logo

పోషకాహార లోపాలు

 అంగన్‌వాడీ కేంద్రాల్లో పాలు అందించడంలోని లోపాలు పోషకాహారానికి శాపంగా మారాయి. పాల సరఫరాలో సరైన విధానం లేకపోవడంతో నెలలో ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి.

Published : 10 Aug 2022 01:49 IST

అంగన్‌వాడీకి సక్రమంగా అందని వైనం

పలుచోట్ల చెడిపోయిన ప్యాకెట్లు

పాడైపోయిన పాల ప్యాకెట్లు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే:  అంగన్‌వాడీ కేంద్రాల్లో పాలు అందించడంలోని లోపాలు పోషకాహారానికి శాపంగా మారాయి. పాల సరఫరాలో సరైన విధానం లేకపోవడంతో నెలలో ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆళ్లగడ్డ ఐసీడీఎస్‌ పరిధిలో పలు కేంద్రాల్లో గత నెలలో పాలు చెడిపోయాయి. పలువురు నేరుగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. చెడిపోయిన పాలను పారబోయక తప్పలేదు. తరచూ ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నా నాణ్యమైనవి సరఫరా అయ్యేలా అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం. అంగన్‌వాడీ సిబ్బంది సైతం పాలు చెడిపోయాయని ఫిర్యాదు చేయలేకపోతున్నారు. చెడిపోయాయంటే అందుకు సంబంధించిన తీర్మానం, తల్లులు, గ్రామ పెద్దల సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ తతంగం చేసే కంటే తల్లులకే ఏదో ఒకలా సర్ది చెప్పి పంపించడమే తేలికని కార్యకర్తలు భావిస్తున్నారు. అటు అధికారులు, ఇటు అంగన్‌వాడీ కార్యకర్తల చర్యల వల్ల తల్లులకు, పిల్లలకు, గర్భిణులకు పోషకాహారం దూరమవుతోంది.

కొన్ని సంఘటనల ఇలా..

* ఆళ్లగడ్డ పట్టణ పరిధిలో మల్లిక అనే గర్భిణి ఈ నెల 2న పాల కోస రాగా నిల్వ లేవని వెనక్కి పంపించారు. తర్వాతి మూడు రోజులు ఇలానే వెనక్కి పంపించారు. పాల నిల్వలు ఖాళీ అయి 8 రోజులవుతున్నా ఎవరూ స్పందించకపోవడం గమనార్హం.  

* ఆళ్లగడ్డ మండలం పరిధిలో ఓ సెక్టార్‌లో పంపిణీ చేసిన ఐదు రోజుల్లోనే పాలు చెడిపోవడం దారుణం. అయినా పాలు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో చూపించడం గమనార్హం.  

* పట్టణంలోని గాయత్రీ ఆలయం పరిధిలో ఓ అంగన్‌వాడీ కేంద్రంలో గత నెలలో పాలు చెడిపోయాయి. ఈ విషయంపై ఐసీడీఎస్‌ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు.

* పట్టణంలోని బొరుగులబట్టి, గంగమ్మ ఆలయం పరిధిలోని తల్లులు, బాలింతలు గత నెలలో నాణ్యత లేకపోవడంతో వినియోగించుకోలేకపోయారు.

* మండలంలోని ఆర్‌.కృష్ణాపురం, బాచేపల్లె, అహోబిలం పరిధిలో పలు కేంద్రాల్లో గత నెల 15 వరకు పాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఓపెనింగ్‌ బ్యాలెన్స్‌లోని పాలనే లబ్ధిదారులకు సర్ది పంపిణీ చేశారు.

* ఒకవేళ చెడిపోతే దానికి సంబంధించి యాప్‌లో వివరాలు నమోదు చేయాలని అధికారులు అంటున్నారు. అయితే యాప్‌లో ఎలా నమోదు చేయాలో శిక్షణ ఇవ్వడం లేదని అంగన్‌వాడీ కార్యకర్తలు అంటున్నారు.


జిల్లాలో పాల కొరత లేదు

- కుమారి, పీడీ, ఐసీడీఎస్‌, కర్నూలు

రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పాల కొరత ఉన్నా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో లేదు. పాల నాణ్యతపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. లోపాలు లేకుండా సరఫరా చేయాలని గుత్తేదారునికి సూచించాం. పాలు నిల్వ చేయడంలో జాగ్రత్తలు పాటిస్తే అవి చెడిపోవు. నాణ్యతపై లోపాలు ఉంటే వెంటనే యాప్‌లోని ఓబీ (ఓపెనింగ్‌ బ్యాలెన్స్‌)లో వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని