసతి లేని రైతులు బోర్లు వేసుకునేందుకు వీలుగా సంబంధిత ప్రభుత్వ కార్యదర్శితో మాట్లాడి అందుకనుగుణంగా ఏర్పాటు చేయనున్నాం.


న్యూ: పామాయిల్‌ పరిశ్రమల సామర్థ్యం పెంపు, నూతన పరిశ్రమల నిర్మాణం ఎప్పుడు చేయనున్నారు?
ఎండీ: ప్రస్తుతం ఉన్న తోటలు, రాబోవు మూడేళ్ల కాలంలో వచ్చే దిగుబడి అంచనాను దృష్టిలో ఉంచుకొని నూతన పరిశ్రమల ఏర్పాటు, సామర్థ్యం విస్తరణ ఉంటుంది. దీనిపై లోతుగా అధ్యయనం చేయాలి.


న్యూ: రైతుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు?
ఎండీ: ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు చైతన్యవంతులు. వీరి స్ఫూర్తి రాష్ట్రానికే ఆదర్శం. కార్పొరేట్‌ ఉద్యోగాలు వదిలి మరీ వ్యవసాయంపై దృష్టి పెడుతున్న రైతులు ఈ ప్రాంతంలోనే కనిపిస్తారు. మూస పద్ధతులకు స్వస్తిచెప్పి ఆధునిక సేద్య విధానాలతో రాణిస్తున్నారు. చిన్నచిన్న సమస్యలు రైతులే పరిష్కరించుకుంటారు. వారి వల్ల సాధ్యం కాని పక్షంలో అధికార యంత్రాంగం ద్వారా పరిష్కరిస్తాం.


న్యూ: క్షేత్రస్థాయి సమస్యలను ఎలా అధిగమించనున్నారు?
ఎండీ: నేను ఎండీగా బాధ్యతలు చేపట్టి కొద్ది రోజులే అవుతోంది. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలున్నాయో అధ్యయనం చేస్తున్నాను. త్వరలో ఉద్యాన, ఆయిల్‌ఫెడ్‌ క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశం నిర్వహించి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషిచేస్తాను. ఆ తరువాత లక్ష్యాల సాధనపై దృష్టిపెడతాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని