logo

సైనిక శిక్షణలో రవితేజం

ఎన్‌సీసీలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థి రవితేజ ఎన్‌సీసీ డ్రిల్‌, క్రమశిక్షణ, షూటింగ్‌ తదితర అంశాల్లో ప్రతిభ కనబరుస్తూ పలువురి చేత శభాష్‌ అనిపించుకుంటున్నారు.

Published : 02 Dec 2022 02:54 IST

షూటింగ్‌ శిక్షణలో రవితేజ

ఆదోని విద్య, న్యూస్‌టుడే: అనుకున్నది సాధించాలంటే పట్టుదల, సాధించాలన్న తపన ఉండాలి. ఓ యువకుడు తన ప్రత్యేకతను చాటుతున్నాడు. ఆదోని పట్టణానికి చెందిన కె.రవితేజ డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఎన్‌సీసీ క్యాడెట్‌గా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు. ఎన్‌సీసీలో ప్రతిభ కనబరచి ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ మిలటరీ అకాడమిలో శిక్షణకు ఎంపికయ్యాడు. ఆ యువకుడి విజయగాథ తెలుసుకుందామా..

పాఠశాల స్థాయిలోనే..

ఆదోని పట్టణం కౌడల్‌పేటలో నివాసం ఉంటున్న కె.శివన్న, సుజాత దంపతుల కుమారుడు కె.రవితేజ స్థానిక ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. శివన్న కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రవితేజ పాఠశాల చదువుకునే రోజుల్లోనే ఎన్‌సీసీలో చేరాలని ఆసక్తి ఉండడంతో ఈ కోర్సులో చేరి ఎ-సర్టిఫికెట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత కళాశాలలో ఎన్‌సీసీ అధికారుల ప్రోత్సాహంతో శిక్షణ తీసుకుంటున్నారు.


మిలటరీ శిక్షణకు ఎంపిక

ఎన్‌సీసీలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థి రవితేజ ఎన్‌సీసీ డ్రిల్‌, క్రమశిక్షణ, షూటింగ్‌ తదితర అంశాల్లో ప్రతిభ కనబరుస్తూ పలువురి చేత శభాష్‌ అనిపించుకుంటున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌లో గత ఏడాది జనవరిలో జరిగిన 76-ఇన్‌ఫ్రెంటరీ బ్రిగేడ్‌లో నిర్వహించిన 12 రోజుల శిక్షణలో రవితేజ పాల్గొని ప్రతిభ కనబరిచాడు. ఎన్‌సీసీ అధికారులు ఈ యువకుడి ప్రతిభను మెచ్చి ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ మిలటరీ అకాడమిలో శిక్షణ ఇచ్చేందుకు  ఎంపిక చేశారు. ఈ శిక్షణ డిసెంబరులో ఉత్తర్‌ఖాండ్‌ రాష్ట్రం డెహరాడూన్‌లో జరగనుంది. రాయలసీమ పరిధిలో నలుగురు యువ విద్యార్థులు ఎంపికైతే కర్నూలు నుంచి ఇద్దరు ఉండటం విశేషం.


దేశానికి సేవ చేయాలని..
- కె.రవితేజ, ఎన్‌సీసీ విద్యార్థి, ఆదోని

మొదటి నుంచి సైన్యంలో చేరాలని లక్ష్యం పెట్టుకున్నా. ఆ లక్ష్యంతోనే పాఠశాల, కళాశాలలో ఎన్‌సీసీ కోర్సు చేస్తున్నా. దీని వల్ల వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్‌సీసీ శిబిరాలకు వెళ్లా. అక్కడ ఇచ్చే శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది. ప్రధానంగా యువత చెడుమార్గంలో వెళ్లకుండా అనుకున్న లక్ష్యం ఎలా చేరుకోవాలో ఈ శిక్షణలో నేర్చుకున్నా. చదువు పూర్తయిన వెంటనే రక్షణ శాఖలో ఉద్యోగం సాధించి దేశానికి సేవ చేయాలని లక్ష్యం పెట్టుకున్నా. ఇండియన్‌ మిలటరీ అకాడమిలో శిక్షణ కోసం నేను ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ఎన్‌సీసీ అధికారులు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల ప్రోత్సాహం మరువలేను.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని