logo

వివిధ అనుమతులకు సువిధ

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనేక యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Published : 20 Apr 2024 02:24 IST

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం:సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనేక యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు.. సభలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందస్తుగా ఈసీ అనుమతి తప్పనిసరి. ఇందుకు గతంలో సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి అనుమతులు పొందాల్సి వచ్చేది. కార్యాలయాల చుట్టూ అభ్యర్థులు తిరిగేవారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు సువిధ యాప్‌ను ఈసీ ప్రవేశపెట్టింది.

అన్ని వివరాలు సమర్పించాల్సిందే..

ప్రచార అనుమతులు పొందాలనుకునే అభ్యర్థులు ఎన్నికల సంఘం కోరిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రచారానికి ఉపయోగించే వాహనాలకు సంబంధించి దరఖాస్తుతో పాటు వాహన రిజిస్ట్రేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, యజమాని, డ్రైవర్‌ పేర్లు, చిరునామా, ఫోన్‌ నంబరు తదితర వివరాలు జతపరచాలి. వాహనం సంచరించే ప్రదేశాల వివరాలు తెలియజేయాలి. వాహన తనిఖీ అధికారి నుంచి ధ్రువపత్రం తీసుకోవాలి. తాత్కాలిక ఎన్నికల కార్యాలయం ఏర్పాటుకు భవన యజమాని అనుమతి, లేదా అద్దె తదితర వివరాలతో దరఖాస్తు సమర్పించాలి. ర్యాలీలు, రోడ్డుషోలు, ఇతర కార్యాక్రమాల అనుమతికి ప్రదేశం, రూట్‌మ్యాప్‌, ర్యాలీలో పాల్గొనే వారి సంఖ్య, తేదీ, సమయం, ఇతర వివరాలను రిటర్నింగ్‌ అధికారికి తెలియజేసి అనుమతి పొందాలి. బహిరంగ సభల నిర్వహణ సమయంలో హెలిప్యాడ్‌ అనుమతికి జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్‌) అనుమతి కోసం 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలి.

48 గంటల్లోనే..

పోలింగ్‌ సమీపిస్తుండటంతో అభ్యర్థులు తమ ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందుకు సంబంధించిన అనుమతుల కోసం ‘సువిధ’ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వెబ్‌సైట్‌ suvidha.eci.gov.in లో ఫోన్‌ నంబరు ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలి. అభ్యర్థులకు కావాల్సిన అనుమతుల కోసం పోర్టల్‌లో దరఖాస్తు సమర్పించాలి. సంబంధిత అధికారులు 48 గంటల్లో అనుమతులిస్తారు లేదా తిరస్కరిస్తారు. అనుమతించిన వాటికి రాతపూర్వకంగా ధ్రువపత్రం అందిస్తారు. ఇలా కాకుండా నేరుగా ఆర్‌ఓ కార్యాలయానికి వెళ్లి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


పారదర్శక ఎన్నికలకు తోడ్పాటు

ఎన్నికల ప్రక్రియలో జవాబుదారితనం పెంచటమే కాకుండా ఈసీ నిబద్ధతను చాటడానికి సువిధ యాప్‌ ఉపయోగపడుతుంది. ఎన్నికల వాతావరణాన్ని సులభతరం చేయటంతో పాటు రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు అవసరమైన అనుమతుల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు తోడ్పడుతుంది. అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని అంచనా వేసేందుకు దోహదపడుతుంది. అనుమతులు లేకుండా ప్రచారం చేసే వారిని గుర్తించటం తేలికవుతుంది. తద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవటం సులభతరం అవుతుంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు