logo

ముప్పు తిప్పలు పెట్టిన ముఖ హాజరు

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పాఠాలు చెప్పే సమయం కంటే యాప్‌లతో పడే యాతనే ఎక్కువైంది. విద్యాశాఖ తాజాగా ముఖ ఆధారిత హాజరుకు శ్రీకారం చుట్టడంతో మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం పాఠశాలలకు

Published : 17 Aug 2022 02:59 IST

- ఉపాధ్యాయులను సతాయించిన యాప్‌

ఆదోని నెహ్రూ మెమోరియల్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో యాప్‌ పని చేయకపోవడంతో చరవాణిలతో కుస్తీ పడుతున్న ఉపాధ్యాయులు

ఈనాడు - కర్నూలు : ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పాఠాలు చెప్పే సమయం కంటే యాప్‌లతో పడే యాతనే ఎక్కువైంది. విద్యాశాఖ తాజాగా ముఖ ఆధారిత హాజరుకు శ్రీకారం చుట్టడంతో మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం పాఠశాలలకు చేరుకున్న ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ హాజరుకు కుస్తీలు పట్టాల్సి వచ్చింది. సర్వర్‌ నెమ్మదిగా ఉండటం.. నెట్‌వర్క్‌ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫలితంగా బోధనా కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. యాప్‌ హాజరుపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

తొలిరోజు అవస్థలు

ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల కోసం విద్యాశాఖ ముఖ ఆధారిత హాజరు నమోదుకు ప్రత్యేక యాప్‌ తీసుకొచ్చింది. ‘‘ ఉపాధ్యాయులు యాప్‌ను తప్పని సరిగా చరవాణిలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి... దానిని నిత్యం ఓపెన్‌ చేసి హాజరు నమోదు చేసుకోవాలి.. ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా సగం రోజు సెలవుగా పరిగణిస్తాం.. అదేవిధంగా సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే సమయంలోనూ హాజరు నమోదు చేయాలని’’ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి తప్పనిసరి చేయడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. తొలిరోజు ఉదయం హాజరుకు ప్రయత్నిస్తే మధ్యాహ్నం యాప్‌లో అప్‌లోడ్‌ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వర్‌ నెమ్మదిగా ఉండటంతో చాలా చోట్ల హాజరు నమోదు కాలేదని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

నందికొట్కూరు మండలం కొణిదెల పాఠశాలలో హాజరుకు ఉపాధ్యాయుల ఇక్కట్లు

గ్రామీణ ప్రాంతాల్లో ఆటంకం

గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సమస్య వేధిస్తోంది. ఆత్మకూరు, కొత్తపల్లి, వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది, ప్యాపిలి, కోసిగి వంటి చోట్ల సమస్య తీవ్రంగా ఉంది. నాణ్యమైన యంత్రాలు సమకూర్చి, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.


గంటల తరబడి యాప్‌లతోనే

* ఉదయం తొమ్మిది గంటల్లోపే ముఖ ఆధారిత హాజరు వేయాలి. ప్రస్తుతం సర్వర్‌ నెమ్మదిగా ఉండటంతో హాజరు నమోదుకు ఎన్ని గంటలు నిరీక్షించాలో తెలియడం లేదు. తొమ్మిది తర్వాత నిమిషం ఆలస్యమైనా సగం రోజు సెలవుగా పరిగణిస్తారు.

* మరుగుదొడ్లు శుభ్రం చేయించిన చిత్రాలు తీసి టాయిలెట్‌ మానిటరింగ్‌ (టీఎంఎఫ్‌) యాప్‌లో అప్‌లోడు చేయాల్సి ఉంది. దీనికి దాదాపు 45 నిమిషాలు సమయం పడుతోంది.

* విద్యార్థుల హాజరునూ ముఖ ఆధారితంగానే వేయాల్సి ఉంటుంది. ఒక్క విద్యార్థికి అర నిమిషం పడుతుంది. ఒక పాఠశాలలో 60 మంది ఉంటే కనీసం అరగంట సమయం పడుతుంది. ఉమ్మడి జిల్లాలోని కొన్ని ఉన్నత పాఠశాలల్లో వెయ్యికిపైగా ఉన్నారు. ఆయా పాఠశాలల్లో ఎంత సమయం పడుతుందో అధికారులకే తెలియాలి. విద్యార్థి యాప్‌లో హాజరుతోపాటు, ఐఎంఎంఎస్‌లో రోజువారీ అటెండెన్స్‌లోనూ హాజరు వేయాల్సి ఉంటుంది.

* ఒకేసారి ఒకే సమయానికి ఉపాధ్యాయులందరూ ముఖ ఆధారిత హాజరుకు ప్రయత్నిస్తే సర్వర్‌ బలహీనంగా ఉండటంతో కష్టతరంగా మారింది. తీరా ఉదయం 9:05 గంటలకు ప్రార్థన ప్రారంభించి 9:15 గంటలకు తరగతి గదుల్లో విద్యార్థులను కూర్చొబెడతారు. మొదటి గంట చదువు చెప్పేదాని కంటే విద్యార్థుల హాజరు వేయడానికే సరిపోతుంది. ఆ తర్వాత మూత్రశాలలు, భోజన చిత్రాలు అప్‌లోడు చేయాల్సి ఉంటుంది. వీటిలో ఏ యాప్‌ మొరాయించినా ఉపాధ్యాయులకు నరకమే.


తిరుగుతూనే ఉంది

యాప్‌ పని చేయడం లేదని చరవాణులు చూపుతున్న ఉపాధ్యాయులు

యాప్‌ ఆధారిత హాజరుకు మంగళవారం డోన్‌ పట్టణం పాతపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చరవాణిల ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నించారు. సర్వర్‌ ఓపెన్‌ కాకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. విద్యార్థుల ఆన్‌లైన్‌ హాజరు, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన చిత్రాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు సర్వర్‌ సక్రమంగా పని చేయకపోవడంతో వారు దిక్కు తోచని పరిస్థితిలో ఉండిపోయారు. ప్రభుత్వం తప్పనిసరి అనడంతో చరవాణులను ముందు పెట్టుకుని ఎంత ప్రయత్నిస్తున్నా సర్వర్‌ తిరుగుతూనే ఉందని వారు పేర్కొన్నారు. డోన్‌ తాలూకా ఫ్యాప్టో ఛైర్మన్‌ జి.వెంకటరమణ మాట్లాడుతూ.. గందరగోళంగా ఉన్న స్కూల్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (సిమ్స్‌) ఏపీ హాజరు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయుల సొంత చరవాణుల్లో ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే వ్యక్తిగత డేటాకు భద్రత ఉండదని అభిప్రాయపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా మంది ఉపాధ్యాయులకు స్మార్ట్‌ ఫోన్లు లేవని, అందువల్ల ఈ యాప్‌ను వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిపై రాష్ట్ర ఫ్యాప్టో నాయకత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం ఇచ్చే వరకు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని ఉపాధ్యాయులను కోరారు.

- న్యూస్‌టుడే, డోన్‌ పట్టణం


ఆదోని పట్టణంలో నెహ్రూ మెమోరియల్‌ ఉన్నత పాఠశాలలో 36 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా కేవలం ఇద్దరే యాప్‌లో హాజరు శాతం నమోదు చేశారు. యాప్‌ పని చేయక మిగిలిన వారు చరవాణితో కుస్తీ పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ యాప్‌ పని చేయలేదని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

- ఆదోని విద్య


ఆదోని పట్టణంలోని మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో 45 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా ఒక్కరూ యాప్‌లో నమోదు చేయలేకపోయారు. ఆదోని నియోజకవర్గంలో దాదాపు అన్ని పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. హాజరు కోసమే ఇంత కుస్తీ పడితే విద్యార్థులకు పాఠం ఎప్పుడు చెప్పాలని కొందరు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.

- ఆదోని విద్య

ఉమ్మడి జిల్లాలో
ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 2,825
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు 13,458

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని