logo

నేరగాళ్లపై నిఘా కరవు

కర్నూలులో వడ్డె రంగమురళిపై 2013 అక్టోబరు 10న హత్య కేసు నమోదైంది. పోలీసులు అతనిపై మీద రౌడీషీట్‌ తెరవలేదు. పోలీసుల నిఘా లేకపోవటంతో ఇటీవల ఓర్వకల్లు మండలంలో వడ్డె రంగమురళి మరో హత్యకు పాల్పడ్డాడు. కర్నూలులోని ఎస్‌.నాగప్పవీధికి చెందిన ఓ పాతనేరస్థులపై

Updated : 10 Aug 2022 06:23 IST

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్నూలులో వడ్డె రంగమురళిపై 2013 అక్టోబరు 10న హత్య కేసు నమోదైంది. పోలీసులు అతనిపై మీద రౌడీషీట్‌ తెరవలేదు. పోలీసుల నిఘా లేకపోవటంతో ఇటీవల ఓర్వకల్లు మండలంలో వడ్డె రంగమురళి మరో హత్యకు పాల్పడ్డాడు. కర్నూలులోని ఎస్‌.నాగప్పవీధికి చెందిన ఓ పాతనేరస్థులపై గొడవలు, దౌర్జన్యాలు, స్థల ఆక్రమణలు, మట్కా కార్యకలాపాలు వంటి ఆరోపణలున్నాయి. పలు పోలీసుస్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. అయినా పోలీసులు అతనిపై రౌడీషీటు తెరవలేదు. గతేడాది మేలో ఓ బ్యాంకు అధికారిని హత్య చేశాడు.

నేరగాళ్లపై రౌడీషీటు తెరిచే విషయంలో పలువురు పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.  నిఘా తగ్గడంతో తరుచూ నేరాలకు పాల్పడుతున్నారు. వీరితో శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు నెలకొన్నాయి.

నంద్యాలలో ఏం జరిగింది

కానిస్టేబుల్‌ సురేంద్రకుమార్‌(35) ఆదివారం రాత్రి హత్యకు గురయ్యారు.  పలు హత్య కేసుల్లో నిందితులు.. రౌడీ షీటర్లు పట్టణంలో తిరుగుతూ దందాలు చేస్తున్న వారే హత్య కేసులో నిందితులుగా ఉన్నట్లు తెలుస్తోంది.


రౌడీషీటు తెరవడంతో తాత్సారం

రెండు కంటే ఎక్కువ కేసులు నమోదై ఉండి, నేర ప్రవృత్తిని కొనసాగించే వారిపైన రౌడీషీటు తెరవాల్సి ఉంది. దౌర్జన్యం, భూకబ్జాలు, దాడులు, హత్య, హత్యాయత్నం, పోక్సో వంటి తీవ్రమైన నేరాల్లో నిందితులలోపాటు ఫ్యాక్షనిస్టులపై రౌడీషీటు తెరవొచ్చు. జిల్లాలో చాలామంది నేరగాళ్లపై రౌడీషీటు లేదు. అధిక కేసులు నమోదైనా, హత్య కేసుల్లో నిందితులైనప్పటికీ తెరవలేదు. దీంతో నేరగాళ్లు యథేచ్ఛగా తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు నేరస్తులు రాజకీయ నాయకుల చేత సిఫార్సు చేయించుకుని షీట్లలో ఎక్కకుండా తప్పించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కొందరు పోలీసులు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.

మంత్రణం మరిచారు

జిల్లా వ్యాప్తంగా దాదాపు 1300 మంది రౌడీషీటర్లు ఉన్నారు. అయితే వారిపై నిఘా ఉండటం లేదు. గస్తీ పోలీసులు వీరి ప్రవర్తనపై ఆరా తీయటం లేదు. ప్రతి ఆదివారం అన్ని పోలీసుస్టేషన్‌లలో నిర్వహించే రౌడీషీటర్ల మంత్రణానికి చాలామంది డుమ్మా కొడుతున్నారు. రౌడీషీటర్లు అధికారంలో ఉండే పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పోలీసు చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. పలువురు పోలీసు అధికారులూ అధికారపార్టీకి అనుకూలంగా ఉండే రౌడీషీటర్లకు మినహాయింపు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

గాడి తప్పిన గస్తీ

రౌడీషీట్లరపై గస్తీ పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలి. వారి ప్రవర్తన తీరుపై తెలుసుకోవాలి. నేరాలకు పాల్పడకుండా తరచూ మంత్రణం చేయాలి. ఇవేవీ సక్రమంగా చేపట్టడం లేదు. పోలీసు ఔట్‌పోస్టు తొలగించటంతో జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని