logo

ఇంధనం పీల్చేస్తున్న దోమలు

పురపాలక సంఘాల్లో దోమల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు దోమలు చొరబడి ఇంధనాన్ని పీల్చేస్తున్నాయి.

Published : 03 Jun 2023 01:57 IST

ఫాగింగ్‌ పేరుతో నిధుల పక్కదారి

డోన్‌లో పిచికారీ చేస్తున్న సిబ్బంది

న్యూస్‌టుడే, ఆదోని పురపాలకం,నగరపాలక సంస్థ, డోన్‌ పట్టణం: పురపాలక సంఘాల్లో దోమల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు దోమలు చొరబడి ఇంధనాన్ని పీల్చేస్తున్నాయి. అదేలా అని సందేహం కలుగుతోందా? దోమా.. దోమా.. ఎందుకు కుట్టావ్‌? అంటే పురపాలక సిబ్బంది ఫాగింగ్‌ చేయలేదు.. అందట. సిబ్బందిని అడిగితే.. వాటి నివారణకు నిధులు ఖర్చు చేస్తే.. మా జేబులెలా నిండుతాయని అన్నారట. ఇదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పురపాలక సంఘాల పరిస్థితి.

* ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పురపాలక సంఘాల్లో ప్రజలు దోమల బెడదతో బెంబేెలెత్తిపోతున్నారు. దోమల నివారణకు పటిష్టమైన నివారణ చర్యలు కానరావడం లేదు. రోజురోజుకు జనాభాతో పాటు పట్టణాల విస్తీర్ణం పెరుగుతోంది. దానికి తగ్గట్లు పారిశుద్ధ్య సమస్యలు పెరిగిపోతున్నా.. పూర్తిస్థాయిలో శుభ్రత పనులు జరగడం లేదు. సచివాలయాలు ఏర్పాటైనా.. ప్రజారోగ్య సిబ్బందిని నియమించినా ప్రయోజనం శూన్యమే. ఎక్కడా యంత్రాలు పట్టుకుని పిచికారీ చేసిన దాఖలాలు లేవు. రూ.లక్షలు వ్యయం చేసి కొనుగోలు చేసిన యంత్రాలు మూలన పడేశారు. గతంలో ఫాగింగ్‌ చేసిన వార్డుల్లో జనం నుంచి సిబ్బంది సంతకాలు తీసుకునేవారు. ఇలాంటి విధానమే లేకుండా పోయింది. రానున్నది వర్షాకాలం. దోమల బెడదతో రోగాలు వెంటాడుతాయి. ప్రజారోగ్య విభాగం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
*  గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు డోన్‌లో దోమల మందు పిచికారీ కోసం రూ.3.48 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపారు. గతేడాది మార్చి నుంచి జూన్‌ వరకు నాలుగు నెలల పాటు ఫాగింగ్‌ చేసిన దాఖలాలు లేవు. ఆ తర్వాత పైపై పనులు చేపట్టి మమ అనిపించారు. పాత ఫాగింగ్‌ యంత్రాలు మరమ్మతులకు గురవడంతో మూలన పెట్టారు. తాజాగా మరో రెండు కొత్తగా కొనుగోలు చేశారు. డోన్‌ పట్టణంలోనూ డీజిల్‌ పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


ఏటా ఖర్చు రూ.లక్షల్లో..

దోమల నివారణకు కర్నూలు నగరపాలక సంస్థలో రూ.50 లక్షలు, నంద్యాల పురపాలక సంఘంలో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు, ఆదోని రూ.10 లక్షలు, ఎమ్మిగనూరు రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలు, మిగిలిన మున్సిపాలిటీల్లో రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.
* దోమల నివారణలో మలాథియన్‌ ద్రావకం కీలకం. దాని పేరు చెప్పి కిరోసిన్‌ పోసి.. పైపైన ఫాగింగ్‌ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి యంత్రాల ట్యాంకు సామర్థ్యానికి తగ్గట్లు పెట్రోలు, డీజిల్‌లో మలాథియన్‌ మిశ్రమం కలిపి ఫాగింగ్‌ చేయాలి. ఇవేమీ పాటించకుండా మొక్కుబడిగా చేపడుతూ.. జేబులు నింపుకొంటున్నారు.


సొమ్ము చేసుకుంటూ..

దోమల నివారణలో ఉపయోగించే ఇంధనం పక్కదారి పడుతోంది. ఫాగింగ్‌ యంత్రాలకు, వాటిని వినియోగించే ఆటోలకు ఇంధనం అవసరం. పెట్రోలు, డీజిల్‌ కొనుగోలుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. కొనుగోలు కోసం పురపాలక సంఘం ఒప్పందం చేసుకున్న పెట్రోలు బంకుల్లో తీసుకున్న ఇంధనాన్ని వినియోగించకుండా పక్కదారి పట్టించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆదోని పట్టణంలోని ఓ పెట్రోలు పంపులో ఇలానే సిబ్బంది అమ్ముకుంటూ పట్టుబడ్డారు. కర్నూలులోనూ ఇంధనం అమ్ముకున్న ఘటన వెలుగుచూసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు